Telugu Flash News

కొలెస్టరాల్ (CHOLESTEROL) అంటే ఏంటి ? కొలెస్టరాల్ ఎక్కువయితే ఏమవుతుంది?

cholesterol

కొలెస్టరాల్ (CHOLESTEROL) రక్తంలోని ప్లాస్మాలో ఉండే ఒక రకమైన క్రొవ్వు పదార్థం. ఇది కాలేయంలో తయారయ్యి రక్తంలోకి విడుదలవుతుంది. కొలెస్టరాల్ పరిమాణం సాధారణ స్థాయిలో ఉన్నప్పుడు శరీరంలో అది అనేక విధులను నిర్వర్తిస్తుంది. 100 మి.లీ. రక్తం యొక్క ప్లాస్మాలో 150-180 మి.గ్రా. వరకూ కొలెస్టరాల్ ఉంటుంది. దీని పరిమాణం 180 మి.గ్రా. కంటే ఎక్కువైతే రక్తనాళాలలో పేరుకుని రక్తప్రసరణకు ఆటంకం కలుగుతుంది.Cholesterol

మెదడులోని బూడిదరంగు పదార్థంలో 6 శాతం, తెల్లని పదార్థంలో 14 శాతం కొలెస్టరాల్ ఉంటుంది. మొటిమలకు కారణమయ్యే సబేషియస్ గ్రంథుల స్రావం, సీబంలో కూడా కొలెస్టరాల్ ఉంటుంది.

ఇది మన శరీరంలో విటమిన్ “డి” తయారీలోనూ, చర్మం పొడి ఆరిపోకుండా ఉంచటంలోనూ ముఖ్య పాత్ర వహిస్తుంది. కొలెస్టరాల్ లేకపోతే జీవకణ కుడ్యం (గోడ) సరిగ్గా ఉండదు.

శరీరంలో ఉన్న కొలెస్టరాల్ కాలేయంలో పిత్త లవణాలు (Bile Salts) గా మారుతుంది. ఈ లవణాలే పైత్యరసం ద్వారా జీర్ణనాళంలోకి ప్రవేశించి ఆహారాన్ని, క్రొవ్వుల్ని జీర్ణం చేస్తాయి. కనుక కొలెస్టరాల్ లేనిదే క్రొవ్వుల జీర్ణక్రియ పూర్తి కాదు.

కొలెస్టరాల్ నుంచే స్టిరాయిడ్ హార్మోన్లు (లైంగిక హార్మోన్లతో పాటుగా) తయారవుతాయి. అది లోపిస్తే హార్మోన్ల ఉత్పత్తి కుంటుపడుతుంది. రక్తంలో కొవ్వుల్ని రవాణా చేసే యంత్రాంగంలో లైపో ప్రొటీన్లు కీలక పాత్ర వహిస్తాయి.

ఈ లైపో ప్రొటీన్ల తయారీ కూడా కొలెస్టరాల్ ద్వారానే జరుగుతుంది. శరీరంలో కొలెస్టరాల్ లోపించినట్లయితే కణాల పెరుగుదల ఆగిపోతుంది.

కొలెస్టరాల్ (CHOLESTEROL) ఎక్కువయితే?

క్రొవ్వు తక్కువగా ఉన్న ఆహారం తీసుకున్నా, కొందరి రక్తంలో క్రొవ్వు పెరుగుతుంది. పిండి పదార్థాలు కూడా క్రొవ్వుగా | మారి నిలవ ఉండటం వలన ఇలా జరుగుతుంది.  ఆహారంలోని కెలోరీలలో క్రొవ్వు మోతాదు 40 శాతం కంటే ఎక్కువ ఉండకూడదు.

ఆహారంలో ఎక్కువగా నూనె, నెయ్యి, డాల్డా లాంటి క్రొవ్వు పదార్థాల్ని వాడితే రక్తంలో కొలెస్టరాల్ (Cholesterol), ట్రైగ్లిసరైడ్స్ (Triglycerides) అనే క్రొవ్వుల మోతాదు ఎక్కువవుతుంది. ఇవి చిన్న చిన్న ధమనుల ‘ లోపలి గోడలకు అతుక్కుని, రక్త నాళాలను ఇరుకుగా చేసి “డయాస్టోలిక్” ప్రెషర్‌ను పెంచుతాయి.

“atherosclerosis” అనే వ్యాధికి కారణమై, గుండెపోటు, మెదడులో రక్తనాళాలు చిట్లి పక్షవాతం లాంటి సమస్యలు వస్తాయి.

మరిన్ని వార్తలు చదవండి :

తల్లిపాలు ఇచ్చేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు

కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయా..ఈ ఆయుర్వేద చిట్కాల‌ను పాటించండి..!

Cold Remedies: జలుబు తగ్గడానికి ఏం చేయాలి? ఈ ఆయుర్వేద చిట్కాల‌ను పాటించండి..!

 

 

Exit mobile version