కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ (Sonia Gandhi) తెలంగాణ నుంచి ఖమ్మం లోక్‌సభ (Khammam Lok sabha) కు పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం లోక్‌సభ నుంచి ఆమె పోటీ చేయడానికి అధిష్ఠానం ఆమోదం తెలిపినట్లు తెలిసింది.
తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని డిసెంబర్ 2022లో టీపీసీసీ తీర్మానం చేసింది. ఆ తర్వాత మరోసారి తీర్మానం చేసినప్పుడు సోనియా గాంధీ సానుకూలంగా స్పందించారు. గతంలోనే సూత్రప్రాయ అంగీకారం తెలిపినప్పటికీ, ఖమ్మం నుంచి పోటీ చేయడానికి అధిష్ఠానం తాజాగా క్లారిటీ ఇచ్చింది.
సోనియా గాంధీ తెలంగాణలో పోటీ చేస్తే, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు సానుకూల ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు.
సోనియా గాంధీ నామినేషన్ పత్రాలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు దాఖలు చేయనున్నారు. ఎన్నికల సమయంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి సోనియా గాంధీని ఆహ్వానించాలని రాష్ట్ర నేతలు నిర్ణయించారు.
ఖమ్మం నుంచి పోటీ చేస్తే, దక్షిణాది నుంచి సోనియా గాంధీ రెండవసారి లోక్‌సభకు పోటీ చేస్తున్నట్లు అవుతుంది. గతంలో కర్ణాటకలోని బళ్లారి నుంచి సోనియా గాంధీ పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే. ఖమ్మం నుంచి పోటీ చేయడం ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేసుకోవాలని కాంగ్రెస్ నేతలు యోచిస్తున్నారు.
ఈ వార్తపై మీ అభిప్రాయం ఏమిటి?