Weather Report : రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్ ప్రాంతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మధ్య అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావంతో దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, అండమాన్ నికోబార్ దీవుల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
అంతేకాకుండా , ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు, పలు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, గంటకు 40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. మంగళవారం హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మూడు గంటల పాటు వర్షం కురిసింది. కొన్ని చోట్ల తేలికపాటి వర్షం, మరికొన్ని చోట్ల భారీ వర్షం కురిసింది.
భద్రాద్రి-కొత్తగూడెంలోని మద్దుకూరులో అత్యధికంగా 10 సెంటీమీటర్లు, యాదాద్రి భువనగిరిలోని నారాయణపూర్‌లో 7.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్న మూడు రోజుల పాటు హైదరాబాద్, మహబూబ్ నగర్, వికారాబాద్, నల్గొండ, సూర్యాపేట, నారాయణపేట, రంగారెడ్డి జిల్లాలతో పాటు మేడ్చల్-మల్కాజిగిరి, వరంగల్, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.