YSRCP : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలోని అధికార పార్టీలో అసంతృప్తి వెళ్లగక్కే ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతోంది. ఇటీవలే ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నలుగురిని వైఎస్సార్‌సీపీ అధిష్టానం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.
నెల్లూరులో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, గుంటూరు జిల్లాలోని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వ సలహాదారు, అధికార పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి గతంలోనే స్పష్టం చేశారు. అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేతల సంఖ్య మాత్రం తగ్గడం లేదు.
తాజాగా అధికార పార్టీకి చెందిన అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అసంతృప్తి గళం వినిపిస్తున్నారు. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందంటూ.. సీఎం జగన్ స్పందించాలన్నారు.
జగన్‌ను నమ్ముకున్న కింది స్థాయి కార్యకర్తలకు న్యాయం జరగాల్సిన అవసరం ఉందన్నారు. సీఎంను నమ్ముకున్న వారు రోడ్డున పడుతున్నారని, పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కారణమైన కార్యకర్తలను పట్టించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. శింగనమల నియోజకవర్గంలోని కొన్నిమండలాల్లో అధికారులు నియంతలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
యల్లనూరు మండలంలో 18 ఫ్యాక్షన్ గ్రామాలు ఉన్నాయన్న ఎమ్మెల్యే పెద్దారెడ్డి.. ఆ మండలంలో ఆటవిక రాజ్యం నడుస్తోందని ఆరోపణలు చేశారు. అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న పెద్దారెడ్డి.. ప్రభుత్వంలో సొంత పార్టీ కార్యకర్తలకే అన్యాయం జరుగుతోందని విమర్శించారు. ఓ దళిత మహిళా ఎంపీపీని పరిగణనలోకి తీసుకోలేని పరిస్థితి దాపురించిందన్న ఆయన.. దళిత మహిళ ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలోనే ఆ సామాజిక వర్గానికి ప్రాధాన్యం దక్కడం లేదన్నారు.
యల్లనూరు, పుట్లూరు మండలాల్లో వర్గ విభేదాలు, ఫ్యాక్షన్ కక్షలు సృష్టించడం దారుణమని కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. ఈ మండలాల్లో కొందరు అధికారుల పోకడ వల్ల ఇబ్బందులు వస్తున్నాయన్నారు. దంతలపల్లిలో ఫ్యాక్షన్ మొదలైతే లింగాల, సింహాద్రిపురం మండలాలకు ఇది వ్యాప్తి చెందుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో అధికార పార్టీ ఎమ్మెల్యే ఇలా బహిరంగంగా అధికారులపై వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. అయితే, అధికారులపై విరుచుకుపడటం తాడిపత్రి నేతలకు అలవాటైన పనేనని, గతంలో జేసీల హవా నడిచినప్పుడు కూడా అధికారులను నానా మాటలు అన్నారని కొందరు గుర్తు చేస్తున్నారు.
also read :
Agent Telugu Movie Review : ‘ఏజెంట్’ తెలుగు మూవీ రివ్యూ
‘Ponniyin Selvan 2′ Review :’పొన్నియన్ సెల్వన్ 2’ తెలుగు మూవీ రివ్యూ