Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు జిల్లా సీనియర్ నేత, అధికార పార్టీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంకా అలక వీడినట్లు కనిపించడం లేదు. దీంతో తాజాగా ఆయనకు సీఎంవో నుంచి పిలుపు వచ్చింది. ఈ మేరకు హైదరాబాద్ నుంచి బయల్దేరి తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లారు.
సీఎం జగన్‌తో సుదీర్ఘంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. బాలినేనిని సీఎం జగన్ బుజ్జగిస్తారా? లేక ఎన్నాళ్లని అలుగుతావంటూ మందలిస్తారా? అనేది వేచి చూడాల్సి ఉంది. మంత్రి పదవి పోయినప్పటి నుంచి బాలినేని తీవ్ర అసంతృప్తిలో ఉన్న సంగతి తెలిసిందే.
తనను పదవి నుంచి తప్పించి ఆ జిల్లాలో ఆదిమూలపు సురేష్‌కు మంత్రి పదవి కొనసాగించడంపైనే ముఖ్యంగా బాలినేని అలకబూనారని తెలుస్తోంది. సీనియర్ అయిన ఆయన్ను తప్పించి ఆ అలకను కవర్ చేసేందుకు సీఎం జగన్ రీజనల్ కోఆర్డినేటర్‌గా నియామకం చేశారు సీఎం జగన్.
అయితే, బాలినేనికి ఆ పదవి ఇష్టం లేదు. ఇటీవల మార్కాపురంలో సీఎం జగన్ సభ నిర్వహించారు. ఇందులో ప్రొటోకాల్ ఇవ్వడంలో బాలినేనికి అవమానం జరిగిందని ప్రచారం చేశారు. దీంతో స్వయంగా సీఎం జగన్ బుజ్జగించారు. అంతేకాదు.. బాలినేని చేత్తోనే ఆ కార్యక్రమంలో బటన్ నొక్కించి నిధులు విడుదల చేశారు.
సీఎం జగన్ మాట్లాడినప్పటికీ బాలినేని మూడ్ ఆఫ్‌లో ఉన్నారని సమాచారం. ఇటీవల రీజనల్ కోఆర్డినేటర్ పదవికి బాలినేని రాజీనామా చేశారు. తన అసంతృప్తిని ఇలా చూపించారు. ఇదే అంశంపై నేడు తాడేపల్లిలో సీఎం జగన్‌తో జరిగిన సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.
వాస్తవానికి బాలినేని రాజీనామా తర్వాత పార్టీ పెద్దలు బాలినేనితో చర్చించేందుకు ప్రయత్నించారట. అయినప్పటికీ ఆయన వెనక్కు తగ్గలేదు. దీంతో నేరుగా సీఎంతోనే మాట్లాడాలంటూ సీఎంవో అధికారులు ఆయనకు సమాచారం ఇచ్చారు.
అలకబూనిని బాలినేనికి సీఎం జగన్ ఎలా బుజ్జగిస్తారో తెలియాల్సి ఉంది. ఇలాంటివి రిపీట్ చేయడం వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తుందని, నీకేం కావాలో నేరుగా తనతోనే మాట్లాడాలని సీఎం జగన్ హెచ్చరించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
ఇలా అలకబూనడం వల్ల పార్టీలో ఇతర నాయకులు కూడా అలాగే చేస్తే అంతిమంగా పార్టీకి నష్టమని జగన్ సర్ది చెప్పనున్నట్లు సమాచారం. తొలి నుంచి వైఎస్ కుటుంబానికి బాలినేని సన్నిహితుడు. పార్టీ వీడేంత సాహసం చేయరు కానీ.. ఇలా అలక రూపంలో తన అసంతృప్తిని తెలియజేస్తున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
also read :
TS EAMCET : ఎంసెట్‌కు సర్వం సిద్ధం.. అదనంగా 50 వేలకుపైగా దరఖాస్తులు
Sita Ramam : సీతారామం సినిమా ఖాతాలో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్.. ఏ కేటగిరిలో అంటే..!