TSRTC : తెలంగాణలో ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించేందుకు తొలిసారిగా ఏసీ స్లీపర్ బస్సులను రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అందుబాటులోకి తెస్తోంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఇప్పటికే కొత్త సూపర్ లగ్జరీ, నాన్ ఏసీ స్లీపర్, సీటర్ కమ్ స్లీపర్ బస్సులను ప్రారంభించిన సంస్థ.. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారికి మరింతగా చేరువ అయ్యేందుకు హైటెక్ హంగులతో ఏసీ స్లీపర్ బస్సులను తయారు చేసింది. ప్రైవేట్ బస్సులకు ధీటుగా రూపొందించిన 16 కొత్త ఏసీ స్లీపర్ బస్సులు మార్చి నెలలో తీసుకొస్తున్నారు.
కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు, హుబ్లీ, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, తిరుపతి, తమిళనాడులోని చెన్నై మార్గాల్లో ఏసీ స్లీపర్ బస్సులను టీఎస్ ఆర్టీసీ నడపనుంది. నాన్ ఏసీ స్లీపర్ బస్సుల మాదిరిగానే ఏసీ స్లీపర్ బస్సులకు లహరిగా పేరు పెట్టారు అధికారులు. హైదరాబాద్‌లోని బస్ భవన్ ప్రాంగణంలో కొత్త ఏసీ స్లీపర్ బస్సును టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ పరిశీలించారు. బస్సులో ప్రయాణికులకు కల్పిస్తోన్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా బస్సులను ప్రారంభించి.. ప్రయాణికులకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
తెలంగాణలో మొదటిసారిగా అందుబాటులోకి తీసుకొస్తున్న టీఎస్ఆర్టీసీ ఏసీ స్లీపర్ బస్సులకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నట్లు సజ్జనార్ తెలిపారు. కొత్త ఏసీ బస్సులను చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ వి. రవిందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీవీ ముని శేఖర్, చీఫ్ పర్సనల్ మేనేజర్ కృష్ణ కాంత్ తదితరులు పరిశీలించారు. 12 మీటర్ల పొడవు ఉన్న ఏసీ స్లీపర్ బస్సుల్లో లోయర్ 15, అప్పర్ 15తో 30 బెర్తుల సామర్థ్యం ఉందని అధికారులు వెల్లడించారు. బెర్తుల వద్ద వాటర్ బాటిల్ పెట్టుకునే సదుపాయంతో పాటు మొబైల్ చార్జింగ్ సౌకర్యం ఉంటుందన్నారు.
ప్రతి బెర్త్ వద్ద రీడిండ్ ల్యాంపులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఏసీ స్లీపర్ బస్సుల్లో వెహికిల్ ట్రాకింగ్ సిస్టంతో పాటు పానిక్ బటన్ సదుపాయం కల్పించినట్లు వివరించారు. వాటిని టీఎస్‌ఆర్టీసీ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసినట్లు వివరించారు. ఏసీ స్లీపర్ బస్సుల్లో వైఫై సదుపాయాన్ని కూడా కల్పించినట్లు అధికారులు వివరించారు. ప్రతి బస్సులోనూ రెండు సీసీటీవీ కెమెరాలను కూడా అందుబాటులోకి తెచ్చారు. అవి కేబిన్‌లో, బస్సు లోపల ఉంటాయన్నారు.
also read :
YSRCP MLC Candidates: వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే.. మరోసారి సామాజిక బాణం వదిలిన జగన్!
Karnataka : ఐఏఎస్ వర్సెస్ ఐపీఎస్.. కర్ణాటకలో వీధికెక్కి ఇద్దరు మహిళా అధికారుల పోరు