Friday, May 10, 2024
HomedevotionalMahabharatham story in telugu : మహాభారతం.. పరమాద్భుత రమ్యరసార్ణవ గ్రంథరాజం..

Mahabharatham story in telugu : మహాభారతం.. పరమాద్భుత రమ్యరసార్ణవ గ్రంథరాజం..

Telugu Flash News

Mahabharatham story in telugu : వేదవ్యాసునిగా ప్రసిద్ధి వహించిన కృష్ణద్వైపాయనునిచే లక్ష శ్లోకాలకు పైగా సంస్కృత భాషలో లిఖించబడిన అపురూప ధార్మిక గ్రంథరాజం ‘మహాభారతం’. దీనికి మొదట ‘జయ’మని పేరు. పరాశర పుత్రుడైన కృష్ణ ద్వైపాయనుడు తొలుత కేవలం 8,800 శ్లోకాలతో రచించిన ఐతిహాసిక గ్రంథం ‘జయం’ తర్వాత 24 వేల శ్లోకాలుగా ఆపై పెక్కు ఉపాఖ్యానాలను కలుపుకొని లక్షకుపైగా శ్లోకాలతో మహాభారతంగా అవతరించింది.

సంస్కృ తంలో వ్యాసుడు రాసిన భారతాన్ని తెలుగులో ‘కవిత్రయం’గా వినుతి కెక్కిన నన్నయ, తిక్కన ఎఱ్ఱాప్రగడలు రచించారు. అందువల్ల యిది ‘కవిత్రయ భారతం’గా ప్రఖ్యాతి వహించింది.

మానవ జీవితంలోని సంక్లిష్టతలను, రాగద్వేషాత్మకంగా పెచ్చరిల్లే పలు చిత్ర సంఘటనలను భారతంలో ప్రతిఫలించిన తీరు అద్భుతం ‘యది హాస్తి తదన్యత్ర యన్నే హాస్తి నతత్ క్వచిత్‘ ఇందు జరిగినవే అంతా జరిగాయి. ఇందు జరగనిది వేరెచటా జరుగదు అనేది భారతసారం.

ఆది, సభా, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ, శాంతి, అనుశాసనిక, అశ్వమేధ, ఆశ్రమావాస, మౌసల, మహాప్రస్థాన, స్వర్గారోహణమనే 18 పర్వాలతో ఎన్నెన్నో కథలు, ఉపకథలు, జీవిత చరిత్రలు, చిత్ర సంఘటనలు, లెక్కలేనన్ని మలుపులు, ధర్మ మర్మాలు, నీతి సూక్తులతో అలరారే పరమాద్భుత రమ్యరసార్ణవ గ్రంథరాజం మహాభారతం.

ఇప్పటికి సుమారు 5,000 సంవత్సరాల క్రితం జరిగినట్లుగా పండితులు నిర్ధారిస్తున్న ఈ ఇతిహాసపు స్థూల కథ యిది.

శకుంతలా దుష్యంతుల పుత్రుడైన భరతుని పేర భరత వంశం వృద్ధి చెంది ఎందరెందరో రాజులు భరత వర్షాన్ని పరిపా లించారు. వారిలో శంతనుడు గంగలకు జన్మించిన రాజు దేవ వ్రతుడనే భీష్ముడు.

-Advertisement-

తండ్రి సుఖం కోసం రాజ్యాన్ని త్యాగం చేసి సత్యవతీ శంతనులకు వివాహం జరిపిస్తాడు. సత్యవతి కుమా రులైన చిత్రాంగద, విచిత్రవీర్యులకు సంతానం లేకపోవడంతో సత్యవతి వేదవ్యాసుని ధ్యానిస్తుంది. విష్ణువు అంశగా అవతరించిన వేదవ్యాసుడు సత్యవతి కోడలు అయిన అంబికకు ధృత రాష్ట్ర, పాండురాజులనే పుత్రులను అనుగ్రహిస్తాడు.

ధృతరాష్ట్రుడు జ్యేష్ఠుడైనప్పటికీ అంధుడు కావడం వల్ల రాజ్య పాలనాధికారం పాండురాజు వహిస్తాడు. కానీ అన్నగారి మీద అభిమానంతో రాజ్యాధికారం ధృతరాష్ట్రునికే వదలి తాను వనవాస దీక్ష స్వీకరిస్తాడు.

ధృతరాష్ట్రునికి దుర్యోధన, దుశ్శాసన మొదలుగా గల నూరుమంది కుమారులు, దుస్సల అనే కుమార్తె కలుగుతారు.

అక్కడ పాండురాజుకు అందరికన్నా పెద్దవాడుగా, కురువంశ జ్యేష్ఠునిగా ధర్మరాజు జన్మించి, ఆ తర్వాత భీమ, అర్జున, నకుల, సహదేవులనే పుత్రులను పొందాడు. దుర్యోధనాది శత సోదరులకు కౌరవులనీ, ధర్మరాజాది పంచసోదరులకూ పాండవులనీ ప్రసిద్ధి.

విధివశాత్తూ పాండురాజు దేహం చాలించడంతో పాండ వులు అనాధలై ధృతరాష్ట్రుని పంచన చేరుతారు. కౌరవ, పాండవులందరికీ జ్యేష్ఠుడు ధర్మరాజు కనుక ధర్మం ప్రకారం ధృతరాష్ట్రుని తర్వాత రాజ్యాధికారం ధర్మరాజుదే నన్న పెద్దల నిర్ణయం దుర్యోధనాది కౌరవుల్లో మత్సరాన్ని రేపుతుంది.

అనుక్షణం పాండవుల నెలా మట్టుపెట్టాలనే పథకాలతో సతమతమవుతూ వుంటాడు దుర్యోధనుడు.

సోదరుల మధ్య ఈ విభేదాలను చూడలేక భీష్మ, ద్రోణ, కృపాచార్యాది పెద్దలు విడిగా కొంత భూభాగాన్ని యిచ్చి ఏలుకోమంటారు. హస్తినాపురం నుండి బయలుదేరి పాండవులు – ఇంద్రప్రస్థానాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యపాలన సాగిస్తూ సాటిరాజులు అబ్బురపడేలా రాజసూయాన్ని నిర్వహిస్తారు.

దీంతో పాండవులకు లభించిన కీర్తికి మరింతగా కుళ్ళిపోయిన దుర్యోధనుడు తన మేనమామ శకుని ప్రోద్బలంతో జూదక్రీడలో ధర్మరాజు ఐశ్వర్యాన్ని హరించాలని పథకం పన్నుతాడు.

పథకం ప్రకారం జూదక్రీడకు ధర్మరాజును ఆహ్వానిస్తారు. కౌరవులు. ఆ ఆటలో ధర్మ రాజు తన రాజ్యాన్నీ, ఐశ్వ ర్యాన్నీ సర్వస్వాన్నీ కోల్పో తాడు.

ఇది చాలదన్నట్లు తన తమ్ములనూ, భార్య ద్రౌపదినీ కూడా జూదపు పందెంలో ఓడిపోతాడు. అపుడు ద్రౌపదిని నిండు సభలో వివస్త్రను చేసి పరాభవించబోగా కృష్ణుడు ద్రౌపదీ మాన సంరక్షణం చేసి సంరక్షిస్తాడు.

ఇంత జరిగినా మరోమారు జూదం అంటూ ఉసిగొల్పి ధర్మరాజును మరోసారి ఓడించి 12 ఏళ్ళు అరణ్యవాసం, ఒక యేడు అజ్ఞాతవాసం చేయిస్తాడు దుర్యోధనుడు.

ఎన్నో కష్టనష్టాలను సహిస్తూ, భరిస్తూ అరణ్యవాస, అజ్ఞాతవాస దీక్షను పూర్తి చేసిన పాండవులకు ధర్మం ప్రకారం అర్ధరాజ్యం యివ్వాలి. కానీ దుర్యోధనుడు అర్ధరాజ్యం కాదు కదా ! చివరకు సూది మొన మోపినంత భూమి కూడా యివ్వనని మొరాయిస్తాడు.

ఇక అన్యాయం సహించలేని ధర్మరాజు కౌరవులపై ధర్మ యుద్ధం ప్రకటిస్తాడు. కురుక్షేత్ర రణభూమిలో అమీతుమీ తెల్చుకోవడానికి యిరు పక్షాలూ పోరుకు సిద్ధమవుతాయి. కురుక్షేత్ర సంగ్రామంలో మొత్తం 18 అక్షౌహిణుల సైన్యం పోరాడింది. వాటిలో 11 అక్షౌహిణులు కౌరవ పక్షం వహిస్తే , 7 అక్షౌహిణుల సైన్యం పాండవ పక్షం వహించింది.

18 రోజులు ఇరు పక్షాల మధ్య సంకుల సమరం జరిగింది. అయితే యుద్ధం మొదలుకాక పూర్వం అర్జునుడు – యుద్ధభూమిలో స్వజనులైన తాత ముత్తాతలను, గురువులను, స్నేహితులను చూసి వారిని చంపడం మహాపాపంగా భావించి కర్తవ్యతిరోన్ముఖు డౌతాడు.

అప్పుడు భగవానుడైన శ్రీకృష్ణుడు అర్జునునికి ‘భగవద్గీత’ రూపంలో కర్తవ్యోపదేశం చేసి యుద్ధ సంసిద్ధుని చేస్తాడు. ఈ ఉపదేశం వేదవిదులకు కరదీపిక వంటిది. ఇదొక సకర్మాత్మక ఆచరణీయ గ్రంథం.

కృష్ణుని ఉపదేశంతో కర్తవ్యోన్ముఖుడై అర్జునుడు కౌరవ సేనను చీల్చి చెండాడుతాడు. చివరకు ధర్మాత్ములయిన పాండవులు విజయం సాధించి కౌరవులను నిహతులను చేసి హస్తి నాపుర సామ్రాజ్యాన్ని చేజిక్కించుకుంటారు.

భూభార నిర్వాపణం కోసం శ్రీకృష్ణునిగా సశరీరుడై దిగి వచ్చినవాడు శ్రీమహావిష్ణువు. శ్రీకృష్ణుడు సాక్షీభూతుడుగా సర్వ మానవ హననక్రీడనూ లీలా మాత్రంగా నడిపించి దుష్ట శిక్షణను ధర్మ రక్షణనూ ఏకకాలంలో సాధించాడు.

ఈ పాండవ విజయగాధే ‘జయ’మను పేర వేదవ్యాసునిచే గ్రంథస్తం చెయ్యబడి మహాభారతంగా జగద్విఖ్యాతి నొందింది. భారతం వంటి పరమోత్కృష్ట సమాజహిత గ్రంథం మరే మతం లోనూ, మరే భాషలోనూ లిఖించ బడలేదంటే అతిశయోక్తి కాదు.

also read :

Ramayanam : రామాయణం.. శ్రీరాముని రమణీయ చిరస్మరణీయ కావ్యం చదివి తరించండి..!

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News