Sharwanand : శర్వానంద్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి బ్యాక్‌గ్రౌండ్ తెలుసా ?
sandeep N
Sharwanand: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో శర్వానంద్ ఒకరు. ఆయన పెళ్లికి సంబంధించి కొన్నాళ్లుగా ఏదో ఒక వార్త హల్చల్ చేస్తూనే ఉంది.ఎప్పుడో 15 ఏళ్ళ క్రితం సినిమాల్లోకి వచ్చిన శర్వానంద్ ఎట్టకేలకు మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టబోతున్నాడు. దాదాపు రెండు మూడేళ్ళ నుంచి అతని పెళ్లి పైనే చర్చలు నడుస్తున్నా.. ఇప్పుడు ఆ విషయం కొలిక్కి వచ్చింది. శర్వానంద్ మనువాడనున్న వధువు ఈమె అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న యువతిని శర్వానంద్ పెళ్లి చేసుకోబోతున్నాడు.
శర్వానంద్ పెళ్లి చేసుకోబోయే ఆ యువత ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ గురించి తెలిస్తే ఔరా అనక మానరు. ఆమె కుటుంబ సభ్యులు అంతటి హేమాహేమీలు మరి. ఆ అమ్మాయి రెడ్డి సామజిక వర్గానికి చెందినది కాగా, పేరు.. రక్షిత రెడ్డి. ఈమె అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్. తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె అయిన రక్షిత చిత్తూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే దివంగత బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి మనవరాలని సమాచారం. రక్షిత రెడ్డి తండ్రి మధుసూదన్ రెడ్డి సోదరుడు గంగారెడ్డి, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అల్లుడు. ఆ విధంగా వధువు.. గోపాలకృష్ణారెడ్డికి మనవరాలు అయ్యిందన్న మాట.
రక్షిత ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటూ ఉద్యోగం చేస్తోంది అని సన్నిహితులు చెబుతున్నారు. కామన్ ఫ్రెండ్ ద్వారా వీరిద్దరికి పరిచయాలు ఏర్పడగా, ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వచ్చిందట. వారిరివురు ఒకరినొకరు ఇష్టపడడంతో కుటుంబ సభ్యులు కూడా వీరి పెళ్ళికి పచ్చ జెండా ఊపారు. జనవరి 26న వీరిద్దరి నిశ్చితార్థం జరుగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పెళ్లికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇక ఇటీవల శర్వానంద్ బాలయ్య అన్ స్టాపబుల్ షోకి అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. ఈ షోలో బాలయ్య శర్వాని పెళ్ళెప్పుడు అని ప్రశ్నించగా.. ప్రభాస్ పెళ్లి తర్వాత అని సరదాగా బదులిచ్చాడు. ఇక శర్వానంద్ సినిమాల విషయానికి వస్తే.. ‘మహానుభావుడు’ తరవాత మళ్లీ ఆ స్థాయి విజయం శర్వానంద్‌కు దక్కలేదు. గతేడాది వచ్చిన ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’, ‘ఒకే ఒక జీవితం’ సినిమాలు నిరాశపరచగా, ప్రస్తుతం డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్యతో కలిసి ఒక సినిమా చేస్తున్నట్టు వినికిడి.