Lal Darwaza Bonalu LIVE | Old City Bonalu | Ashada Bonalu
హైదరాబాద్ పాతబస్తీలోని లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర కన్నుల పండువగా జరుగుతుంది. తెల్లవారుజాము నుంచే అమ్మవారికి బోనం సమర్పించేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. మహంకాళిని చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు క్యూలైన్లలో వేచి ఉన్నారు. కాగా, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఆదివారం ఉదయం ఆలయ అర్చకులు అమ్మవారికి అభిషేకం నిర్వహించి తొలి బోనం సమర్పించారు. ఆషాఢ మాసం చివరి ఆదివారం కావడంతో మహంకాళికి బోనాలు సమర్పించేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ప్రభుత్వం తరపున మంత్రులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. మరోవైపు రెండు రోజుల పాటు జరిగే జాతరలో అమ్మవారికి బోనాలు సమర్పించి పూజలు చేస్తారు. రెండో రోజైన సోమవారం రంగం కార్యక్రమం జరగనుంది.
బోనాల పండుగ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సున్నిత ప్రాంతాలను సీసీ కెమెరాలతో పర్యవేక్షించారు. మహంకాళి ఆలయం, అక్కన్న మాదన్న, జియాగూడ సబ్జిమండి, కార్వాన్ దర్బార్ మైసమ్మ, గోల్కొండ తదితర చారిత్రక ఆలయాల వద్ద ప్రత్యేక ఏర్పాటుచేశారు.