Kidney Stones : జీవనశైలి కారణంగా ప్రస్తుతం చాలా మంది సరైన మోతాదులో మంచినీళ్లు తాగలేకపోతుంటారు. పనుల్లో బిజీగా ఉండటం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. రోజూ తగిన మోతాదులో తాగునీరు తీసుకోకపోవడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. అందులో కిడ్నీ సంబంధ సమస్యలు కూడా ఒకటి. ఒక్కోసారి సమస్య తీవ్రం అయితే కిడ్నీలో రాళ్లు కూడా ఏర్పడుతుంటాయి. ఇలాంటి సమయంలో కిడ్నీలో రాళ్లు ఏర్పడ్డాయని ఎలా తెలుసుకోవాలో చాలా మందికి తెలియదు.
కిడ్నీలో రాళ్లు ఏర్పడితే శరీరంలో కొన్ని మార్పులను మనం గమనించవచ్చు. ముఖ్యంగా వెన్ను, పొత్తి కడుపులో నొప్పి వస్తుంది. నాభిచుట్టూ పెయిన్ వస్తుంటుంది. మూత్ర విసర్జన సమయంలో నొప్పి లేదా మంట కలుగుతుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి కిడ్నీలో రాళ్లు ఏర్పడ్డాయోమో తెలుసుకోవాలి. వైద్యులను సంప్రదిస్తే సోనోగ్రఫీ చేసి కిడ్నీలో రాళ్లను నిర్ధారిస్తారు.
ఇలాంటి సమస్యలను నిర్లక్ష్యం చేయడం వల్ల వ్యాధి మరింత ముదిరి.. కిడ్నీ ఫెయిల్యూర్ వరకు వెళ్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ప్రధానంగా ఇలాంటి సమస్యలు నీరు తక్కువ తీసుకోవడం వల్ల ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. వయసుతో నిమిత్తం లేకుండా అందరికీ ఇలాంటి సమస్యలు ఏర్పడతాయని స్పష్టం చేస్తున్నారు. కిడ్నీ సమస్యలు వచ్చినప్పుడు కలిగే నొప్పి చాలా భయంకరంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
తగిన మోతాదులో నీరు తాగాలి
మూత్రం ఎక్కువ సమయంపాటు ఆపుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు. ఇలా చేయడం వల్ల కిడ్నీలు దెబ్బతింటాయని స్పష్టం చేస్తున్నారు. చెడు ఆహారపు అలవాట్లు, ఆల్కహాల్ తీసుకోవడం, నీరు తక్కువ తాగడం, యూరిన్ ఆపుకోవడం.. ఇలాంటివి కిడ్నీ సమస్యలు ఏర్పడటానికి దోహదం చేస్తాయి. రోజూ కనీసం మూడు లీటర్ల నీరు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కిడ్నీలో రాళ్లు చిన్న పరిమాణంలో ఏర్పడితే అవి మూత్రం పోసేటప్పుడే బయటకు వచ్చేస్తాయి. పెద్దవైతే మాత్రం సమస్య తీవ్రం అవుతుంది.
also read news:
Corona in China: చైనాలో కరోనాతో 10 లక్షల మంది చనిపోతారట.. సంచలన నివేదిక బహిర్గతం