HometelanganaMLC Kavitha : ఓ మహిళను ఈడీ కార్యాలయానికి ఎలా పిలుస్తారు? సుప్రీంలో కవిత పిటిషన్‌!

MLC Kavitha : ఓ మహిళను ఈడీ కార్యాలయానికి ఎలా పిలుస్తారు? సుప్రీంలో కవిత పిటిషన్‌!

Telugu Flash News

MLC Kavitha Latest news : ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో రోజుకో ట్విస్ట్‌ వెలుగు చూస్తోంది. ఈ కేసులో ఇప్పటికే స్పీడు పెంచిన ఈడీ, సీబీఐ.. తాజాగా బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు నోటీసులిచ్చి సుదీర్ఘంగా విచారణ జరిపారు. దీంతోపాటు కవితను మరోసారి విచారణ చేసేందుకు రంగం సిద్ధమైంది. అయితే, ఈ కేసులో తాజాగా ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కార్యాలయానికి మహిళను విచారణకు పిలవచ్చా? అనే అంశంపై అత్యున్నత ధర్మాసనంలో కవిత పిటిషన్‌ దాఖలు చేశారు. ఓ మహిళను ఈడీ విచారణకు పిలుస్తోందని, ఇది పూర్తిగా చట్టవిరుద్ధమంటూ కవిత పేర్కొన్నారు.

ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కవిత తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. ఎమ్మెల్సీ కవిత ఫోన్‌ను సీజ్‌ చేసిన వ్యవహారాన్ని కూడా కవిత పిటిషన్‌లో ప్రస్తావించారు. తమకు ఇచ్చిన నోటీసుల్లో ఇతరులతో కలిపి విచారణ చేస్తామని చెప్పారని, అయితే, అలా చేయలేదంటూ కవిత వివరించారు. ముందుగా సమాచారం ఇవ్వకుండా సెల్‌ఫోన్‌ సీజ్‌ చేశారని తెలిపారు. సీఆర్పీసీ సెక్షన్‌ 160 ప్రకారం ఒక మహిళను ఆమె నివాసానికి వెళ్లి మాత్రమే విచారణ చేయాల్సి ఉంటుందని, దానికి విరుద్ధంగా ఈడీ కార్యాలయానికి పిలిపించడంపై కవిత అభ్యంతరం చెప్పారు.

దాంతోపాటు గురువారం చేపట్టనున్న విచారణ నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని కవిత కోరారు. ఈ నేపథ్యంలోనే కవితకు సుప్రీంకోర్టు షాక్‌ ఇచ్చింది. మధ్యంతర రిలీఫ్‌ ఇచ్చేందుకు ధర్మాసనం అంగీకరించలేదు. ఇక ఈ కేసు తదుపరి విచారణను మార్చి 24వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది. దీంతో గురువారం యథాతథంగా కవితను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. అయితే, ఈడీకి కొన్ని ఆప్షన్లను ఎమ్మెల్సీ కవిత ఇచ్చారు. వీటిలో మొదటిది ఇంటికొచ్చి విచారణ చేయాలని, రెండోది వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణకు ఏర్పాట్లు చేసుకుంటానని కవిత పేర్కొన్నారు.

అయితే, ఈ రెండు ఆప్షన్లను ఈడీ తిరస్కరించింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కవిత రాజధాని ఢిల్లీకి వెళ్లారు. మరోవైపు కవిత ఆధ్వర్యంలో ఢిల్లీలో రాజకీయ పార్టీలు, పౌర సామాజిక సంస్థలతో కలిసి రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో పార్లమెంటులో మహిళా రిజర్వేషన్‌ బిల్లు ప్రవేశపెట్టాలనే అంశంపై ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశానికి పలు పార్టీల మహిళా నేతలు, భారత జాగృతి సంస్థ ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

also read :

Viral Video: అమ్మాయిలూ.. బైక్‌పై ఇలాంటి ఫీట్లు అవసరమా? తృటిలో తప్పిన ప్రమాదం..

-Advertisement-

Viral Video : ఫూటుగా తాగి మండపంలోనే నిద్రపోయిన పెళ్లికొడుకు..

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News