MLC Kavitha On Modi : బీజేపీపై, ప్రధాని నరేంద్ర మోదీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి మండిపడ్డారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోందని కవిత ఆరోపించారు. మోసపూరిత హామీలతో బీజేపీ సర్కార్ యువతను మోసగిస్తోందన్నారు. ఏటా రెండు కోట్లకుపైగా ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి మోదీ విస్మరించారని కవిత ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఉద్యోగాల భర్తీ ఎప్పుడని ప్రశ్నించారు.
అసలు ఉద్యోగాలు పూరించే ఆలోచన ఉందా? అని కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించారు. దేశంలో డిగ్రీ లేని వ్యక్తి అత్యున్నత ఉద్యోగం ఉందని, నిజమైన డిగ్రీ ఉన్న వాళ్లకు ఉద్యోగాలు రావడం లేదని కవిత ఎద్దేవా చేశారు.దేశ వ్యాప్తంగా ఉన్న యువత శక్తిని, వారి శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకొనేందుకు కేంద్రం చర్యలు తీసుకోవడం లేదని కవిత అన్నారు.ప్రధాని మోదీని ఉద్దేశించి ఆమె పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
కేంద్రంలో ఖాళీగా ఉన్న పది లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారని కవిత ప్రశ్నించారు. దేశంలో నిరుద్యోగ రేటు 7.8 శాతంగా ఉందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నిరుద్యోగిత రూపుమాపేందుకు కేంద్రం ముందడుగు వేయడం లేదన్నారు.ఇక ప్రధాని మోదీ విద్యార్హతలపై కేజ్రీవాల్ వ్యాఖ్యలతో దేశ వ్యాప్తంగా దుమారం రేగిన సంగతి తెలిసిందే.
ప్రధాని డిగ్రీ సర్టిఫికెట్ చూపాలంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ విద్యార్హతలకు సంబంధించి ఎలాంటి డిగ్రీలు చూపించాల్సిన అవసరం లేదని గుజరాత్ హైకోర్టు ఇటీవల తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. అయితే, దీనిపై ప్రతిపక్షాలు తమదైన శైలిలో విమర్శలు చేస్తున్నాయి. ఈ తీర్పుతో ప్రధాని విద్యార్హతల విషయంలో అనుమానం మరింత పెరిగిందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు.
ప్రధాని విద్యావంతుడైతే పెద్ద నోట్ల రద్దు లాంటి నిర్ణయాలు జరిగేవి కావన్నారు.మరోవైపు ప్రధాని విద్యార్హతలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా పరోక్షంగా సెటైర్లు వేశారు. ఇటీవల ట్విట్టర్లో తన విద్యార్హతలను షేర్ చేశారు కేటీఆర్. పుణె వర్సిటీలో కేటీఆర్ చదువుకున్నారు. అక్కడ బయో టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేసి పై చదువుల కోసం అమెరికా వెళ్లారు.
సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. ఇక తమ విద్యార్హత సర్టిఫికెట్లను వెల్లడిస్తూ పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
also read :
Viral Video : బైక్పై ముందో యువతి, వెనకో యువతి.. నడిరోడ్డుపై అర్ధరాత్రి ఫీట్లు!