Supreme Court Notice To TS Govt : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు సంబంధించి ఇంకా లెక్కలు తేలడం లేదు. ఉద్యోగుల విభజన, ఆస్తుల విభజన, ప్రాజెక్టులు, నిధులు.. ఇలా అనేక రకాల అంశాలపై ఇప్పటికీ పంచాయితీ తెగలేదు. తాజాగా దీనిపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు మెట్లెక్కింది. సమస్యను పరిష్కరించాలని కోరింది. ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్లో పలు కీలక అంశాలు ప్రస్తావించింది. విభజన సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నట్లు పేర్కొంది ఏపీ సర్కార్.
రాష్ట్ర విభజన తర్వాత ఆస్తుల పంపకాలు, విభజనపై అనేక కమిటీలు పని చేసినా ప్రయోజనం లేకపోయిందని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఆస్తుల పంపిణీపై సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వం ఇటీవల పిటిషన్ దాఖలు చేసింది. తెలంగాణ ప్రభుత్వం, కేంద్రాన్ని ప్రతివాదులుగా చేర్చింది. ఈ పిటిషన్పై సోమవారం విచారణ జరిపింది ధర్మాసనం. రాష్ట్ర విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్లోని సంస్థలను తక్షణమే విభజించాలని పిటిషన్లో ఏపీ ప్రభుత్వం కోరింది. షెడ్యూల్ 9, 10 సంస్థల విభజనలో తీవ్రజాప్యం జరిగిందని, ఈ సంస్థల విలువ దాదాపు రూ.1,42,601 కోట్లు ఉందని తెలిపింది.
విభజన వల్ల తీవ్రంగా నష్టపోయామంటూ ఏపీ ప్రభుత్వం పిటిషన్లో పేర్కొంది. ఆర్థిక లోటుతో సతమతం అవుతున్నామని, ఆస్తుల పంపిణీ త్వరగా జరిగేలా చూడాలని అత్యున్నత ధర్మాసనాన్ని కోరింది. దీనిపై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు అటు తెలంగాణ ప్రభుత్వానికి, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. కేంద్రం, తెలంగాణ తరఫున న్యాయవాదులు హాజరు కాకపోవడంతో ఇరువురికి సుప్రీం నోటీసులిచ్చింది.
తెలంగాణ సర్కార్ రిప్లై ఇస్తుందా?
ఏపీ ప్రభుత్వ పిటిషన్పై తదుపరి విచారణను సుప్రీం కోర్టు ఆరు వారాలకు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో తదుపరి విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ ఓవైపు సన్నిహితంగా ఉంటూనే విభజన పంచాయితీలు కూర్చొని మాట్లాడకుండా ఇలా కోర్టులకెక్కడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారమయ్యే వాటిపై ఇలా బహిరంగంగా కోర్టుల్లో పిటిషన్లు వేసుకోవడం రాజకీయ పబ్బం గడుపుకోవడానికేనన్న విమర్శలు వస్తున్నాయి.
also read:
TDP – Janasena : ఏపీలో ఆ రెండు పార్టీల పొత్తు ఖాయమా? పవన్ కల్యాణ్ ప్లాన్ ఏంటి?
SKY: కిందపడుతూ, మీద పడుతూ ఆ షాట్స్ సూర్య ఎలా ఆడగలుగుతున్నాడు…సీక్రెట్ చెప్పిన స్కై