ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ వ్యవహారంపై దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ (Tammareddy Bharadwaj) చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆయనపై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, మెగా బ్రదర్ నాగబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మీ దగ్గర అకౌంట్ లెక్కలున్నాయా? అలా ఎలా మాట్లాడతారంటూ రాఘవేంద్రరావు ప్రశ్నించారు. ఇక నాగబాబు అయితే, అసభ్య పదజాలంతో ట్విట్టర్‌లో రెచ్చిపోయారు. ఈ నేపథ్యంలో తమ్మారెడ్డి తన వ్యాఖ్యలపై మళ్లీ స్పందించారు.
విద్యార్థులతో జరిగిన సెమినార్‌లో తాను మాట్లాడిన అంశాన్ని సరిగా అర్థం చేసుకోకుండా చాలా మంది ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారని చెప్పారు. అదే స్థాయిలో తాను కూడా స్పందించగలనని, అయితే, తన తల్లిదండ్రులు తనకు సంస్కారం నేర్పారని తమ్మారెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇదే రాజమౌళిని పొగుడూతూ ట్విట్టర్‌లో పోస్టు పెడితే దానికి ఎవరూ రెస్పాండ్ కాలేదన్నారు. అయితే ఇప్పుడు మాత్రం వివాదాస్పదం చేయాలని చూస్తున్నారన్నారు. అయితే, తాను ఈ వివాదాన్ని కొనసాగించాలని కోరుకోవడం లేదన్నారు తమ్మారెడ్డి భరద్వాజ.
గత వారం ఓ సెమినార్ జరిగిందని, జాతీయ అవార్డు గ్రహీత, మా బంగారు తల్లి మూవీ డైరెక్టర్ రాజేష్ దీనికి సమన్వయకర్తగా వ్యవహరించారని తమ్మారెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా సినిమాపై మక్కువ ఉన్న 20 మంది విద్యార్థులు ఇందులో పాల్గొన్నారని, సినిమా ఎలా తీయాలనే అంశంపై చర్చించామన్నారు. ఇందులో భాగంగా సినిమాలు రెండు రకాలని, రిలీజ్ అయి పేరు వచ్చే మూవీలు, పేరు కోసం తీసే సినిమాలు, అంటూ చర్చించినట్లు తెలిపారు. ఇవి కాకుండా అవార్డుల కోసమే తీసే సినిమాల గురించి చర్చ రాగా, మా సినిమాలు థియేటర్‌లో విడుదలవుతాయా అని ఒకరు అడిగారన్నారు. ఈ సందర్భంగా ఇవి ఫెస్టివల్స్ కోసం తీసే సినిమాలని, అక్కడకు పంపడానికి కూడా చాలా ప్రాసెస్ ఉంటుందని చెప్పానన్నారు. ఈ సందర్భంలోనే ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ప్రస్తావన రాగా అవార్డు వస్తుందా? అని విద్యార్థులు అడిగారన్నారు.
ఈ మాటల్లోనే దాని గురించి చెబుతూ ఆర్ఆర్ఆర్ కు అంత డబ్బు ఖర్చయి ఉంటుందని, ఇప్పుడు ఆస్కార్ కోసం ప్రయత్నిస్తున్నారని, ఆ డబ్బుతో ఎక్కువ సినిమాలు తీయొచ్చని మాత్రమే చెప్పానన్నారు భరద్వాజ్. అవార్డుల కోసం తీసే సినిమాలకు అంత డబ్బు ఖర్చు పెట్టి చేయలేం కాబట్టి ప్రయత్నాలు చేయవచ్చని మాత్రమే విద్యార్థులకు సూచించానన్నారు. రెండున్నర గంటల పాటు సినిమా గురించి మాట్లాడితే అది వదిలేసి నిమిషం ఉన్న క్లిప్‌ను చూపించి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతున్నారని తమ్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు మాట్లాడేది అసహ్యంగా ఉందని, తాను కూడా ఇలా రియాక్ట్ కాగలనని చెప్పారు. అయితే, తనకు సంస్కారం అడ్డు వస్తోందన్నారు.
also read :
Delhi Liquor Scam : రేపు ఎమ్మెల్సీ కవిత విచారణ.. ఈడీ కి ట్విస్ట్ ఇచ్చిన రామచంద్ర పిళ్లై..!
summer fruits : సమ్మర్‌లో ఎలాంటి పండ్లు తినాలి.. ఈ 5 ఫ్రూట్స్ బెస్ట్!