Vijaykanth | తమిళ నటుడు, డీఎండీకే అధినేత కెప్టెన్ విజయకాంత్ గురువారం ఉదయం కన్నుమూశారు. శ్వాస సంబంధిత సమస్యతో చెన్నైలోని మియోట్ దవాఖానలో చేరారు. పరీక్షల్లో ఆయనకు కొవిడ్ నిర్ధారణ అయింది. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించినప్పటికీ లాభం లేకుండా పోయింది. పరిస్థితి విషమించడంతో విజయకాంత్ తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు తమిళనాడు ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రకటించారు.
71 ఏండ్ల విజయకాంత్ ఏడాది కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గత నెల 18న జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలతో చెన్నైలోని మియోట్ దవాఖానలో చేరారు. చికిత్స అనంతరం కోలుకుని డిసెంబర్ 11న ఇంటికి చేరుకున్నారు. అయితే అప్పుడే ఆయన మరణించారనే వార్తలు నెట్టింట షికారు చేశాయి. అయితే ఆ వదంతులను ఆయన సతీమణి ప్రేమలత కొట్టిపారేశారు. అయితే రెండు వారాలు గడువకముందే ఆయన కొవిడ్ బారినపడటం, మరోసారి శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడంతో గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
తమిళ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన విజయకాంత్, ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో సైతం అడుగుపెట్టారు. 2005లో డీఎండీకే పార్టీని స్థాపించారు.
1952, ఆగస్టు 25న జన్మించిన విజయకాంత్ అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అళగర్ స్వామి. 27 ఏళ్ల వయసులో తెరంగ్రేటం చేసి 2015 వరకు నిర్విరామంగా నటించారు. ఇనిక్కుం ఇలామైతో నటుడిగా విజయకాంత్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.
సుమారు 150కి పైగా చిత్రాల్లో నటించి, మెప్పించారు. అటు తమిళ, ఇటు తెలుగు ప్రేక్షకులను అలరించారు. దాదాపు 20కి పైగా పోలీసు కథల్లోనే ఆయన నటించి మెప్పించారు. కెరీర్ ఆరంభంలో కాస్త పరాజయాలు అందుకున్న విజయకాంత్, ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన దూరతు ఇడి ముళక్కం, సత్తం ఒరు ఇరుత్తరై సినిమాలతో విజయాలు అందుకున్నారు. 100వ చిత్రం కెప్టెన్ ప్రభాకర్ విజయం సాధించిన తర్వాత నుంచి అందరూ ఆయనను కెప్టెన్ అని పిలుస్తున్నారు.
విజయకాంత్ రాజకీయ ప్రస్థానం
నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయకాంత్ 2005లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన దేశీయ మురుపొక్కు ద్రవిడ ఖజగం (డీఎండీకే) పార్టీని స్థాపించారు. మధురైలో పురుడు పోసుకున్న ఈ పార్టీ, 2006 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసింది. విజయకాంత్ ఒక్కరే నాటి ఎన్నికల్లో గెలిచి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 2011 ఎన్నికల్లోనూ ఆయన గెలుపొందారు. 2011-16 మధ్య తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగారు. 2006లో విరుధచలం, 2011లో రిషివండియం నియోజకవర్గాల నుంచి ఆయన అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు.
రాజకీయాల్లోనూ విజయకాంత్ తనదైన శైలిని చాటుకున్నారు. ప్రజా సమస్యల పట్ల స్పందించేవారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడారు. ప్రభుత్వ వైఖరిపై పదునైన విమర్శలు చేసేవారు. అయితే ఎన్నికల్లో పెద్ద ఎత్తున విజయాలు సాధించలేకపోయినా, రాజకీయంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
ఆయన మరణంతో తమిళనాడు రాష్ట్రం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.
విజయకాంత్ ఒక నటుడిగానే కాకుండా, రాజకీయ నాయకుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా తనదైన ముద్ర వేశారు. ఆయన జీవితం, కెరీర్ ఎన్నో తరాలకు స్ఫూర్తిదాయకం. ఆయన లేని లోటు తమిళ సినీ పరిశ్రమ, రాజకీయ రంగం ఎప్పటికీ భర్తీ చేయలేదు.