నేపాల్, టిబెట్ సరిహద్దుల్లో వున్న ఎవరెస్టు శిఖరం(MOUNT EVEREST) 29,028 అడుగుల ఎత్తుతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరం. దీని చుట్టూ ఎన్నో కథలు, సంప్రదాయ వృత్తాంతాలు అల్లుకొని ఉన్నాయి. ఈ పర్వతాన్ని అధిరోహించే ప్రయత్నంలో కొంతమంది విజయం సాధించగలిగినా చాలా మంది తమ ప్రాణాలు కోల్పోవటం జరిగింది.
19వ శతాబ్దం మధ్య భాగంలో బ్రిటిష్ ప్రభుత్వంచేత భారతదేశాన్ని, హిమాలయ పర్వతాలను సర్వే చేయటానికి నియమించబడిన బ్రిటిష్ ఇంజనీర్ జార్జి ఎవరెస్టు పేరుతో ఈ పవిత్ర పర్వతాన్ని ఎవరెస్టు పర్వతంగా పిలవటం ప్రారంభమయింది.
ఆ ప్రాంత వాసులు ‘ఖోమోలంగ్మా’గా పిలిచే ఈ పర్వతాన్ని ప్రపంచంలోనే ఎత్తైన పర్వతంగా జార్జి ఎవరెస్టుచేత నిర్ధారించబడింది. మే 29, 1953వ సంవత్సరంలో న్యూజిలాండ్ దేశ స్తుడు ఎడ్మండ్ హిల్లరీ, నేపాలేశీయుడు షేర్పా టెంజింగ్ నార్కే మొదటిసారిగా ఈ పర్వతాన్ని అధిరోహించారు.
ఈ పర్వత శిఖరం తన అందాలతో ప్రపంచం నలుమూలల వున్న కొన్ని వేల మంది పర్వతారోహకులను ఆకర్షిస్తూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కొన్ని వందల మంది విశ్వజనని (Mother of the Universe)గా భావించబడే ఈ పర్వత శిఖరాన్ని అధిరోహించటానికి తమ సర్వశక్తుల్ని ఒడ్డి ప్రయత్నం చేస్తుంటారు.
ప్రాచీనకాల సంప్రదాయం
‘ఎవరెస్టు’ అనే ఇంగ్లీషు పేరును ఇవ్వటానికి కొన్ని వేల సంవత్సరాల ముందు నుంచే ఈ పర్వతం బౌద్ధమత ప్రబోధనల్లో కేంద్రస్థానాన్ని ఆక్రమించింది. దీర్ఘకాలం జీవించిన పంచ సోదరీ మణులు (‘Five sisters of Long life’)గా పిలువబడే అయిదుగురు అపురూపమైన దేవతలను ఆరాధించటం అనేది ప్రాచీన కాలం నుంచి హిమాలయ పర్వతాల ప్రాంతంలో ఒక సంప్రదాయంగా వస్తోంది.
అక్కడి అత్యున్నతమైన పర్వత శిఖరాలు ఈ దేవతల నివాసస్థానాలని ఆప్రాంత ప్రజల ప్రగాఢ నమ్మకం. టిబెటన్, షెర్పాభాషల్లో ఖోమోలంగ్మా (Chomolungma) గా పిలువబడే ఈ విశ్వజనని (‘Mother of the Universe’) పర్వతం ఖోమోమియో లంగ్సంగ్మా, తాషీ తెరిగ్నామా అని పిలువబడే ఇద్దరు దేవతల నివాస స్థానంగా భావిస్తారు.
ఈ దేవతల్ని ఆరాధిస్తే ఈ పర్వతాన్ని ఆవహించి వున్న కొన్ని దుష్ట శక్తులు ఎలాంటి హాని కలిగించవని విశ్వసిస్తారు. ఈ దేవతల కరుణాకటాక్షాలు ఉంటే విజయంతో, ప్రాణాలతో తిరిగి వస్తామని నమ్ముతారు. అందువల్ల ‘ఎవరెస్టు’ శిఖరాన్ని అధిరోహించ బోయే ముందు పర్వతారోహకులు ఈ దేవతల ఆశీర్వాదం కొరకు పూజలు చేస్తారు.
17,000 అడుగుల ఎత్తులో ఉన్న ఆధార స్థావరానికి (base camp) వెళ్ళే దారి పొడుగునా ఎన్నో మత చిహ్నాలు, ఆరాధనా ప్రదేశాలు ఉంటాయి. అనేక పూజా విగ్రహాలు, ఆరాధనా కేతనాలతో కప్పబడిన ఒక బౌద్ధస్థూపం, చనిపోయిన దాదాపు 200 మందికి స్మృతి చిహ్నంగా రాళ్ళతో పేర్చబడిన గుట్టలతో నిండిన సమాధులు కూడా ఈ దార్లో కన్పిస్తాయి.
మొదటిసారిగా శిఖరం మీద
ఎడ్మండ్ హిల్లరీ (edmund hillary) , టెంజింగ్ నార్కే(tenzing norgay) 1953వ సంవత్సరంలో మొదటిసారిగా ఈ పర్వత శిఖరం మీద కాలుమోపినపుడు మానవ జాతియావత్తు గర్వంతో ఉప్పొంగిపోయింది. అప్పటికే ఉత్తర, దక్షిణ ధృవాల మీద విజయం సాధించిన మానవజాతికి మూడవ ధృవంగా భావించే ఎవరెస్టు పర్వత శిఖరం మీద కూడా విజయం సాధించటం అనేది ఒక సవాలుగా నిలిచింది.
ఎడ్మండ్ హిల్లరీ, టెంజింగ్ నార్కే ఎన్నో కష్టనష్టాల కోర్చి ఎవరెస్టు శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించి, మానవజాతి సహజ స్వభావగుణాలైన పట్టుదల, కార్యదీక్ష, ధైర్యసాహసాన్ని ఇంకోసారి చాటి చెప్పారు. దీంతో ఉత్తేజం పొందిన అనేక దేశాల పర్వతారోహకులు నేపాల్ దారిపట్టారు.
హిమాలయ పర్వత ప్రాంతాల్లో వున్న రాజకీయ అనిశ్చితికారణంగా, ఎవరెస్టును అధిరోహించటానికి అవసరమైన అధికారిక ఆమోదపత్రం లభించటం అనేది దాదాపు అసంభవమైనా, అనేక దేశాల ప్రభుత్వాలు తమతమ దేశాలకు చెందిన పర్వతారోహకుల బృందాలకు అవసరమైన అనుమతుల కోసం అత్యున్నతస్థాయిలో ప్రయత్నాలు చేస్తుంటాయి.
ఏడు సంవత్సరాల తర్వాత 1960లో చైనా దేశానికి చెందిన ఒక పర్వతారోహకుల బృందం టిబెట్ వైపు నుంచి వున్న ఉత్తరపు మార్గం ద్వారా ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించటంలో విజయాన్ని సాధించారు.
1963వ సంవత్సరంలో అమెరికాకు చెందిన పర్వతారోహకులు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు.
1975 సంవత్సరంలో ఇంగ్లండ్ కి చెందిన పర్వతారోహకులు అత్యంత క్లిష్టమైన నైఋతి కుడ్యం దారి గుండా ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు.
1978వ సంవత్సరం మే నెలలో రీన్హాల్డ్ మెస్నెర్ (Reinhold Messner), పేజర్ మాబ్లర్ (Petzer Mabeler)లు ఆక్సిజన్ సహాయం లేకుండా తమ యాత్రను సాగించి శిఖరం మీద కాలుమోపారు.
1979వ సంవత్సరంలో యుగోస్లావియా దేశానికి చెందిన పర్వతారోహకుల బృందం శిఖర మార్గాలు అన్నింటిలోకి ఎంతో ప్రమాదకరమైన పశ్చిమ శిఖరం వైపునుంచి శిఖరాన్ని అధిరోహించారు.
1980వ సంవత్సరం శీతాకాలంలో పోలెండ్ దేశానికి చెందిన పర్వతారోహకులు దక్షిణ శాడిల్ (saddle) మార్గం నుంచి ఈ శిఖరాన్ని జయించారు.
1980వ దశకం నుంచి పూర్తి అనుభవం లేని పర్వతారోహకులు కూడా ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాలని ఉవ్విళ్ళూరటం మొదలయింది. ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించటంలో వున్న సాధకబాధకాలను తక్కువగా అంచనా వేసుకోవటం, తమ శక్తి యుక్తులను ఎక్కువ అంచనా వేసుకోవటం అనేది సాధారణ మయిపోయింది.
వాతావరణం
దానివల్ల ఆధార స్థావరం నుంచి బయల్దేరే ప్రతి 20 మంది పర్వతారోహకుల్లో ఒకళ్ళు, మారణ ప్రదేశం దాటి ముందుకు వెళ్ళగలిగినా అంత ఎత్తులో ఆక్సిజన్ లేనందున, 20,000 అడుగుల ఎత్తు దాటిన తర్వాత వుండే అతి తీష్ణ వాతావరణ అననుకూలత, వీటితోపాటు శారీరకశ్రమ, ఒత్తిడి వీటివల్ల పదిమందిలో ఒకళ్ళు చొప్పున తమ ప్రాణాలు కోల్పోవటం జరుగుతున్నది. అంత ఎత్తులో, అటువంటి వాతావరణంలో ఆ అగాధాల్లో పడి మరణించిన వారి శవాల్ని కిందకు తీసుకు రావటం కూడా దాదాపు అసంభవంగానే మారుతుంది. వాళ్ళం దర్నీ విశ్వమాత – భూదేవి తన చల్లని ఒడిలో శాశ్వతంగా పొదువుకుంటోంది.
వివరములు : క్రీస్తుశకం 1924వ సంవత్సరంలో ఇద్దరు బ్రిటిష్ పర్వతా రోహకులు మాలరీ, ఇర్విన్లు ఎవరెస్టు పర్వత శిఖరాన్ని అధిరోహించటానికి ప్రయత్నం చేశారు. తిరిగి వస్తూ మార్గ మధ్యంలో తమ ప్రాణాల్ని కోల్పోయారు. వాళ్ళు శిఖరం మీద కాలు మోపారా లేదా అనేది ఎవరికీ అంతు పట్టని విషయంగా మిగిలిపోయింది. క్రీస్తుశకం 1953వ సంవత్సరంలో హిల్లరీ, నార్కేలు మొట్ట మొదటిసారిగా ఎవరెస్టు పర్వత శిఖరాన్ని అధిరోహించారు. క్రీస్తుశకం 1960వ సంవత్సరంలో చైనా దేశానికి చెందిన పర్వతారోహకుల బృందం ఉత్తరపు మార్గం నుంచి శిఖ రాన్ని చేరుకొంది.
క్రీస్తుశకం 1978వ సంవత్సరంలో మెస్నర్ మరియు హాబిలర్ అనేవారు ఆక్సిజన్ సిలెండర్లు ఉపయోగించకుండా శిఖరాన్ని చేరుకొన్నారు.
క్రీస్తుశకం 1980వ సంవత్సరంలో ఐర్లాండ్ కి చెందిన పర్వతారోహకుల బృందం సౌత్ శాడిల్ మార్గం ద్వారా శీతాకాలంలో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించింది. క్రీస్తుశకం 1996వ సంవత్సరంలో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించే క్రమంలో 15 మంది పర్వతారోహకులు తమ ప్రాణాల్ని పోగొట్టుకొన్నారు. క్రీస్తుశకం 2004వ సంవత్సరంలో షెర్పాపెంబాడోరీ ఆధార స్థావరం నుంచి 8 గంటల్లో శిఖరాన్ని చేరుకొని ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
మరిన్ని వార్తలు చదవండి :
తెలంగాణ వార్తలు | జాతీయ వార్తలు | సినిమా వార్తలు | అంతర్జాతీయ వార్తలు | ఆరోగ్య చిట్కాలు