వీసాలపై (US Visa) అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. వలసేతర, ఉద్యోగ ఆధారిత వీసా దరఖాస్తుల ఫీజులను భారీగా పెంచనుంది. ఇందుకు అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను అమెరికా పౌరసత్వం, వలస సేవల డిపార్ట్‌మెంట్ తాజాగా ప్రకటించింది. ఫీజులను భారీగా పెంచనున్నట్లు వెల్లడించింది. అయితే, ఎక్కువ శాతం ఉద్యోగులను అమెరికాకు పంపించే కంపెనీలే ఈ ఫీజులను భరించాల్సి ఉంటుందని పేర్కొనడం గమనార్హం.
ఇటీవల కరోనా పాండెమిక్ పరిస్థితుల తర్వాత అమెరికా వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. కోవిడ్ మొదలైన తర్వాత కాస్త తగ్గినా.. ఇప్పుడు పరిస్థితి కుదుట పడింది. దీంతో అమెరికాకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా ఉద్యోగం కోసం అమెరికాకు వలస వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది.
ఈ నేపథ్యంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. భారీగా పెరగనున్న వీసాల్లో హెచ్-1బీ, హెచ్-2బీ, ఎల్-1, ఓ-1లతో పాటు ఈబీ-5లు ఉన్నాయి.
తాజా నిర్ణయంతో కంపెనీలపై భారం పడనుంది. ఇక పెరగబోతున్న ఫీజుల విషయానికి వస్తే.. ఇన్వెస్ట్‌మెంట్‌తో ముడిపడిన గ్రీన్ కార్డు అప్లికేషన్ ఫీజు 3,675 డాలర్ల నుంచి 11,160 డాలర్లకు పెరగనుందని తెలుస్తోంది. అలాగే హెచ్-1బీ రిజిస్ట్రేషన్ ఫీజు ప్రస్తుతం 10 డాలర్లు ఉంది. అయితే దీన్ని 215 డాలర్లకు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది.
పెండింగ్ వీసాల సంఖ్య తగ్గుతుంది..
దరఖాస్తుల ఫీజులు భారీగా పెంచే క్రమంలో బైడెన్ ప్రభుత్వం అభ్యంతరాలను స్వీకరించనుంది. కొత్త ఫీజుల ప్రతిపాదనలపై ఎవరికైనా అభ్యంతరాలుంటే 60 రోజుల్లో తెలిపేందుకు అవకాశం కల్పించింది.
అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం దరఖాస్తుల ప్రాసెసింగ్ ఖర్చుల భారాన్ని తగ్గించుకొనేందుకు కొత్త ఫీజులను అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. తాజా నిర్ణయంతో పెండింగ్ వీసాల సంఖ్య తగ్గుతుందని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది.
2016 నుంచి వీసా ఫీజుల్లో మార్పు చేయలేదని, ఆరేళ్ల తర్వాత తొలిసారి ఫీజులు పెంచుతున్నట్లు అమెరికా ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు గతేడాది అత్యధికంగా లక్షా 25 వేల మంది భారతీయ విద్యార్థులకు వీసాలు జారీ చేసినట్లు అమెరికా పేర్కొనడం గమనార్హం.
also read :
Divorce: కొత్త సంవత్సరంలో విడాకులు తీసుకోబోతున్న స్టార్ హీరో.. అవాక్కవుతున్న అభిమానులు
Jagananna Housing Scheme : పేరుకి పక్కా ఇళ్ళు.. ప్రజలకు పనికిరాని ఇళ్ళు