ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీలో ముసలం రోజు రోజుకూ పెరుగుతోంది. వైసీపీ శాసనసభ్యులు (YCP MLA) ఒక్కొక్కరుగా అసంతృప్తి సెగలు వెళ్లగక్కుతున్నారు. ఏకంగా ఎమ్మెల్యేలే తిరుగుబాటు చేస్తుండడంతో వైసీపీ అధిష్టానానికి పాలుపోవడం లేదు.
ఏ రకంగా ముందుకెళ్లాలన్న దానిపై తర్జనభర్జనలు పడుతూనే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం ఎవరెటుపోయినా పోయిందేమీ లేదన్న తీరుగా వ్యవహరిస్తున్నారు. తిరగబడిన ఎమ్మెల్యేల స్థానే ఆగమేఘాలపై కొత్త ఇన్‌చార్జ్‌ను నియమించేస్తున్నారు. అసంతృప్తులపై బెదిరేది లేదని హెచ్చికలు పంపుతున్నారు.
ఇటీవల నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తిరుగుబాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేసిన కోటంరెడ్డి.. తనకు అవమానం జరిగిన చోట ఉండేది లేదని వైసీపీకి నమస్కారం పెట్టేశారు.
అంతకు ముందు నెల్లూరు జిల్లాలోనే మరో ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ప్రభుత్వంపై ధిక్కార స్వరం వినిపించారు. అయితే, అక్కడ కూడా సీఎం జగన్ వెనువెంటనే నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డిని ఇన్‌చార్జ్‌గా పెట్టేశారు. నెల్లూరు రూరల్‌కూ ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డిని బాధ్యులుగా నియమించారు జగన్. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి ఆదాల పోటీ చేస్తారని క్లారిటీ ఇచ్చారు.
మరోవైపు నెల్లూరు జిల్లాలోనే ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి నిరసనగళం వినిపించారు. సలహాదారుడు ధనుంజయ్‌రెడ్డి తన వ్యతిరేక వర్గాన్ని ప్రోత్సహిస్తూ గ్రూపు రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు.
ఈ క్రమంలో తాజాగా ఈ అసంతృప్తి సెగ కర్నూలు జిల్లాకు వ్యాపించింది. జిల్లాలోని కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్.. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది లేదని స్పష్టం చేశారు. ఇందుకు కారణం.. అధికార పార్టీ నిర్వహిస్తున్న గడపగడపకు వైసీపీ కార్యక్రమంలో నిరసనసెగ తగలడమే.
కర్నూలు రూరల్ పరిధిలోని ఉల్చాలలో శనివారం గడపగడపకు మన ప్రభుత్వం.. కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేను వైసీపీ మాజీ మండలాధ్యక్షుడు వెంకటేశ్‌నాయుడు నిలదీశారు.
పార్టీని నమ్మకున్న వారికి అన్యాయం చేస్తున్నారని, నమ్మకద్రోహి అంటూ తీవ్ర పదజాలంతో విమర్శించారు. తగిన మూల్యం చెల్లించుకోవాలంటూ హెచ్చరించారు. దీంతో సుధాకర్ స్పందిస్తూ.. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇలా అధికార పార్టీలో ఇంకెందరు ఎమ్మెల్యేలు తిరగబడతారో వేచి చూడాల్సిందే.
also read:
జైసల్మేర్‌కి చేరుకున్న కియారా అద్వానీ, సిద్దార్ద్ మల్హోత్రా.. రేపే వివాహం..!
tomato sauce : ఆరు నెలలు నిల్వ ఉండేలా టమాటా సాస్ తయారు చేసుకోండి