Weather Today: ఎండలతో సతమతం అవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ విభాగం తీపికబురు చెప్పింది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఏపీలో ఓవైపు ఎండలు మండిపోతున్నాయి. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ పరిస్థితితో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రానున్న మూడు రోజులపాటు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
నేడు పార్వతీపురం మన్యం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఇక తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీ సరిహద్దు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే చాన్స్ ఉందని అధికారులు తెలిపారు.
మరోవైపు దేశంలో నైరుతి రుతుపవనాల సీజన్లో ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. రుతుపవనాల సీజన్లో మొదటి నెల జూన్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే చాన్స్ ఉందని అంచనా వేశారు.
Read Also : today horoscope in telugu : 27-05-2023 ఈ రోజు రాశి ఫలాలు