Weather Today : వచ్చే మూడు రోజులపాటు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ విభాగం తెలిపింది. నేడు, రేపు రాష్ట్రంలో భారీ వర్షం, వడగండ్లు పడతాయని తెలిపింది. గాలి వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉంటుందని పేర్కొంది.
ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ఈ మేరకు ఆయా జిల్లాల్లో అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
మరోవైపు హైదరాబాద్ నగరంలో ఈరోజు సాయంత్రం పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రత 30 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 21 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది.
ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ దక్షిణ కోస్తా, రాయసీమ ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. భారీ వర్షంతో పాటు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
మరోవైపు దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మే నెలలో ఢిల్లీలో చలి వాతావరణం ఏర్పడింది. రాత్రి వేళ గరిష్ఠ ఉష్ణోగ్రత 13 డిగ్రీలు దాటలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
నేడు, రేపు రాజధాని ఢిల్లీలో వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఢిల్లీలో నేడు పలుచోట్ల వానలు కురిసే అవకాశం ఉందని, శుక్ర, శని వారాల్లో వాతావరణం పొడిగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
also read :
Naga Chaitanya | ఆ ఒక్క విషయంలోనే బాధపడుతున్నా : నాగ చైతన్య