Telugu Flash News

MP GVL on YS Jagan: ఇక్కడే ఉంటా.. నా రాష్ట్రం ఇదే.. జగన్‌ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ జీవీఎల్‌ ఏమన్నారంటే?

ys jagan

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (jagan mohan reddy) తాజాగా కడపలో పర్యటించారు. ఈ సందర్భంగా అనేక సంక్షేమ కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు చేశారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడిన జగన్‌.. ప్రతిపక్షాలపై ఫైర్‌ అయ్యారు. ముఖ్యంగా రాష్ట్రంలో నివాసం అంశంపై హాట్‌ కామెంట్స్‌ చేశారు జగన్‌. హైదరాబాద్‌లో ఉంటూ ఏపీకి వచ్చి వెళ్తున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని చర్చలు జోరందుకున్నాయి.

సభలో జగన్‌ మాట్లాడుతూ.. ఇదే నా రాష్ట్రం.. ఇక్కడే నా నివాసం అని స్పష్టం చేశారు. ఐదు కోట్ల మంది ప్రజల సంక్షేమమే తనకు ధ్యేయమని, ప్రజలే నా కుటుంబమని చెప్పారు జగన్‌. తాను దేవుడిని, ప్రజలనే నమ్ముకున్నానన్న జగన్‌.. ఎల్లో మీడియా, చంద్రబాబు, దత్తపుత్రుడి నమ్ముకోలేదన్నారు. గత ప్రభుత్వంలో ఏ సంక్షేమ పథకం కావాలన్నా లంచాలు ఇవ్వాల్సి వచ్చేదని, తన పాలనలో అవినీతికి తావు లేకుండా చేశానని జగన్‌ చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌పై మరోసారి జగన్‌ వ్యక్తిగత విమర్శలు చేశారు. దత్తపుత్రుడిలాగా ఒక భార్య కాకపోతే మరో భార్య అనేలా తాను మాట్లాడటం లేదన్నారు. ఇదే తన రాష్ట్రమని, ఇక్కడే తన రాజకీయం చేస్తానని చెప్పారు. జగన్‌ వ్యాఖ్యలపై అటు టీడీపీ శ్రేణులతో పాటు జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జగన్‌ మాటలపై బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు స్పందించారు.

ఓడిపోతే ఇక్కడే ఉంటాడని గ్యారెంటీ ఉందా?

టీడీపీ, వైసీపీ నేతలకు అధికారంలో ఉంటేనే ఆంధ్రప్రదేశ్‌ గుర్తుకొస్తుందని జీవీఎల్‌ మండిపడ్డారు. అధికారం కోల్పోతే వారికి హైదరాబాద్‌ గుర్తుకొస్తుందన్నారు. రాష్ట్రం నుంచి ఐటీ కంపెనీలను తరిమేయడం తప్ప కొత్త కంపెనీలను తీసుకొచ్చేది ఏమైనా ఉందా? అని జగన్‌ను జీవీఎల్‌ ప్రశ్నించారు. 2024 ఎన్నికల్లో ఓడిపోతే జగన్‌ అమరావతిలోనే ఉంటాడని గ్యారెంటీ ఉందా? అని జీవీఎల్‌ ప్రశ్నించారు. విజయవాడలో మాట్లాడిన జీవీఎల్‌.. ఈ మేరకు జగన్‌పై విమర్శలు చేశారు.

also read news: 

Christmas : ఏటా డిసెంబర్‌ 25 నే క్రిస్మస్‌ ఎందుకు జరుపుకుంటారు? బాక్సింగ్‌ డే ప్రత్యేకత ఏంటి?

Rewind 2022 : ఈ ఏడాది ప్రేక్షకులను అలరించిన కొత్త హీరోయిన్లు.. ఎవరు ? ఏ సినిమాలు ?

 

Exit mobile version