HomeinternationalTrump: మళ్లీ నోరు పారేసుకున్న ట్రంప్‌.. సీఎన్‌ఎన్‌ ఇంటర్వ్యూలో తిట్ల దండకం!

Trump: మళ్లీ నోరు పారేసుకున్న ట్రంప్‌.. సీఎన్‌ఎన్‌ ఇంటర్వ్యూలో తిట్ల దండకం!

Telugu Flash News

Trump: యూఎస్‌ మాజీ ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌కు నోటి దురుసు అని అందరికీ తెలిసిందే. తాజాగా మరోసారి ఆయన తిట్ల దండకం అందుకున్నారు. పదే పదే అబద్దాలు వల్లె వేస్తున్న ఆయన.. ఓ ఇంటర్వ్యూలోనూ ఇదే వరుస కలిపారు. రాబోయే సంవత్సరం జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీలో నిలబడతానని ఇప్పటికే స్పష్టం చేసిన ట్రంప్‌.. అందుకు తగినట్లు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తాజాగా బుధవారం సీఎన్‌ఎన్‌ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు.

2020 ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిగిందని ట్రంప్‌ మరోసారి ఆరోపణలు చేయడం గమనార్హం. న్యాయస్థానాలు రిగ్గింగుకు ఆధారాలు లేవని తేల్చినా ట్రంప్‌ పదే పదే ఈ ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని పలువురు పెదవి విరుస్తున్నారు. 2020లో అధ్యక్షునిగా జో బైడెన్‌ ఎన్నికను సవాలు చేస్తూ ట్రంప్‌ మద్దతుదారులు పార్లమెంటు (కాంగ్రెస్‌)పై దండయాత్ర చేసిన సంగతి తెలిసిందే. బైడెన్‌ ఎన్నికను ధ్రువీకరిస్తూ నాటి ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ చేస్తున్న ప్రకటనను అడ్డుకోవడానికి వీరంతా ప్రయత్నాలు చేశారు.

గడచిన అధ్యక్ష ఎన్నికల సందర్భంగా నానా రచ్చ చేసిన ట్రంప్‌.. ఎన్నిక ఫలితాన్ని నిలిపివేసే అధికారం పెన్స్‌కు లేకపోయినా ఉందని చెబుతూ బుకాయింపులకు పాల్పడ్డారు. పెన్స్‌ తప్పు చేశారని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పునరుద్ఘాటించారు ట్రంప్. నాడు కాంగ్రెస్‌పై దండెత్తిన 670 మంది ట్రంప్‌ అనుచరులపై ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ట్రంప్‌ అనుయాయులపై విద్రోహ కుట్ర, పోలీసు అధికారులపై దాడి అభియోగాలు మోపారు. నాటి కాల్పుల్లో నల్లజాతికి చెందిన ఓ పోలీసు అధికారి మృత్యువాత పడ్డారు.

సదరు అధికారి దౌర్జన్యపరుడంటూ ట్రంప్‌ వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక 2024 అధ్యక్ష ఎన్నికలు నిజాయితీగా జరిగితేనే ఫలితాన్ని ఆమోదిస్తానంటూ వితండ వాదన చేశారు ట్రంప్. జీన్‌ కెరోల్‌ అనే జర్నలిస్టుపై ట్రంప్‌ లైంగిక వేధింపులు, దాడికి పాల్పడినట్లు నిర్ధారించిన న్యూయార్క్‌ కోర్టు జ్యూరీ.. కెరోల్‌కు ట్రంప్‌ 50 లక్షల డాలర్ల పరిహారం చెల్లించాలని ఇటీవలే తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఇక సీఎన్‌ఎన్‌ ఇంటర్వ్యూలో ఇదంతా బోగస్‌ కేసంటూ ట్రంప్‌ కొట్టిపారేశారు. కెరోల్‌ పిచ్చిపట్టిన మనిషి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Read Also : Imran Khan: పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు ఊరట.. బెయిల్‌ మంజూరు

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News