Telugu Flash News

MLA Rajaiah : రాజయ్య వేధింపుల వ్యవహారంలో ట్విస్ట్‌.. దంపతులతో కలిసి రాజయ్య ప్రెస్‌మీట్‌!

MLA Rajaiah News : తనపై ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని జానకిపురం సర్పంచ్‌ నవ్య ఆరోపించిన నేపథ్యంలో కొత్త ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఆదివారం సర్పంచ్‌ నవ్య ఇంటికి వెళ్లిన రాజయ్య మీడియా సమక్షంలో ఆమెకు సారీ చెప్పారు. దీంతో ఈ వివాదం సద్దుమణిగిట్లయింది. సర్పంచ్‌ భర్త ప్రవీణ్‌కు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చిన ఎమ్మెల్యే.. అనంతరం ఆ దంతపతులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్బంగా సర్పంచ్‌ నవ్య మాట్లాడారు. వేధింపులపై సహించేది లేదన్నారు. మహిళలకు అన్యాయం జరుగుతోందన్న సర్పంచ్.. తాను మాట్లాడిన ప్రతి మాటా వాస్తవమేనన్నారు. అన్యాయాలు, అరాచకాలపై సహించవద్దని మహిళలకు సూచించారు. చిన్నారులపై కూడా వేధింపులు జరుగుతున్నాయని, మహిళలపై వేధింపులకు పాల్పడితే భరతం పడతామంటూ హెచ్చరించారు. ఎమ్మెల్యే రాజయ్య వల్లే తాను సర్పంచ్‌ అయ్యానని, ఆయనంటే గౌరవం ఉందన్నారు. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానన్న సర్పంచ్‌.. జరిగిన విషయాన్ని మర్చిపోయి ఇకపై ఇలాంటివి జరగకుండా చూడాలని కోరుతున్నానన్నారు. తప్పును ఒప్పుకొని క్షమాపణ చెబితే చాలన్నారు.

ఇక ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ.. జరిగిన పరిణామాలకు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తనకు నలుగురు అక్కచెల్లెళ్లు ఉన్నారన్నారు. ప్రవీణ్‌పై అభిమానంతో అతని భార్యకు సర్పంచ్‌ టికెట్‌ ఇచ్చానన్నారు. తాను తెలిసీ తెలియక చేసిన పనుల వల్ల మానసిక క్షోభకు గురైతే క్షమించాలని కోరారు. జానకిపురం అభివృద్ధికి పాటుపడతానన్నారు. అధిష్టానం ఆదేశాల మేరకు 25 లక్షల రూపాయలను తక్షణమే మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే రాజయ్య వెల్లడించారు.

ఎమ్మెల్యే ఫోన్‌ సంభాషణ సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఆయనపై రాష్ట్ర మహిళా కమిషన్‌ చర్యలకు పూనుకుంది. రాజయ్యపై సర్పంచ్‌ నవ్య చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించింది మహిళా కమిషన్‌. రాజయ్య వ్యాఖ్యలపై విచారణ చేయాలంటూ డీజీపీకి మహిళా కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కమిషన్‌ చైర్‌ పర్సన్‌ సునీతాలక్ష్మారెడ్డి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఎమ్మెల్యే రాజయ్య తనకు ఫోన్‌ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారని, లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని సర్పంచ్‌ నవ్య పేర్కొన్నారు. తన వెనుక ఎవరూ లేరన్న సర్పంచ్.. ఇలాంటి వేధింపులు ఎదుర్కొంటూ రాజకీయాలు చేయాల్సిన పని లేదన్నారు. ఈ ఘటనపై స్పందించిన బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం దిద్దుబాటు చర్యలు తీసుకుంది.

also read :

NTR: ఎన్టీఆర్ కోసం ప్రాణాలైన తీస్తానంటూ క‌మెడీయ‌న్ సంచ‌ల‌న కామెంట్స్

Allu Arjun : ప్ర‌భాస్‌ని మించిపోయిన అల్లు అర్జున్.. సోష‌ల్ మీడియాలో ఫ్యాన్స్ వార్

Exit mobile version