టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం సందర్భంగా గుండెపోటుకు గురైన సినీ నటుడు నందమూరి తారకరత్న (Taraka Ratna) ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 20 రోజులుగా ఆయనకు వెంటిలేటర్‌పైనే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి నేటికీ విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. తాజాగా ఆయన హెల్త్ అప్డేట్ను డాక్టర్లు ప్రకటించారు. తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స కొనసాగిస్తున్నారు.
తారకరత్న ఆరోగ్యానికి సంబంధించి లేటెస్ట్ హెల్త్ రిపోర్టును విడుదల చేశారు. గురువారం తారకరత్నకు ఎం.ఆర్.ఐ. స్కానింగ్ తీసినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు పేర్కొన్నారు. మెదడుకు సంబంధించిన వైద్య చికిత్స అందిస్తున్నామని ప్రకటన విడుదల చేశారు. దీనిపై పూర్తి వివరాలతో మరికొన్ని గంటల్లో హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని డాక్టర్లు వెల్లడించారు. తారకరత్న కోలుకుంటున్నారన్న వార్తతో నందమూరి కుటుంబ సభ్యలతో సహా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
జనవరి 27వ తేదీన నారా లోకేష్ యువగళం పేరిట పాదయాత్ర మొదలు పెట్టారు. కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా సుదీర్ఘ పాదయాత్రకు ఆరోజు లోకేష్ శ్రీకారం చుట్టారు. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో నటుడు తారకరత్న పాల్గొన్నారు. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో వెంటనే ఆయన్ను ప్రాథమిక చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలకు తరలించి అప్పటి నుంచి చికిత్స కొనసాగిస్తున్నారు.
సుమారు 20 రోజులకుపైగా తారకరత్నకు చికిత్స కొనసాగిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ దగ్గరుండి వైద్య సదుపాయాలను పర్యవేక్షించారు. ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ అధినేత చంద్రబాబు సహా పలువురు ఆస్పత్రికి చేరుకొని చికిత్స జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. తాజాగా విదేశీ వైద్యులను ఆ ఆస్పత్రికి రప్పించి ట్రీట్మెంట్ చేయిస్తున్నట్టు ఆయన కుటుంబ సభ్యుడు రామకృష్ణ ఇటీవల వెల్లడించారు. తారకరత్న త్వరగా కోలుకోవాలని ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు పూజలు, ప్రార్థనలు కోరుకుంటున్నారు.
also read :
Ram Charan: ఆమె నా ఫస్ట్ క్రష్.. ఆమెను అలా చూస్తూ ఉండిపోతానన్న రామ్ చరణ్
Pooja Hegde: పూజా హెగ్డే పని అయిపోయినట్టేనా.. ఆఫర్స్ కోసం ఆ పని చేయాల్సిందేనా..!