Litton Das: ప్రస్తుతం భారత్, బంగ్లాదేశ్ మధ్య వన్డే సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత టెస్ట్ సిరీస్ జరగనుంది. అయితే టీ20 వరల్డ్ కప్ 2022 సెమీస్‌లో ఓటమితో తీవ్ర విమర్శల పాలైన టీమిండియాకు పసికూన బంగ్లాదేశ్ ఊహించని షోక్ ఇచ్చింది. వరల్డ్ కప్‌లో ఓడించినంత పని చేసిన బంగ్లా తాజాగా జరిగిన వన్డే మ్యాచ్‌లో ఓడించి సంచలనం సృష్టించింది. విమర్శల సుడిగుండలంలో చిక్కుకున్న రోహిత్ సేనను మరింత లోతుకు నెట్టేసింది. కొద్ది రోజుల క్రితం టీ20 వరల్డ్ కప్ సందర్భంగా భారత్‌తో తలపడిన బంగ్లాదేశ్‌కు ఇప్పుడు టీమిండియాను ఓడించిన బంగ్లాదేశ్ జట్టులో చాలా మార్పు అయితే కనిపిస్తుంది.. ముఖ్యంగా ఆ మార్పు మరేదో కాదు కెప్టెన్ లిట్టన్ దాస్.
టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియాతో ఆడిన బంగ్లాదేశ్ టీమ్‌కు స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ కెప్టెన్‌గా ఉండగా, మ్యాచ్‌కు ముందు షకీబ్ అల్ హసన్ ఇచ్చిన స్టేట్‌మెంట్ చూస్తే.. టీమిండియా కంటే తమ టీమ్ వీక్ అనే విషయం వారి మైండ్‌లో ఉండిపోయిందని అర్ధమైంది. కాని లిట్టన్ దాస్ మాత్రం అలా లేడు. భారత్ పెద్ద జట్టు అయితే.. గెలవాలనే మన కసి వారిని ఓడిస్తుందంటూ.. కెప్టెన్‌గా ప్రతి బంగ్లా ఆటగాడి మైండ్‌సెట్‌ను అయితే ట్రైన్ చేశాడు. అదే కసి ఆదివారం మ్యాచ్‌లో ప్రతి బంగ్లాదేశీ ప్లేయర్‌లో కనిపించడంతో మంచి విజయం సాధించారు. భారత సంతతికి చెందిన లిట్టన్ దాస్.. టీమిండియాపైనే టెస్టు, వన్డే అరంగేట్రం చేయగా, ఇటివల టీ20 వరల్డ్ కప్‌లో అతను ఆడిన తీరుతో ఎక్కువ పేరు వచ్చింది.
బంగ్లాదేశ్ భవిష్యత్తు మార్చే కెప్టెన్‌గా అతను కనిపిస్తున్నాడు. ఇప్పుడు అతను పేరు మారు మ్రోగిపోతుండగా, గతంలో జాతి వివక్షను సైతం ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. హిందువు అనే ఒకే ఒక్క కారణంతో దాస్ చాలా అవమానాలు పడ్డాడు. బంగ్లాదేశ్ జట్టులో ఉన్న ఇద్దరు హిందూ క్రికెటర్లలో దాస్ ఒకడు కాగా, సౌమ్యా సర్కారు మరో ఆటగాడు. హిందువు అనే కారణంగానే కొన్ని టోర్నీల్లో సైతం దాస్‌ను పక్కన పెట్టారని అతని సన్నిహితులు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. లిట్టన్ దాస్ బంగ్లాదేశ్‌లోని దినాజ్ పూర్ ప్రాంతానికి చెందిన బెంగాలీ హిందూ కుటుంబంలో పుట్టగా, అతను జాతీయ జట్టుకు ఎంపిక అవ్వడం కోసం ఒక యుద్ధమే చేయాల్సి వచ్చింది. అయితే రానున్న కాలంలో బంగ్లాదేశ్ టీమ్‌ను ఒక పటిష్టమైన జట్టుగా మార్చే ప్రయత్నం చేయబోతున్నాడు లిట్టన్.