Telangana: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్దం కావస్తున్న తరుణంలో అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ సర్కార్ సిద్ధమవుతోంది. ఈసారి ఉత్సవాలను 21 రోజులపాటు నిర్వహించాలని కసరత్తు మొదలు పెట్టారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర కీర్తిని చాటేలా, ప్రతి హృదయం ఉప్పొంగేలా పండుగ వాతావరణంలో రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించాలని ఆయన సూచించారు. ఉత్సవాలు 21 రోజులపాటు నిర్వహించాలన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 2 నుంచి 21 రోజులపాటు ఈ సంబురాలు జరుగుతాయని అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు ఉండాలన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల గురించి సచివాలయంలో సీఎం కేసీఆర్ ఉన్నత అధికారులతో సమీక్ష జరిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో మొదటిరోజు ఉత్సవాలను వైభవోపేతంగా జరపాలని నిర్ణయించారు. అదే రోజు రాష్ట్ర మంత్రులు వారి జిల్లా కేంద్రాల్లో ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనేలా కార్యాచరణ రూపొందించనున్నారు.
సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకొని 2023 జూన్ 2 నాటికి తొమ్మిదేళ్లు పూర్తి కానున్నాయన్నారు. పదో వసంతంలోకి అడుగు పెడుతున్న శుభ తరుణంలో.. రాష్ట్ర ప్రగతిని మననం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం సహకారంతో సమష్ఠి కృషితో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో గొప్ప ఫలితాలను సాధిస్తోందని గుర్తు చేశారు. దేశానికే తెలంగాణ రోల్ మోడల్‌గా అయ్యిందని ముఖ్యమంత్రి చెప్పారు. మహారాష్ట్రతోపాటు ఉత్తరాది రాష్ట్రాల నేతలు, ప్రజలు తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధిని చూసి సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారన్నారు.
తెలంగాణ అమరావీరులను గొప్పగా స్మరించేందుకు ఓ రోజును ప్రత్యేకంగా అమరవీరుల దినోత్సవంగా జరుపుకోవాలన్నారు. ఆ రోజు రాష్ట్రంలో ఉన్న అమరవీరుల స్తూపాలను పూలు, విద్యుద్దీపాలతో అలంకరణ చేయాలని, ఘన నివాళులర్పించాలని సూచించారు. వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ తుపాకీ పేల్చి గౌరవ వందనం సమర్పించాలన్నారు. ఇక రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో మిగిలిన 20 రోజులు వివిధ శాఖలు చూపిన ప్రగతిపై, ప్రభుత్వం పడిన శ్రమను, దార్శనికతను ప్రదర్శిస్తూ డాక్యుమెంట్‌ను రూపొందించాలన్నారు. అన్ని థియేటర్లలలో, టీవీల్లో ప్రసారమయ్యేలా చూడాలన్నారు.
Read Also : CBI Director: సీబీఐకి కొత్త డైరెక్టర్.. ఎవరీ ప్రవీణ్ సూద్ ?