Weather today : బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో వాతావరణంలో మార్పులు వస్తున్నాయని, ఈ ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం ఈరోజు అల్లూరి, కాకినాడ, ఉభయగోదావరి, కోనసీమ, ఏలూరు, చిత్తూరు, సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి.
అనకాపల్లి, కృష్ణా, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్‌ఆర్, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోనూ ఓ మోస్తరు వర్షాలు కురువనున్నాయి.
ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
మరోవైపు కోనసీమ జిల్లాలో మంగళవారం వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి.
జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిశాయి. అలాగే కొన్ని చోట్ల ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది.
రాజోలు మండలం తాపిపాకలో పిడుగుపాటుకు కొబ్బరి చెట్టు నేలకూలగా, ఏలూరు జిల్లాలో పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది.
మంగళవారం సాయంత్రం కురిసిన వర్షానికి వాతావరణం కాస్త చల్లబడి గత కొన్ని రోజులుగా విపరీతమైన ఎండలతో అల్లాడుతున్న జనం ఊపిరి పీల్చుకున్నారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ద్రోణి ప్రభావం కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
విదర్భ నుండి తెలంగాణ, ఉత్తర తమిళనాడు నుండి దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో ఉత్తర మరియు దక్షిణ ద్రోణులు ఏర్పడతాయి.
దీంతో బుధ, గురువారాల్లో గంటకు 30 నుంచి 40 కి.మీ. ఈదురు గాలులతో పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
మంగళవారం నల్గగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వర్షం కురిసింది.
భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది.
read more :
today horoscope in telugu : 31-05-2023 ఈ రోజు రాశి ఫలాలు