Moral Stories in telugu : ఒక అడవిలో ఎన్నో రకాల జంతువులు ఉండేవి. ఒకరోజు వాటి మధ్య ఒక చర్చ మొదలయ్యింది.
ప్రతీ జంతువూ నేనే గొప్పని, దేవుడికి నేనంటేనే చాలా ఇష్టమని వాదించాయి.
కానీ ఎవరు గొప్పో ఎవరు నిర్ణయిస్తారు ? ఎలా ?
ఏనుగు అడవిలో సవారీ చేయటానికి, ఒంటె ఎడారిలో ప్రయాణం చేయటానికి ఉపయోగపడతాయి. కుక్క విశ్వాసంగా ఉంటుంది. ఆవు పాలు ఇస్తుంది. ఈ విధంగా ప్రతి జంతువూ ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంటాయి.
జంతువుల మధ్య కలిగిన ఈ వాదనను ఆపడానికి దేవుడొక పరీక్ష పెట్టాలనే ఒక నిర్ణయానికి వచ్చాడు.
ఒక పేదవాడిగా దేవుడు మారువేషంలో మొదట అడవికి రాజైన సింహం దగ్గరికి వెళ్ళాడు.
“రాజా ! నాకు చాలా ఆకలిగా ఉంది. దయచేసి నాకు తినడానికి ఏమైనా ఇవ్వు” అని అర్థించాడు.
“వెళ్ళవయ్యా ! నాకే తినటానికి ఏమీ దొరకలేదు. ఇక నీకు ఎక్కడి నుంచీ తెచ్చేది. కాసేపు నా ముందు నువ్వుంటే నువ్వే నాకు ఆహారమవుతావు” అని సింహం గర్జించింది.
దేవుడు ఏనుగు దగ్గరకు వెళ్ళాడు.
“దయచేసి కొంచెం ఆహారం ఏర్పాటు చెయ్యగలవా” ? అని అడిగాడు.
ఏనుగు కోపంగా ఘీంకరించి “నాకే తినటానికి సరిపోవడం లేదు. ఇంకా నీకేం ఇస్తాను ?” అంది.
దేవుడు ఒంటె దగ్గరికి వెళ్ళి అడిగాడు.
“హాయ్ ! ఎవరు నువ్వు ? ఏ దేశం నుండీ వచ్చావు ? నీ తిండి నీవు సంపాదించుకోలేవా ? నా పొట్ట నింపుకోవడమే కష్టమైపోతోంది. వెళ్ళిపో” అంది ఒంటే.
ఇలా దేవుడు నిరాశపడకుండా ఆ అడవిలోని ప్రతి జంతువు దగ్గరకు వెళ్ళి అర్ధించాడు.
ఏ ఒక్కటీ కూడా పిడికెడు ఆహారం ఇవ్వటానికి ముందుకు రాలేదు. చివరకు దేవుడు ఒక కుందేలు దగ్గరకు వెళ్ళాడు.
“ప్రియమైన మిత్రమా ! ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాను. ఏదైనా తినడానికి పెట్టి నా ప్రాణాలు నిలిచేలా చెయ్యి” అని మొరపెట్టుకున్నాడు.
ఆ సమయంలో కుందేలు ఒక క్యారెట్ దుంపను తింటున్నది. దేవుడి అర్థింపు వినగానే కుందేలు తినడం ఆపి ఆ క్యారెట్ ముక్కను దేవుడికి ఇచ్చింది.
“ఈ చిన్న ముక్కతో నా కడుపెలా నిండుతుంది ?” సందేహంగా అడిగాడు దేవుడు.
“కొంచెంసేపు ఆగగలవా ? నీ ఆకలితీరేలా ఏదో ఒక ఏర్పాటు చేస్తాను” అని కుందేలు కొంచెం సేపు ఆలోచించింది. గబగబా ఎండిన కట్టెపుల్లల్ని పోగు చేసి రెండు రాళ్ళు పెట్టి వాటి మధ్య మంట రాజేసింది. తరువాత దేముడితో ఇలా చెప్పింది.
“నేస్తమా ! నాదగ్గిర నేను తప్ప ఏ పదార్థమూ లేదు. నన్ను ఈ మంటలో కాల్చుకొని తిను. కొంతలో కొంతయినా నీ ఆకలి తీరుతుంది” అని కుందేలు ఆ మంటలోకి దూకింది.
దేవుడు ఆశ్చర్యపోయాడు.
కుందేలు ఆ విధంగా చేస్తుందని ఆ ఆపద్భాంధవుడు కూడా ఊహించలేకపోయాడు. వెంటనే మంటల్లోంచి కుందేలును బయటకు తీశాడు.
“నువ్వు చిన్న జంతువు అయినా అందరికంటే గొప్పదానివి. ఈ ప్రపంచం నిన్ను చూసేలా నాదగ్గర ఉండే వరం నీకిస్తున్నాను” అన్నాడు దేవుడు.
దేవుడు కుందేలుకు చంద్రుడిలో స్థానం కల్పించాడు. ఆ రోజు నుండీ ప్రపంచమంతా కుందేలు రూపాన్ని చంద్రుడిలో చూడసాగింది.
నీతి : త్యాగం ఎప్పుడూ విలువైనదే!
also read news:
special stories : ఎనలేని అభిమానం, ఆదరణా పొందిన ఉదయ్ కిరణ్…
ICC: పాకిస్తాన్‌కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఐసీసీ… మరోసారి అలా చేస్తే ఇక అంతే..!