కొన్నాళ్లుగా ప్రశాంతంగా ఉన్న బ్రిటన్ రాజకీయాల్లో మళ్లీ కాక రేగింది. తాజాగా బ్రిటన్ డిప్యూటీ ప్రధానమంత్రి, ఆ దేశ న్యాయ శాఖ మంత్రి డొమినిక్ రాబ్ (Dominic Raab) పదవులకు రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ఆయన మంత్రిత్వ శాఖలో సిబ్బందిని బెదిరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరిగింది. దర్యాప్తు పూర్తి కావడంతో ఈ నివేదికను ప్రధానమంత్రి రిషి సునాక్‌కు అందించారు. ఈ పరిణామాలు జరిగిన కొన్ని గంటల్లోనే రాబ్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం.
తాజా పరిణామాల నేపథ్యంలో తన రాజీనామా లేఖను ప్రధాని రిషి సునాక్‌కు పంపారు. ఆ లేఖను ట్విట్టర్ వేదికగా రాబ్ షేర్ చేశారు. తనపై కొనసాగిన దర్యాప్తు ఘటన బాధించిందని, ఇది ప్రమాదకరమైన దృష్టాంతమని ఆయన పేర్కొన్నారు. అయితే, ప్రభుత్వానికి తన సంపూర్ణ మద్దతు కొనసాగుతుందని చెప్పడం విశేషం. దర్యాప్తులో ఏ అంశాలు వెలుగులోకి వచ్చినా.. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటమే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశాన్ని లేఖలో రాబ్ ప్రముఖంగా ప్రస్తావించారు.
వ్యక్తిగత ప్రవర్తనపై ఆరోపణల నేపథ్యంలో కీలక పదవులను వదులుకొని రాజీనామా చేయడం అక్కడ కొత్తేమీ కాదు. ఇప్పటికే ఇరువురు ఇలా రాజీనామా చేయగా.. రాబ్ మూడో వ్యక్తిగా నిలిచారు. రాబ్‌తో కలిసి పనిచేసే సివిల్ సర్వెంట్స్‌పై ఆయన ప్రవర్తన ఇబ్బందికరంగా మారిందని అక్కడి మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ వ్యవహారంపై స్పందించిన ప్రధాని సునాక్.. సీనియర్ లాయర్ ఆడమ్ టోలీని దర్యాప్తు చేయాల్సిందిగా ఆదేశించారు. మంత్రిపై వచ్చిన అభియోగాలు, ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని సూచించారు.
ఈ నేపథ్యంలోనే ప్రధాని రిషి సునాక్ ఆదేశాలతో దర్యాప్తు ప్రారంభించిన టోలీ తాజాగా నివేదిక అందజేశారు. రాబ్‌పై తనకు నమ్మకం ఉందని, దర్యాప్తులోని అంశాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు ప్రధాని రిషి సునాక్ పేర్కొన్నారు. నివేదికలో ఏముందనే విషయాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. ఎప్పుడు వెల్లడిస్తారనేది కూడా స్పష్టం చేయలేదు. రాబ్‌పై వచ్చిన ఆరోపణలు నిజమని తేలితే ఆయనపై చర్యలు తీసుకొనే చాన్స్ ఉంది. గతంలోనూ యునైటెడ్ కింగ్‌డమ్ ఫారిన్ అఫైర్స్ మినిస్టర్‌గా రాబ్ పని చేశారు. ఆయన్ను రిషి తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు.
also read :
Chhattisgarh : ఇరవై ఏళ్ల కిందట చంపేస్తే.. కలలోకి వచ్చి టార్చర్ పెడుతున్నాడు..!