గుజరాత్ రాష్ట్రాన్ని వణికిస్తున్న బిపర్ జాయ్ తుపాను (Cyclone Biparjoy) తీరం వైపు దూసుకుపోతోంది. జూన్ 15న అంటే గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గంటకు 135 కిలోమీటర్ల వేగంతో ద్వారక సమీపంలో తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. తీరం దాటిన తర్వాత 48 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. తుపానులు వచ్చే ప్రమాదం ఉందని అధికారులను అప్రమత్తం చేయాలని వాతావరణ శాఖ గుజరాత్ ప్రభుత్వానికి సూచించింది.
గుజరాత్ తీరం దాటుతున్న బిపర్ జాయ్ తుపాను ప్రభావంతో దేవభూమి ద్వారక, రాజ్‌కోట్, జామ్‌నగర్, జునాగఢ్, పోరుబందర్, సోమనాథ్, మోర్బి, వల్సాద్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే కొన్ని గ్రామాల్లో నాలుగు లేదా ఐదు అడుగుల మేర నీరు ప్రవహించే అవకాశం ఉందని హెచ్చరించింది.
భారీ వర్షాలు, వరదలు, చెట్లు నేలకూలడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ముందుగా బ్యాటరీలు, జనరేటర్లు, ఇన్వర్టర్లు ఏర్పాటు చేసుకోవాలని అధికారులు సూచించారు. రెండు, మూడు రోజుల పాటు విద్యుత్ సరఫరా ఉండకపోవచ్చని అధికారులు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలన్నారు. కొన్ని ప్రాంతాల్లో పునరుద్ధరణకు ఒక వారం పట్టవచ్చు.
భారత వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు గుజరాత్ ప్రభుత్వం ఇప్పటికే 12 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఆయా ప్రాంతాలకు పంపింది. కూలిన చెట్లను తొలగించేందుకు భారీ వాహనాలు, కట్టర్లను సిద్ధం చేశారు. వరదల్లో చిక్కుకుంటే వారిని రక్షించేందుకు ప్రభుత్వం పడవలను కూడా సిద్ధం చేసింది. గుజరాత్ ప్రభుత్వం మంచినీరు, ఆహారం వంటి నిత్యావసర వస్తువులను పెద్ద ఎత్తున నిల్వ చేసింది.
నాలుగు రోజుల ముందే తుపాన్ హెచ్చరికలు అందడంతో ఈసారి అధికారులు పెద్ద ఎత్తున ముందస్తు చర్యలు చేపట్టి తీర ప్రాంతం నుంచి 40 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపాను తీరం దాటడమే మిగిలింది.
read more :
Biparjoy Cyclone : బిపర్‌జాయ్ తుఫాన్🌀.. పలు రాష్ట్రాలకు అలర్ట్🚨