Telugu Flash News

Moral stories in Telugu : రెండు నాల్కలవాడు

moral stories in telugu fox and wolf story

Moral stories in Telugu : ఒక అడవిలో ఒక నక్కను కొన్ని తోడేళ్ళు తరుము తున్నాయి. నక్క గుక్క తిప్పుకోకుండా ప్రాణ భయంతో ఊపిరి బిగపెట్టి పరుగు తీస్తోంది. తోడేళ్ళు తమ ఆహారాన్ని వదలలేక మరింత వేగంగా దూసుకు వస్తున్నాయి. నక్క ఇక పరుగెత్తలేక ఒక గుడిసె వెనకాల దాక్కుంది. ఆ గుడిసె ముందు చెట్టుపై ఒకతను కట్టెలు కొడుతున్నాడు.

నక్క అతన్ని చూసి “అయ్యా ! నేను ప్రాణభయంతో పరు గెత్తుకు వస్తున్నాను. నన్ను తోడేళ్ళు తరుముతున్నాయి. అవి వస్తే దయచేసి నేనిక్కడ ఉన్నానని చెప్పకు” అని అంది, బదులుగా అతను “సరే ! నువ్వు ప్రాణం అరచేతిలో పెట్టుకొని వస్తున్నావు. నువ్విక్కడ దాక్కున్నావని చెప్పనులే” అన్నాడు.

అంతలో తోడేళ్ళు రొప్పుతూ అతని ముందుకు వచ్చాయి. “అయ్యా ! మేము ఒక నక్క కోసం వెతుకుతున్నాం. నక్కకానీ ఇటువైపు వచ్చిందా ? చెప్పండి. మీకు మేము ఋణపడి ఉంటాం” అని అన్నాయి తోడేళ్ళు ముక్తకంఠంతో,

కొద్దిసేపు ఆలోచించిన ఆ కట్టెలు కొట్టేవాడు, ఒక చేయి నక్కవైపు, మరో చేయి రోడ్డు వైపు చూపిస్తూ “అటుగా వెళ్ళింది” అని పలికాడు. అతని సంజ్ఞను అర్ధం చేసుకోలేని వెర్రి తోడేళ్ళు అతను చూపించిన రోడ్డు వైపు పరుగెత్తాయి.

“హమ్మయ్య ! అని బయటకు వచ్చిన నక్క తన దారిన తను వెళుతుంటే కట్టెలు కొట్టుకొనేవాడు నక్కతో “ఇంత సహాయం చేస్తే కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పవా ?” అని అన్నాడు.

“నువ్వు మామూలువాడివైతే కృతజ్ఞతలు చెప్పేదాన్ని. కానీ నువ్వు రెండు నాల్కల వాడివి. నావైపు చూపిస్తూ మరో వైపు వెళ్ళిందని చెప్పావు. నీలాంటి వాడికి కృతజ్ఞతలు చెప్పడం కూడా సంస్కారం అనిపించుకోదు.” అంది నక్క.

నీతి : రెండు నాల్కల ధోరణి ఎప్పుడూ మంచిది కాదు.

also read news: 

Harish Rao : ఆర్థిక సంఘం నిధుల సంగతి ఎందుకు మాట్లాడలేదు? జేపీ నడ్డాపై మంత్రి హరీష్‌ రావు ఫైర్‌

Bihar News: బిహార్‌లో కల్లోలం.. 71కి చేరిన కల్తీ సారా మృతులు.. నితీష్‌ సర్కార్‌కు ఎన్‌హెచ్‌ఆర్‌సీ తాఖీదులు!

Exit mobile version