Telugu Flash News

Special Story : ఆ ఊరంతా ఉద్యోగులే.. సత్తా చాటుతున్న బంజారా గ్రామం

Special Story : తెలంగాణలో ఇప్పుడు ఓ బంజారా గ్రామం వార్తల్లోకి ఎక్కింది. ఎందుకంటే అక్కడ ఊరంతా ఉద్యోగులే. ముప్పావు శాతం ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తే.. మరో పావు శాతం మంది ప్రైవేటు ఉద్యోగాల్లో ఉన్నత స్థానాల్లో నిలిచారు. ఇంతకు ముందు సమీప గ్రామాల్లో భూస్వాముల వద్ద జీతగాళ్లుగా పని చేసేవారు. పోడు భూములు చేసుకుంటూ బతుకు వెళ్లదీసే వారు.

ఇక ఎన్నాళ్లు చాకిరీ చేస్తామని ఆలోచన మొదలైంది. అప్పుడే ఒక్కక్కరుగా తమ పిల్లలను బడులకు పంపడం మొదలు పెట్టారు. ఇక ఆ పిల్లలు బాగా చదువుకొని కొలువులు సాధించారు. ఫలితంగా ఊరంతా ఉద్యోగాలు సాధించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బంజారా గ్రామంలో ఈ విజయ గాధ వెలుగు చూసింది.

ఆ గ్రామంలో బాణోత్‌ భద్రూనాయక్‌, బాణోత్‌ వాలియా నాయక్‌, గుగులోత్‌ హనుమానాయక్‌లు గ్రామ పెద్దలుగా ఉండేవారు. గుగులోత్‌ హనుమానాయక్‌కు మరో ఇద్దరు సోదరులు, ఇద్దరు సోదరీమణులు ఉండేవారు. వ్యవసాయం చేసుకొని జీవించేవారు. హనుమానాయక్‌ కుమారుడిని, తమ్ముడిని చదివించాలని అనుకున్నాడు.

ఈ క్రమంలోనే భద్రాచలంలోని గిరిజన హాస్టల్‌లో చేర్పించాడు. వారితోపాటు గ్రామంలోని ఇతర పిల్లలు చాలా మంది హాస్టల్లో చదువుకొనేలా వారి తల్లిదండ్రులను ప్రోత్సహించారు. ఇక ఎవరైనా బడి మానేయాలని చూస్తే వారి కాళ్లకు తాడు కట్టి తలకిందులుగా వేలాడదీసేవాడు. ఈ భయంతో చాలా మంది స్కూళ్లకు బంక్‌ కొట్టకుండా వెళ్లేవారు.

అప్పుడు ఆ బాధ భరించలేక చదువుకున్నా.. ఇప్పుడు జీవితం సుఖంగా ఉందని ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులుగా పని చేస్తున్న వారు గుర్తు చేసుకుంటున్నారు. వారు చదువుకొనే క్రమంలో తిండికి గతిలేదు కానీ.. చదువులు కావాల్సి వచ్చాయా? అంటూ చాలా మంది భూస్వాములు హేళన చేశారని చెబుతున్నారు.

దీంతో గ్రామ పెద్దలు భద్రాచలంలోని ఊటీడీఏ అధికారులతో మాట్లాడి రుణాలు మంజూరయ్యేలా కృషి చేశారు. సబ్సిడీపై కరెంటు మోటార్లు, వ్యవసాయ బావులు, గేదెలను ఇవ్వడంతో వారికి ఆర్థికంగా ఊరట కలిగింది. హనుమానాయక్‌ కృషి ఫలించడంతో కుమారుడు జయరాం ఇంజనీరింగ్‌ ఉద్యోగం సాధించాడు. సోదరుడు వీరస్వామి గవర్నమెంట్‌ ఉపాధ్యాయుడిగా స్థిరపడ్డాడు.

ఇలా చాలా మంది గ్రామంలో ప్రభుత్వ, ప్రైవేటు కొలువులు పట్టారు. గ్రామ పెద్దల ఆశయాలను ముందుకు తీసుకెళ్లి భవిష్యత్‌లో ఏ ఒక్కరూ ఖాళీగా ఉండకుండా అందరూ ఉద్యోగాలు చేసుకొనేలా కృషి చేస్తామని గుగులోత్‌ వీరస్వామి చెబుతున్నారు. తద్వారా గ్రామం కూడా బాగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

also read :

Upasana : నేను అందంగా లేక‌పోయిన డ‌బ్బుల కోస‌మే చ‌ర‌ణ్ న‌న్ను పెళ్లి చేసుకున్నాడ‌ని అన్నారు: ఉపాస‌న‌

Viral Video : బైక్‌పై ముందో యువతి, వెనకో యువతి.. నడిరోడ్డుపై అర్ధరాత్రి ఫీట్లు!

Exit mobile version