పూర్వం రోజుల్లో సమాచారాన్ని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి, ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి చేరవేయడానికి పావురాలను (Pigeon) ఉపయోగించేవారు. రాజుల కాలాంలో ఇది జరిగేదని పూర్వీకులు చెప్పేవారు. పావురాలను అంతటి జ్ఞాపక శక్తి ఉంటుందని చెబుతారు. పరాయి దేశానికి వెళ్లినా గమ్యం కనుక్కొని నేరుగా సొంత ప్రాంతానికి చేరుకోవడం పావురాల ప్రత్యేకత. అయితే, పూర్వం కొందరు గూఢచారులు పావురాలను అటకాయించి సమాచారాన్ని దొంగతనం చేసేవారని కూడా కథలు కథలుగా విన్నాం.
నేటి నవీన యుగంలోనూ ఓ పావురం చేసిన పని ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తోంది. ఓ యజమాని తన పావురాన్ని శబరిమలలో విడిచి వచ్చినా వందలాది కిలోమీటర్లు దాటుకొని మళ్లీ యజమాని ఇంటికే చేరిందా పావురం. ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. యజమానిని గుర్తుంచుకోవడంతో పాటు, తన ప్రాంతాన్ని ఎంత దూరం నుంచి అయినా గుర్తు పట్టి చేరుకుంటానని పావురం రుజువు చేసిందంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
పూర్వం ఉత్తరాలు కూడా పావురాల ద్వారా పంపేవారని విన్నాం. తర్వాతి కాలంలో ఉత్తరాలు చేరవేసేందుకు పోస్ట్ మ్యాన్‌లు వచ్చారు. తర్వాత టెలిగ్రామ్ వచ్చింది. ప్రస్తుతం సెల్‌ఫోన్ యుగంలో ఎక్కడి నుంచి అయినా వీడియో, ఆడియో కాల్స్ మాట్లాడుతున్నాం. అయితే, పూర్వం పావురాల ద్వారా సమాచారం పంపిన నేపథ్యంలో వాటి తెలివిలో మాత్రం ఇప్పటికీ తేడా రాలేదని ఈ పావురం రుజువు చేసింది.
పెంచిన రుణం మరువని పావురం..
కర్ణాటకలోని చత్రదుర్గ జిల్లా మొళకాళ్మూరుకు తాలూకా మేగలహట్టి గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన వెంకటేశ్ ఇటీవలే అయ్యప్ప మాల ధరించి అయ్యప్ప దర్శనం చేసుకుని వచ్చాడు. దర్శనం తరువాత తనతోపాటు తీసుకువచ్చిన పావురాన్ని గతేడాది డిసెంబర్ 30న శబరిమలలో వదిలి వచ్చాడు. అయితే, ఆశ్చర్యంగా పావురం గురువారం గ్రామాన్ని చేరుకుని యజమాని వెంకటేశ్ ఒడిలో వాలిపోయింది. పెంచిన రుణాన్ని మర్చిపోలేని పావురం ఇలా గ్రామానికి తిరిగి రావడంపై గ్రామస్తులంతా ఆశ్చర్యంతో పాటు ఆనందం వ్యక్తం చేశారు. పావురాల తెలివే తెలివి అంటూ ప్రశంసలు కురిపించారు.
also read :
US Visa : అమెరికా వీసాలపై సంచలన నిర్ణయం.. భారీగా ఫీజులు పెంచేసిన బైడెన్ ప్రభుత్వం!
Divorce: కొత్త సంవత్సరంలో విడాకులు తీసుకోబోతున్న స్టార్ హీరో.. అవాక్కవుతున్న అభిమానులు