Moral Stories in Telugu : సింగమల అనే అడవిని కంఠి అనే సింహం పాలిస్తుండేది. దానికి నక్క, కాకి అనుచరులుగా ఉండేవి. ఓరోజు కాకి ఎగురుకుంటూ వచ్చి ‘మన అడవికి దూరంగా ఉన్న ఎడారిలో ఒంటెను చూశాను. దాన్ని వేటాడగలిగితే మనకు వారంపాటు ఆహారానికి సమస్య రాదు!’ అని చెప్పి సింహాన్నీ, నక్కనీ బయల్దేరదీసింది.
కానీ ఎడారి లోకి అడుగుపెట్టగానే అక్కడి వేడికి సింహం, నక్కల కాళ్లు కాలి నడవలేకపోయాయి. దాంతో కాకి ఒంటె దగ్గర కెళ్లి ‘మిత్రమా! నువ్వు మా రాజు సింహాన్నీ, మంత్రి నక్కనీ అడవిలో దించగలవా!’ అని అడిగింది. ఒప్పుకున్న ఒంటె సింహాన్నీ, నక్కనీ మోసుకుంటూ వాళ్ల స్థావరానికి తెచ్చింది.
దాని మంచితనం సింహానికి బాగా నచ్చి ‘మిత్రమా! నువ్వు కూడా మాతోపాటూ ఇక్కడే ఉండు!’ అంది ఒంటెతో, సింహం ఉన్నపళంగా తీసుకున్న ఈ నిర్ణయం నక్కకీ, కాకికీ బొత్తిగా నచ్చలేదు. అవి ఓ ఉపాయం పన్నాయి. ‘మహరాజా! కాళ్లు కాలడం వల్ల మీరు ఇప్పట్లో వేటాడలేరు. మీరు ఆకలితో ఉండటం మేం చూడలేం. కాబట్టి మమ్మల్ని తినండి!’ అన్నాయి.
అది విన్న ఒంటె ‘వాళ్లని వదిలెయ్ రాజా! నన్ను చంపితే మీ ముగ్గురికీ వారంపాటు ఆహారం కాగలను!’ అంటూ ముందుకొచ్చింది. నక్కా, కాకీ ఆ మాట కోసమే ఇలా నాటకమాడాయని సింహానికి అర్థమై పోయింది.
దాంతో ‘సరే… ఒక్కొక్కరూ వరసగా రండి. ముందు చిన్న జీవితో మొదలుపెడతాను. కాకీ! నువ్వు రా ముందు…’ అంది. ఆ మాటకి కాకి తుర్రుమంటే… నక్కేమో పరుగు లంఘించుకుంది. ఒంటె, సింహాలు మాత్రం అప్పటి నుంచి మంచి స్నేహితులుగా ఉండిపోయాయి.
also read other news:
భావోద్వేగాలు మీ శరీరానికి ఎలా హాని చేస్తాయి ?