HomenewsRishabh Pant : రోడ్డు ప్రమాదంలో రిషభ్‌ పంత్‌కు తీవ్ర గాయాలు.. తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు!

Rishabh Pant : రోడ్డు ప్రమాదంలో రిషభ్‌ పంత్‌కు తీవ్ర గాయాలు.. తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు!

Telugu Flash News

టీమిండియా వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ (Rishabh Pant) రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్‌ వెళ్తుండగా పంత్‌ ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పడంతో డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో పంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో క్రికెట్‌ అభిమానులు, క్రికెటర్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. పంత్‌ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో అభిమానులు పెద్ద ఎత్తున పంత్‌ కోలుకోవాలంటూ ట్వీట్లు పెడుతున్నారు.

ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్‌కు వెళ్తున్న క్రమంలో రిషభ్‌ పంత్‌ తన మెర్సిడిజ్‌ బెంజ్‌ కారును స్వయంగా నడిపాడని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన డివైడర్‌పై నుంచి దూసుకుపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కారులో మంటలు చెలరేగాయని పోలీసులు చెబుతున్నారు. అయితే, మంటలు చెలరేగుతున్న క్రమంలో పంత్‌ కారు అద్దాలు పగులగొట్టి బయటకు దూకేశాడని స్థానికులు చెబుతున్నారు.

పంత్‌కు తీవ్రంగా గాయాలయ్యాయి. తల భాగంలో, మోకాలికి గాయాలయ్యాయి. వీపు భాగం కాలిపోయింది. కాలికి ఫ్యాక్చర్‌ అయినట్లు తెలుస్తోంది. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాదం తర్వాత రిషభ్‌ పంత్‌ను రూర్కీలోని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స తర్వాత మెరుగైన వైద్యం కోసం డెహ్రాడూన్‌లోని మ్యాక్స్‌ హాస్పిటల్‌కు తరలించినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ప్రస్తుతం పంత్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

ప్రమాదానికి కారణాలేంటి?

ప్రమాద సమయంలో పంత్‌ స్వయంగా కారు నడిపాడని ఉత్తరాఖండ్‌ డీజీపీ అశోక్‌ కుమార్‌ వెల్లడించారు. కారు నియంత్రణ కోల్పోవడం వల్లే డివైడర్‌ను ఢీకొట్టినట్లు భావిస్తున్నామని తెలిపారు. ప్రమాదానికి కారు వేగమా లేక ఏదైనా అడ్డు వచ్చిందా? అనే విషయం దర్యాప్తులో తేలనుంది. తన ఇంటికి వెళ్తున్న క్రమంలో పంత్‌ ప్రమాదానికిక గురయ్యాడు. పంత్‌ ఇంటికి వస్తున్న విషయం ఇంట్లో కూడా ఎవరికీ తెలియదని సమాచారం. అయితే, ఇంట్లో వారికి సర్‌ప్రైజ్‌ ఇద్దామని బయల్దేరినట్లు మీడియాలో జోరుగా కథనాలు వెలువడుతున్నాయి. ప్రమాద విషయం తెలిసిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి బయల్దేరారు. మరోవైపు క్రికెటర్లు, అభిమానులు పంత్‌ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

మరిన్ని వార్తలు చదవండి :

తెలంగాణ వార్తలు  |  జాతీయ వార్తలు  |  సినిమా వార్తలు  |  అంతర్జాతీయ వార్తలు  |  ఆరోగ్య చిట్కాలు

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News