Moral Stories in Telugu : అనగనగా ఒక అడవి. ఆ అడవికి కాస్త దూరంలో మరో అడవి ఉంది. ఒకసారి ఈ అడవిలో జంతువులన్నీ ఆ అడవిలో జంతువులకు, మరోసారి ఆ అడవిలో జంతువులు ఈ అడవిలో వారికి విందు ఏర్పాటు చేసుకొనేవారు. అలాంటి విందులో కొంగకు, నక్కకు స్నేహం కలిసింది. చాలాసార్లు తన ఇంటికి రమ్మని నక్క పిలవటం, కుదరటంలేదని కొంగ వెళ్ళిపోవటం జరిగేది.
కానీ ఒకసారి తోటి కొంగపెళ్ళికి వచ్చిన కొంగ, పాపం అన్నిసార్లు పిలుస్తోంది ఒక నాలుగు రోజులు ఉండి వస్తే స్నేహితుడ్ని తృప్తిపరిచినట్లు ఉంటుందనిపించి చెప్పా పెట్టకుండా నక్కను ఆశ్చర్యంలో ముంచాలని ఇంటి ముందు వాలింది.
తలుపు తీసిన నక్క ముందు తెల్లబోయింది. సరే బాగుండదని లోపలికి పిలిచింది. ముక్తసరిగా మాట్లాడుతున్న నక్కను ఆశ్చర్యంగా చూసింది కొంగ. ఆకలి వేస్తోంది. ఏమీ పెట్టే ఉద్దేశం కనిపించటం లేదు.
పోనీ బయటకు వెళ్ళి ఏ చెరువులోనైనా చేపలు పట్టుకొని తిందామన్నా అడవి అంతా టముకు వేసినట్లు అడిగిన వాళ్ళకు, అడగనివాళ్ళుకు అందరికీ తమ స్నేహం గురించి, నక్క పిలుపు గురించి చెప్పుకుంటూ వచ్చింది. ఇప్పుడు తను బయటికి వెళితే నక్క పరువూ, తన పరువూ రెండూ పోతాయి అనుకొని సాయంత్రం దాకా ఓపికపట్టి ఇక వెళ్ళొస్తానని బయలుదేరింది కొంగ.
అలా కొంగ చెప్పగానే లోలోపల సంబరపడిపోతూనే బయటికి మాత్రం “అయ్యో ! కొంగ బావా అప్పుడే వెళ్ళిపోతావా ‘ సమయానికి నువ్వు వచ్చేటప్పటికి ఇంట్లో ఏమీ లేకపోయాయి. వెళ్ళాలని నేనెంత కుమిలిపోయానో, బాధపడి పోతున్నానో అని పోనీ బయటకు వెళ్ళి తెద్దామా అంటే నిన్ను ఒంటరిగా వదిలి దొంగ మాటలు చెప్పింది.
“నీ ఆహ్వానం పెదవుల చివర నుంచి వచ్చినదని, మనసులోంచి రాలేదని అప్పుడు గ్రహించలేకపోయాను. ఇప్పుడు కూడానా ” అని మనసులో అనుకొని “ఫరవాలేదులే నక్కబావా ! పని ఉండి వెళుతున్నాను. ఈసారి అటు వచ్చినప్పుడు, నువ్వు తప్పక నా ఇంటికి రావాలి” అని చెప్పి వెళ్ళిపోయింది.
నక్కకు బుద్ధి
ఏదోరోజు ఈ నక్కకు బుద్ధి చెప్పకపోతానా అని అనుకోకుండా ఉండలేకపోయింది కొంగ. కొన్ని నెలల తరువాత నక్కకు జబ్బు చేసింది. దాని బుద్ధి తెలిసినవారు ఎవరూ దాన్ని దగ్గరకు రానివ్వలేదు. ఇక గతిలేక కొంగను వెతుక్కుంటూ బయలుదేరింది.
కొంగ కూడా తక్కువ తిన్నానా అన్నట్లు నక్క ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా మర్యాద చేసిందో అలాగే చేసింది. ఆరోగ్యంతో ఉన్న కొంగే ఆకలికి తట్టుకోలేకపోయింది. ఇక అనారోగ్యంతో ఉన్న నక్క మూలుగుతూ ఓ మూల చేరింది.
అప్పుడు కొంగ లోపలికి వెళ్ళి నక్కకు ఇష్టమైనవన్నీ వండి తెచ్చి కడుపు నిండా తిండి పెట్టింది. హాయిగా నిద్రపొమ్మంది. నిద్రలేచాక చెప్పింది నీకు పెట్టలేక, మా ఇంట్లో లేక కాదు. నీవు నిజం గ్రహించాలని. నీకు బుద్ధి రావాలని ఇలా చేశాను.
ఎవరూ తమ ఇంట్లో లేక చుట్టా లింటికి, స్నేహితులింటికి రారు. వచ్చినా ఆకలి వేస్తోందని లోపలికి వచ్చి తినరు. కాబట్టి ఇంటికి వచ్చిన అతిధులకు ఆకలి ఎప్పుడు వేస్తుందో గ్రహించి పెట్టటమే అసలైన మర్యాద” అంది కొంగ. తన తప్పు గ్రహించి బుద్ధిగా తల ఊపింది నక్క.
నీతి : స్నేహితుల వద్ద కుయుక్తులు ప్రయోగించకూడదు.
మరిన్ని వార్తలు చదవండి :
Indiana Jones and the Dial of Destiny Trailer : ఇండియానా జోన్స్ 5 ట్రైలర్ విడుదల
HIT 2 telugu movie review : హిట్ 2 తెలుగు మూవీ రివ్యూ