Saturday, May 11, 2024
HomedevotionalRamayanam : రామాయణం.. శ్రీరాముని రమణీయ చిరస్మరణీయ కావ్యం చదివి తరించండి..!

Ramayanam : రామాయణం.. శ్రీరాముని రమణీయ చిరస్మరణీయ కావ్యం చదివి తరించండి..!

Telugu Flash News

ramayanam story in telugu

శ్లో॥ కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరమ్ |

ఆరూఢ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలమ్ ॥

కవి కోకిల వాల్మీకి రచించిన శ్రీరాముని రమణీయ చిరస్మర ణీయ కావ్యం రామాయణం. “రామో విగ్రహవాన్ ధర్మః” మూర్తీభవించిన ధర్మమే రాముడంటే ! అలాంటి రామ చరితమే రామాయణం.

అయోధ్య రాజధానిగా త్రేతా యుగంలో భారతావనిని పాలించిన గొప్పరాజు దశరథ మహారాజు. ఈయన సూర్య వంశమునకు చెందినవాడు. దశరథునికి కౌసల్య, సుమిత్ర, కైకేయి అని ముగ్గురు రాణులు. అయినా రాజుకు సంతాన ప్రాప్తి కలుగలేదు. అప్పుడు కులగురువైన వశిష్టుని ప్రోద్బలంతో వంశోద్ధారకుడైన పుత్రుల కోసం ‘పుత్రకామేష్ఠి’ యాగం చేశాడు దశరథుడు.

యాగఫలంగా అగ్నిదేవుడు ప్రత్యక్షమై దశరథునికి పాయసపాత్రను అనుగ్రహించి భార్యలచేత ఆ పాయసాన్ని తాగించమన్నాడు. యజ్ఞపాయసాన్ని సేవించిన దశరథ రాజు భార్యలు కౌసల్య. సుమిత్ర, కైకేయిలు, వరుసగా రామ, లక్ష్మణ శతృఘ్న, భరతులనే తేజోవంతులైన పుత్రులను కన్నారు.

-Advertisement-

రాముడు అందరికీ జ్యేష్ఠుడు. నీలమేఘశ్యాముడు – ఆజాను బాహువు. అన్నిటికీ మించి శాంత గంభీర సౌజన్య మూర్తి. చిరుత ప్రాయంలోనే క్షత్రియోచిత విద్యలన్నింటియందూ నిష్ణాతులయ్యారు దాశరథులంతా. సకల ధర్మ, తర్క మీమాంసాది శాస్త్రాలన్నీ ఔపోసన పట్టారు. ఆ కాలంలో రాక్షసుల బెడద ఎక్కువగా వుండేది.

లోకక్షేమం కోసం నిత్యం యజ్ఞయాగాలు చేసే ఋషులను, తపస్సు చేసే మునులను అనేక విధాలుగా పీడించే వారు రాక్షసులు. బలగర్వంతో వారి క్రతువుల్ని ధ్వంసం చేసి భగ్నం చేసేవారు. వారిని ప్రతిఘటించి ప్రజలను రక్షించే ప్రభువులే కరువయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో ఋషులంతా కలిసి ఒక గొప్ప యాగం చేయాలనుకున్నారు.

ఆ యాగ రక్షణ కోసం యోగ్యుడైన వీరక్షత్రియుడు ఒక్క రాముడే అని తెలుసు కున్నాడు విశ్వామిత్ర మహర్షి. వెంటనే దశరథుడి దగ్గరికి వచ్చి యాగరక్షణకు రాముడిని పంపమని అడిగాడు. కంగారుపడిన దశరథుడు వశిష్ఠముని పల్కిన ధైర్య వచనాలతో సమాధానపడి రామలక్ష్మణులను విశ్వామిత్రునితో అడవులకు పంపాడు.

రామలక్ష్మణుల ఎంతో శౌర్యపరాక్రమాలతో రాక్షసమూ కలను చీల్చి చెండాడి యాగం నిర్విఘ్నంగా పూర్తయ్యేలా చూశారు. విశ్వామిత్రుడు సంతోషించి వారికి ఎన్నో దివ్యాస్త్రాలు ప్రసాదించాడు.

విశ్వామిత్రునితో అయోధ్యకు తిరిగి వస్తూ రామలక్ష్మణులు మిధిలా నగరానికి వెళ్ళారు. మిధిలకు రాజు జనక మహరాజు. ఆయన పుత్రిక సీత. ఆమె వివాహానికై స్వయంవరం ప్రకటించాడు జనకుడు. ఆ స్వయంవరంలో ఎవ్వరికీ సాధ్యం కాని శివధనుర్భంగం చేసి సీతను పెండ్లాడాడు శ్రీరాముడు.

అయోధ్య ప్రజలంతా ఎంతో సంతోషించారు. దశరథుడు శ్రీరామ పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేశాడు. కానీ దశరథుని మూడో భార్య కైకేయి తన కొడుకు భరతుడే రాజు కావాలనీ, రాముడు అడవికి పోవాలనీ వరం కోరింది. దశరథుడు ఆ మాటలు విని మూర్ఛపోయాడు. ఎప్పుడో రెండు వరాలు కోరుకోమని కైకను అనుగ్రహించాడు దశరథుడు. కానీ యిలాంటి కోరిక కోరుతుందని ఊహించలేదు.

14 ఏళ్ళు అరణ్యవాసం

పితృవాక్య పాలనకోసం సర్వభోగభాగ్యాలనూ, రాజ్యాధి కారాన్నీ సంతోషంగా త్యాగం చేసి అడవులకు ప్రయాణ మయ్యాడు రాముడు. భర్తను విడిచి వుండలేని సీత, అన్న లేక జీవించలేని లక్ష్మణుడూ శ్రీరాముని అనుసరించారు. దశరథుడు వరం యిచ్చిన విధంగా కైకేయి కోరినట్లు 14 ఏళ్ళు అరణ్యవాసం చేయడానికి పయనమయ్యారు సీతారామలక్ష్మణులు. అయోధ్య ప్రజలంతా వారివెంట అడవులకు నడిచారు. కానీ రాముడు వారించి అందరినీ తిరిగి అయోధ్యకు పంపాడు.

ramayanam story in teluguఅటవీ సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ, ప్రకృతి అందాలకు పరవశులవుతూ వన్యప్రాణులకూ, ఆటవిక జాతులకు ధర్మ మార్గాన్ని బోధిస్తూ ప్రశాంతంగా శ్రీరాముడు వనవాస దీక్షనాచరిస్తుండగా ఒక ఘోరం జరిగింది. రావణుడనే రాక్షస చక్రవర్తి సీత సౌందర్యానికై వ్యామోహపడి, రామలక్ష్మణులు లేని సమయం చూసి సీతను అపహరించుకుపోయాడు.

సీతాన్వేషణ

రాముడు శిలలు కరిగేలా రోదించాడు. లక్ష్మణుడితో కలిసి అడవి అంతా సీత కోసం గాలిస్తున్నాడు. ఇంతలో ‘జటాయువు’ అనే రాబందు సీతను రావణుడు ఎత్తుకుపోతుండగా చూశాననీ, వాడు లంకాధిపతి అయిన రాక్షసరాజు అనీ చెప్పింది. రామలక్ష్మణులు మరికొంత ముందుకుపోగా ఆంజనేయుడు. సుగ్రీవులతో స్నేహం కుదిరింది. సీతను వెదికే పనికి తన శక్తి మేరకు కృషి చేస్తానని మాట యిచ్చాడు వానర రాజైన సుగ్రీవుడు. అందుకు ప్రతిగా అతని నుండి రాజ్యం లాక్కొన్న అతని అన్న వాలిని వధించి సుగ్రీవుని వానరరాజ్యానికి రాజుగా చేశాడు రాముడు.

ramayanam story in teluguసీతాన్వేషణ ప్రారంభమయ్యింది. హనుమంతుడు సముద్రాన్ని అవలీలగా దాటి లంకానగరం చేరుకున్నాడు. అక్కడ అశోకవనంలో తీరని శోకంతో వున్న సీతను చూశాడు. గుర్తుగా రాముడిచ్చిన ఉంగరాన్ని యిచ్చి ఆమెకు ధైర్యం చెప్పాడు. త్వరలో రాముడు లంకపై దండెత్తి రావణుని సంహరించి సీతను సగర్వంగా చేపడతాడని చెప్పాడు హనుమంతుడు. హెచ్చరికగా లంక నగరాన్ని కాల్చి సీత గుర్తుగా యిచ్చిన చూడామణితో తిరిగి వచ్చాడు హనుమంతుడు.

రావణ సంహారం

లంకపై దండయాత్ర ప్రకటించాడు రాముడు. హనుమం తుడు, సుగ్రీవుడు, అంగదుడు, జాంబవంతుడు, నీలుడు మొద లైన వానర వీరుల వెంట వేలాది కపివీరులు సింహనా దాలు చేస్తుండగా సముద్రం మీద రాళ్ళతో వారధి కట్టి లంకపై ముట్టడి చేశాడు శ్రీరాముడు.

ramayanam story in teluguపరుల భార్యను చెరపట్టడం అధర్మం అని చెప్పినందుకు దేశం నుండి తమ్ముడైన విభీషణుడిని వెళ్ళగొట్టాడు రావణాసురుడు. విభీషణుడు ధర్మపక్షం వహిస్తూ రాముడిని శరణు కోరాడు. రాముడు ఆశ్రితజన రక్షకుడు – అనుమతించాడు. పది తలల రావణాసురుడిని మహాసంగ్రామంలో కుంభకర్ణ, ఇంద్రజిత్ సహితంగా సంహరించాడు.

శ్రీరామ పట్టాభిషేకం

శ్రీరాముడు, సీతా లక్ష్మణహనుమ, సుగ్రీవాది సర్వవానర సహితంగా పుష్పక విమానంలో అయోధ్య చేరాడు శ్రీరాముడు. అన్నగారి రాక కోసం రాజ్యాధికారం స్వీకరించకుండా వేచి వున్నాడు భరతుడు ఈ 14 ఏళ్ళుగా ! శ్రీరాముడు అయోధ్య చేరగానే రాజ్యం అన్నగారికి అప్పగించి సేవకుడై పక్కన నిలిచాడు భరతుడు. వెంటే శతృఘ్నుడు.

ramayanam story in teluguఅంగరంగ వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం జరిగింది. రాముడు ప్రజలను కన్న బిడ్డలకంటే ఎక్కువగా భావించి రాజ్యపాలన చేశాడు. ప్రజలు సకల సౌకర్యాలతో, భోగభాగ్యాలతో జీవించారు. సంవత్సరంలో ఋతువులు తమ ధర్మాలను పాటించాయి. ‘లేమి’ అనేది ఆ రాజ్యంలో లేదు. ‘రామరాజ్యం’గా ప్రఖ్యాతిగాంచింది.

ఇది స్థూలంగా రామాయణ కథ. ఇందులో మానవధర్మం వివరంగా చెప్పబడింది. మనిపై పుట్టినవాడు వ్యక్తిగా, భర్తగా, సోదరునిగా, పుత్రునిగా ఏ ఏ ధర్మాలు ఆచరించాలో రాముడు ఆచరించి చూపాడు. స్త్రీలందరికీ ఆదర్శంగా సీత జీవించింది. మానవజాతికి ఆదర్శప్రాయమైన జీవన గ్రంధం రామాయణం.

శ్రీమద్రామాయణం ఆదికావ్యమే కాకుండా, భారతీయ ధార్మిక జీవనాన్ని, సంస్కృతీ వికాసాన్ని తెలియచెప్పే మహాకావ్యం. భారతం – చతుర్విధ పురుషార్ధాలను చెప్పి, యీ ప్రపంచంలో వాటిని యెలా సాధించాలో ఆ సాధన యేమిటో, ధర్మాచరణం వల్ల కలిగే పరమప్రయోజనం ఏమిటో, అలాగే మనిషి కర్మ భూమిలో పుట్టినందుకు కర్మనిష్ఠను ఏ విధంగా నిర్వహించాలో, కర్తవ్య నిర్వహణ ఏ విధంగా చేస్తే కర్మబంధం కాదో, మనిషి యొక్క జననం యే విధంగా సర్వోత్కృష్టమైనదో ధర్మసూక్ష్మాలను బోధిస్తూ జ్ఞానప్రబోధం కలుగజేస్తూ, కర్తవ్యాన్ని, నిర్దేశిస్తూ ముందుకు సాగిపోతుంది.

శ్రీమద్రామాయణంలో సుమిత్రా నందనుడు, సర్వసులక్షణలక్షితుడగు లక్ష్మణుడు, చిద్రూపుడైన జీవునివలె పరమాత్మస్వరూపుడగు శ్రీరామచంద్రునే ఎల్లవేళలా వెన్నంటి వుంటాడు! అన్ని సన్నివేశాలు లోను వారి సహజీవనాన్ని మనం దర్శించగలం.

also read :

Devotional: సనాతన ధర్మం ప్రకారం నిత్య పూజ ఎలా చేసుకోవాలి?

Shivalingam : శివలింగం ఆకారం మెదడులోని ఈ భాగం వలె ఉంటుంది.. పనితీరు మరియు ప్రాముఖ్యతను తెలుసుకోండి

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News