Weather Report : తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రెండు మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండగా, నేటి నుంచి మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఈ మేరకు వివరాలను వెల్లడించింది. అల్పపీడనం కారణంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా అనేక జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు.
ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో బుధవారం ఉదయం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేశారు. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్ సహా పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.
రాష్ట్రంలో జూలై 22 వరకు వర్షాలు కురుస్తాయని.. ఇప్పటికే పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం నుంచి బుధవారం ఉదయం వరకు చాలా చోట్ల వర్షం లేదా చినుకులు పడే అవకాశం ఉంది. దీంతో కాళేశ్వరం వద్ద వరద క్రమంగా పెరుగుతోంది. ఇక వర్షం కారణంగా భూపాలపల్లిలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో 8 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.
భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో సీఎస్ శాంతికుమారి సమీక్షించారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భారీ వర్షాల ముప్పు కారణంగా… ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి అత్యవసరమైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.
ఏపీలో వర్షాలు..
ఆంధ్రప్రదేశ్ (ఏపీ)లో రానున్న నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. IMD అంచనా ప్రకారం, వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరం వెంబడి వాయుగుండం కొనసాగుతుందని, దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. . దీని ప్రభావంతో రానున్న నాలుగు రోజులపాటు రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వ్యవసాయం చేసే రైతులు, వ్యవసాయ కూలీలు, గొర్రెల కాపరులు పిడుగులు పడే సమయంలో చెట్ల కింద ఉండవద్దని సూచించారు. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.