JP Nadda: తెలంగాణలో బీజేపీ, కేసీఆర్ బీఆర్‌ఎస్ మధ్య ప్రత్యక్ష మాటల యుద్ధం జరుగుతోంది. గత ఎన్నికల నుంచి తెలంగాణలో పాగా వేయాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. అందులో భాగంగా ఏకంగా నలుగురు బీజేపీ ఎంపీలను గెలిపించుకోవడంతో బీజేపీకి ఊపు వచ్చింది.
ఇక జాతీయ నేతలంతా తెలంగాణపై వాలిపోతున్నారు. రాష్ట్రంలో కీలక నేతలను బీజేపీలోకి చేర్చుకోవడాన్ని ముమ్మరం చేశారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నేతలను చాలా వరకు వచ్చిన వారిని వచ్చినట్లు లాగేసుకున్నారు.
అసెంబ్లీ స్థాయిలో టికెట్లు ఖరారు చేసుకొని కొందరు కీలక నేతలు బీజేపీలోకి ఇప్పటికే చేరిపోయారు. ఇక బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ని నియమించడంతో అప్పటి నుంచి నిర్విరామంగా ప్రభుత్వంపై పోరాటం, మాటల తూటాలు పేల్చుతున్నారు బండి సంజయ్. పాదయాత్ర కూడా చేపట్టిన బండి సంజయ్.. ఇప్పటి వరకు ఐదు విడతలుగా పాదయాత్ర చేశారు.
ఐదో విడత పాదయాత్ర ముగింపు సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ప్రకాశ్ నడ్డాను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.
బెంగళూరు పర్యటన ముగించుకొని నిన్న కరీంనగర్‌కు హెలికాప్టర్ ద్వారా చేరుకున్న జేపీ నడ్డా.. ఐదు విడతల పాదయాత్ర చేసిన బండి సంజయ్‌ని అభినందించారు.
ప్రధాని నరేంద్ర మోదీ సైతం బండి సంజయ్ దూకుడును, బీజేపీని ముందుకు తీసుకెళ్తున్న తీరును అభినందించినట్లు తెలుస్తోంది.
బీజేపీ మరింత దూకుడు పెంచే ఛాన్స్..
కరీంనగర్ సభలో జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని చెప్పారు. బీఆర్‌ఎస్ పార్టీకి ప్రజలు వీఆర్‌ఎస్ ఇస్తారని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ తీరు ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతా అన్నట్లు ఉందని సెటైర్ వేశారు. త్వరలోనే తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు జేపీ నడ్డా.
ఇక బండి సంజయ్ మాట్లాడుతూ.. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని మండిపడ్డారు. ఉద్యోగులకు జీతాలివ్వలేని స్థితికి తెచ్చారంటూ.. ప్రసంగం మధ్యలో భావోద్వేగానికి లోనయ్యారు.
ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా నెగ్గాలని బీజేపీ పట్టుదలతో ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఎన్నికలు సమీపిస్తుండడంతో మరింత దూకుడుగా బీజేపీ క్షేత్రస్థాయిలోకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది.
also read news:
Shahrukh Khan: బేషరం హాట్ సాంగ్ విమర్శలపై షారుఖ్ కౌంటర్.. ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఏమన్నాడంటే..!
masala dondakaya curry : మసాలా దొండకాయ కర్రీ