మన అనంత విశ్వంలో, గ్రహాలు మరియు నక్షత్రాలు నక్షత్రరాశులతో కలిసి ఉంటాయి మరియు మన పూర్వీకులు విశ్వంలో సూర్యుడు మరియు చంద్రుల కదలికల ఆధారంగా సమయాన్ని నిర్ణయించేవారు.
కాలము – దాని వివరణ
మానవుని ఆరు కనురెప్పపాట్ల కాలమునకు ఒక విఘడియ అని పేరు పెట్టిరి. 60 విఘడియలు ఒక గడియ. 7 1/2 గడియలు ఒక జాము. 8 జాములు ఒక పగలు, ఒక రాత్రి కలిపి ‘తిధి’ అందురు అంటే (1 రోజు).
కాలమానము
- కనురెప్ప పాటు కాలము 1 సెకను.
- 60 సెకనులు 1 నిమిషము.
- 60 నిమిషములు 1 గంట.
- 12 గంటలు 1 పగలు. 12 గంటలు 1 రాత్రి.
- ఒక రాత్రి, ఒక పగలు కలిసి ఒక రోజు.
- 24 గంటలు ఒక రోజు.
- 7 రోజులు ఒక వారము.
- 2 వారములు 1 పక్షము.
- 2 పక్షములు 1 నెల.
- 12 నెలలు 1 సంవత్సరము.
- సంవత్సరములో ఫిబ్రవరి నెలకు 28 రోజులుండును.
- 4 సంవ త్సరముల కొకసారి లీపు సంవత్సరం వచ్చును.
- లీపు సంవత్సరం ఫిబ్రవరి నెలకు 29 రోజులుండును.
- సంవత్సరమునకు 365 రోజులు.
- లీపు సంవత్సరమునకు 366 రోజులుండును.
- 1 సంవ త్సరమునకు 12 నెలలు, 3 కాలములు 6 ఋతువులు.
- 24 పక్షములు 52 వారములు 365 రోజులు.
భూమి గుండ్రముగా ఉండి తనచుట్టు తానుతిరుగుచున్నందున ఎదురుగా ఉన్న సూర్యగ్రహం వెలుగు (ఎండ) భూమి పైన ఒకేప్రక్కన పడును. అంటే సూర్యునికి ఎదురుగా ఉన్న భూభాగము పైన ఎండపడును. వెనుకవైపు పడదు. కాబట్టి చీకటిగా ఉండును. భూమి తన చుట్టు తాను తిరుగుచున్నందున సూర్య కాంతి మొత్తము భూభాగముపై పడుచున్నది. కనుక ప్రతి భూ భాగమునకు వెలుతురు (పగలు) చీకటి (రాత్రి) క్రమముగా మారుచుండును. ఇలామనకు పగలు, రాత్రులు ఏర్పడుచున్నవి. ఒక పగలు ఒక రాత్రి కలిపి ఒకరోజు అనుచున్నాము.
సంవత్సరమునకు కాలములు 3
1. వేసవికాలము – చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ మాసములు.
2. వర్షాకాలము-శావణ, భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక మాసములు.
3. చలికాలము -మార్గశిర, పుష్య, మాఘ, ఫాల్గుణ మాసములు.
ఋతువులు
రెండు నెలలకు ఒక ఋతువు గా, వాటి కాలంలోని కాలధర్మాలను బట్టి ఋతువు అంటాము. సంవత్సరములోని 12 నెలలు 6 ఋతువులుగా నిర్ణయించబడినది. భూమి తనచుట్టు తాను తిరుగుతూ, సూర్యుని చుట్టు తిరిగే సంవత్సరకాలంలో సగకాలము సూర్యునికి దగ్గరగాను, మిగతా సగకాలం సూర్యునికి దూరంగాను ఉండును. అందువలన సూర్యుడు ఉత్తరమునుండి దక్షిణమునకు, దక్షిణమునుండి ఉత్తర మునకు ప్రయాణము చేయుచున్నట్లు కనబడును. సూర్యుడు ఉత్తరము దిక్కుగా ప్రయాణము చేయుచున్నట్లు కనబడుకాలము నకు ఉత్తరాయనము, దక్షిణపు దిక్కుగా ప్రయాణము చేయు కాలమును దక్షిణాయనము అందురు.
ప్రతి సంవత్సరమునకు 2 అయనములు : 1. ఉత్తరాయనము 2. దక్షిణాయనము. సంవత్సరములో మకర సంక్రాంతి నుండి ఆరు మాసములు ఉత్తరాయనము; మిగిలిన ఆరు మాసములు దక్షిణాయనము.
ఋతువులు – వాటి ధర్మములు
సంవత్సరమునకు 6 ఋతువులు
వసంతం – చైత్ర, వైశాఖం – చెట్లు చిగురిస్తాయి , పూలు పూస్తాయి.
గ్రీష్మఋతువు – జ్యేష్ఠ, ఆషాఢములు – ఎండలు బాగా కాయును.
వర్ష ఋతువు – శ్రావణ , భాద్రపదములు – వర్షములు ఎక్కువగా కురియును.
శరదృతువు – అశ్వయుజ, కార్తీకములు – మంచివెన్నెల కాయును.
హేమంత ఋతువు – మార్గశిర, పుష్య మాసములు – మంచు ఎక్కువగా కురుస్తుంది.
శిశిర ఋతువు- మాఘ, ఫాల్గుణ మాసములు – చెట్ల ఆకులు రాలుతాయి.
శకములు
సంవత్సరలెక్కల కోసం ఈ శకములు ప్రారంభమైనవి. పూర్వంనుండి మనదేశంలో అనేక శకములు వాడుకలో ఉండెను. వాటిలో ముఖ్యమైనవి. 1. శాలివాహన శకము. 2 విక్రమార్క శకము,శాలివాహన శకము దక్షిణదేశంలోను, విక్రమార్కశకము ఉత్తరదేశంలోను వాడుకలో ఉన్నవి. మనకు స్వాతంత్య్రము వచ్చిన తరువాత మన భారత ప్రభుత్వము ఇటువంటి వేరువేరు శకములుండరాదని, దేశమునకు మొత్తము ఒకే జాతీయ శకము ఉండవలెనని శాలివాహన శకమును జాతీయ శకముగా నిర్ణయించినది.
యుగములు
యుగములు నాలుగు
1. కృతయుగము – 17,28,000 సంవత్సరములు
2. త్రేతాయుగము -12,96,000 సంవత్సరములు
3 ద్వాపరయుగము – 8,64,000 సంవత్సరములు
4. కలియుగము – 4,32,000 సంవత్సరములు
నాలుగు యుగములకు కలిపి మొత్తం 43,20,000 సంవ త్సరములు అగును.
దీనినే ఒక మహాయుగము అందురు.