HometelanganaBRS : ఖమ్మం సభకు మూడు రాష్ట్రాల సీఎంలు.. జాతీయ రాజకీయాలపై కేసీఆర్‌ డిక్లరేషన్‌ ప్రకటిస్తారా?

BRS : ఖమ్మం సభకు మూడు రాష్ట్రాల సీఎంలు.. జాతీయ రాజకీయాలపై కేసీఆర్‌ డిక్లరేషన్‌ ప్రకటిస్తారా?

Telugu Flash News

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీని బీఆర్‌ఎస్‌ (BRS) గా మార్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ తాత్కాలిక కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు కేసీఆర్‌. తర్వాత ప్రత్యేక పూజలు, యాగం నిర్వహించారు. అనంతరం ఢిల్లీలోనే దాదాపు వారం పాటు మకాం వేసిన కేసీఆర్‌.. జాతీయ రాజకీయాలపై వ్యూహాలకు పదును పెట్టారు. ఢిల్లీలోనే భారీ ఎత్తున సభ నిర్వహించాలని భావించినా కొన్ని కారణాల వల్ల ఆ సభ వేదికను మార్చుకున్నారు కేసీఆర్‌. తాజాగా తన సత్తా చాటేందుకు ఖమ్మం వేదికగా భారీ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి.

భారత రాష్ట్ర సమితి ఆవిర్భావం తర్వాత జరిగే మొట్టమొదటి బహిరంగ సభ కావడంతో పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దారులన్నీ ఖమ్మం గుమ్మానికి క్యూ కట్టాయి. తమ అధినేత కేసీఆర్‌కు ఘనస్వాగతం పలుకుతూ ఖమ్మంలో భారీ స్వాగత తోరణాలు, హోర్డింగులు, ఫ్లెక్సీలు వెలిశాయి. ఐదు లక్షల మంది కార్యకర్తలు సభకు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. అందుకనుగుణంగా 100 ఎకరాల్లో శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం ఖమ్మం కొత్త కలెక్టరేట్ సమీపంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.

ఖమ్మం సభతో జాతీయ రాజకీయాలపై తన పూర్తి స్థాయి డిక్లరేషన్‌ ప్రకటించేందుకు సీఎం కేసీఆర్‌ సిద్ధమైనట్లు తెలుస్తోంది. కేసీఆర్‌ చేసే ప్రసంగంపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో బీజేపీని, మోదీని ఎదుర్కొనేందుకు ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తారో ఈ సభలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. సభను విజయవంతం చేసేందుకు ఉమ్మడి జిల్లాలోని 13 నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు తరలి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గులాబీ శ్రేణుల కోసం బస్సులు, లారీలను సమకూరుస్తున్నారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా సభా ప్రాంగణంలో 400 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. 15 వేల మంది వీఐపీలకు ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు.

మూడు రాష్ట్రాల సీఎంలు, జాతీయ నేతల హాజరు..

ఖమ్మం సభకు జాతీయ పార్టీల నాయకులు వస్తున్నారు. పంజాబ్ సీఎం భగవంత్‌మాన్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, కేరళ సీఎం పినరయ్ విజయన్, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, సీపీఐ, సీపీఎం జాతీయ నాయకులు హాజరుకానున్నారు. సీఎం కేసీఆర్ సహా నలుగురు ముఖ్యమంత్రులు, జాతీయ నాయకులు కూర్చునేందుకు భారీ వేదిక సిద్ధమవుతోంది. ఈ సభ దేశ రాజకీయాలను మలుపు తిప్పుతుందని ఇప్పటికే మంత్రి హరీష్‌ రావు చెప్పారు. సీఎంలు, జాతీయ నేతలు తొలుత యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న తర్వాత బహిరంగ సభకు వెళ్లనున్నారు.

also read:

NTR: జూనియర్ ఎన్టీఆర్‌ని క‌లిసిన టీమిండియా క్రికెట‌ర్స్.. పిక్ అదిరిపోలా..!

-Advertisement-

Karnataka Congress : కర్ణాటకలో హీటెక్కిన ఎన్నికల ప్రచారం..

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News