‘ససురాల్ సిమర్ కా’ సీరియల్ ద్వారా పరిచయం అయ్యి ఆ తర్వాత పలు హిట్ సీరియల్స్ లో నటించిన 30 ఏళ్ల వైశాలి టక్కర్ (vaishali Takkar ) ఆదివారం తెల్లవారుఝామున 12.30 సమయంలో ఇండోర్ లోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
అధికారుల సమాచారం ప్రకారం ఇండోర్ లోని తేజాజి పోలీస్ స్టేషన్ పరిధిలో సాయి భాగ్ కాలనిలో నివాసముంటున్న టివి నటి వైశాలి టక్కర్ తన పొరుగున నివాసముండే వ్యాపారవేత్త రాహుల్ నవ్లాని వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు.
ఆమె నివాసంలో దొరికిన సూసైడ్ నోట్ ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న అధికారులు రాహుల్ కూడా అప్పటికే పరారీలో ఉన్నట్టు గుర్తించారు. వైశాలికి చెందిన పలు గాడ్జెట్స్ ఇంకా ఆమె డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వైశాలికి మరో వ్యక్తితో పెళ్లి జరగబోతుందని తెలుసుకున్న రాహుల్ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు అయితే రాహుల్ కి ఇదివరకే పెళ్లయిందని అయినా వైశాలిని ఈ విషయంపై వేధించేవాడని ఆమె సన్నిహితులు వాపోయారు.
అతని వేధింపులు తట్టుకోలేకే వైశాలి ఇటువంటి నిర్ణయం తీసుకుని ఉండవచ్చని, పోలీసులు కేసు దర్యాప్తు చేసి రాహుల్ ని వెతికే పనిలో ఉన్నారని ఏసీపీ రెహ్మాన్ మీడియాకి తెలిపారు. రాహుల్ దొరికిన తర్వాత వైశాలి ఆత్మహత్య గురించి మరిన్ని విషయాలు తెలిసే అవకాశముందని పోలీసులు అభిప్రాయపడ్డారు.
వైశాలి టక్కర్ స్వగ్రామం మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని. నటనలో అవకాశాల కోసం ఆమె ఉజ్జయిని నుండి ముంబైకి వచ్చి పలు అవకాశాలు దక్కించుకున్నారు. ఆమెకు 2021 ఎప్రిల్ 26న తన బాయ్ ఫ్రెండ్ అభినందన్ సింగ్ తో నిశ్చితార్ధం అయింది. గత సంవత్సరం నుండి తన తండ్రి , సోదరుడితో ఇండోర్ లో ఉంటున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
వైశాలి టక్కర్ తన చదువు ముగిసిన వెంటనే ‘ససురాల్ సిమర్ కా’ సీరియల్ లో అవకాశాన్ని పొందారు ఆ తర్వాత ‘ఏ రిష్ఠా క్యా కెహలతా హై’ ‘సూపర్ సిస్టర్స్’ ‘ఏ హై ఆషికి’ ‘మన్మోహిని’ వంటి హిట్ సీరియల్స్ లో నటించారు.
సోషల్ మీడియా లో వైశాలి యాక్టీవ్ గా ఉండటమే కాదు ప్రతిదీ తన ఫాలోవర్స్ తో పంచుకునేవారు. ఆమె ఆత్మహత్య తర్వాత తన సహా నటుడు సుశాంత్ సింగ్ రాజపుట్ ఆత్మహత్య చేసుకున్నప్పుడు “నేను నమ్మలేకపోతున్నాను సుశాంత్ ఇలా చేసుకోడు” అంటూ రెండు సంవత్సరాల క్రితం చేసిన ట్వీట్ ను ఇప్పుడు నెటిజెన్లు ట్రెండ్ చేస్తున్నారు.
అంతే కాదు అతని ఆత్మహత్య విషయం పై పలు అనుమానాలు కూడా తన ట్వీట్ లో వ్యక్తం చేసారు వైశాలి. ఇప్పుడు సరిగా రెండు సంవత్సరాల తర్వాత వైశాలి కూడా ఆత్మహత్య చేసుకోవడంపై పలు నెటిజెన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా హిందీ టెలివిజన్ పరిశ్రమ ఒక మంచి నటిని కోల్పోయింది.