Moral Stories in Telugu : ఒకసారి ఒక దట్టమైన అరణ్యం గుండా ఒక బ్రాహ్మణుడు ప్రయాణిస్తున్నాడు.
“ఓయీ ! బ్రాహ్మణోత్తమా !” అన్న పిలుపు వినబడింది. ఆ పిలుపు వచ్చిన వైపు చూశాడు బ్రాహ్మణుడు. అక్కడ ఒక చెరువుగట్టు మీద ఒక ముసలి పులి నిలబడి ఉంది. ఆ పులిని చూడగానే బ్రాహ్మణుడి పై ప్రాణాలు పైనే పోయాయి.
“భయపడకు. నేను నిన్ను చంపను. నా దగ్గర ఒక బంగారు కంకణం ఉంది. దానిని నీకు దానం ఇవ్వాలనుకుంటున్నాను. రా ! తీసుకో ! అంది పులి !
బంగారు కంకణాన్ని చూడగానే బ్రాహ్మణుడికి ఆశ కలిగింది. “నువ్వు క్రూరమృగానివి. నిన్ను నేను ఎలా నమ్ముతాను ?” అని అన్నాడు.
“అయ్యా ! మీరు నన్ను నమ్మవచ్చు. ఎందుకంటే నేను మునుపటి క్రూర జంతువుని కాను. వయసులో ఉండగా నేను చాలా పాపాలు చేసాను. ఎన్నో జంతువులను పొట్టన పెట్టుకున్నాను.
ఒక ఋషి నా పాపాలు పోవాలంటే ఇకనైనా మంచి కార్యాలు చేస్తూ జీవించమని చెప్పాడు. జీవహింస మాని సన్మా ర్గంలో నడుస్తున్నాను. చాలా రోజుల నుండీ నా దగ్గర ఈ బంగారు కంకణం ఉంది. దీన్ని మా జంతువులు ఏం చేసుకుంటాయి చెప్పు. అందుకే ఎవరైనా మానవుడు కనిపిస్తే ఇది ఇవ్వాలని ఎదురు చూస్తున్నాను. చెరువులో స్నానం చేసి వచ్చి ఈ కంకణం తీసుకో” అని చెప్పింది పులి.
పులి మాటలు నమ్మి ఆ బ్రాహ్మణుడు ఎంతో ఆశగా చెరువులో స్నానం చెయ్యటానికి దిగాడు. చెరువులో దిగగానే అందులోని బురదలో కూరుకుపోయాడు.
“అయ్యో ! బురదలో కూరుకుపోయావా ? భయపడకు. నిన్ను నేను రక్షిస్తాను” అంటూ పులి బ్రాహ్మణుడి వద్దకు వెళ్ళి అతన్ని చంపితినేసింది.
నీతి : ఊరికే వస్తుందని ఎక్కువ ఆశపడితే ఉన్నది పోతుంది.
also read news:
India: టీమిండియాకి గుడ్ న్యూస్.. గాయాల బారిన పడ్డ వారందరు తిరిగి వచ్చేస్తున్నారు..!
Green peas in winter: చలికాలంలో బఠానీ తింటే అనారోగ్య సమస్యలు దూరం.. ఉపయోగాలివే!