Telugu Flash News

Ramzan : ఇస్లామీయులకు పవిత్రమైన రంజాన్ గురించి తెలుసుకోండి..

Ramzan : రంజాన్ – ఇస్లామీయులకు అతి పవిత్రమైనటు వంటి మాసం. సత్కార్య సౌరభాలు పరిమళించే వరాల వసంతం. మానవుల మానసిక, ఆధ్యాత్మిక వికాసానికి, జీవన సాఫల్యానికి కావలసిన సమస్త విషయాలు దీనితో ముడిపడి ఉన్నాయి. ఎందుకంటే ఈ మాసం లోనే పవిత్ర ఖురాన్ గ్రంథం అవతరించింది. ఇది యావత్ మానవాళికి ఆదర్శ ప్రబోధిని. కారుణ్య సంజీవిని మార్గప్రదాయిని. ఈ మాసంలో ఉపవాసాలు విధిగా నిర్ణయించబడ్డాయి. ఇవి మానవ హృదయాలను ప్రక్షాళనం గావించి, వాటిలో దైవభీతిని, దైవభక్తిని ప్రోది చేసే అత్యుత్తమ, వర ప్రసాదితాలు. ‘యన్యాన్’ మార్గం గుండా స్వర్గార్హతను సాధించి పెట్టే అమూల్య ఆణిముత్యాలు. అసమాన సాధనా సంపత్తులు. ఈ మాసంలోనే వేయి మాసాలకన్నా విలువైన రాత్రి అని చెప్పబడిన ‘లైలతుల్ ఖద్ర్’ కూడా ఉంది. చిత్తశుద్ధితో ఈ ఒక్కరాత్రి ఆచరించే ఆరాధన వెయ్యిమాసాలకన్నా ఎక్కువగా చేసిన దైవారాధనతో సమానంగా పరిగణించబడుతుంది.

ఈ మాసంలో సత్కార్యాలు బాగా ఊపందుకుంటాయి. దుష్కార్యాలు గణనీయంగా తగ్గిపోతాయి. సమాజ వాతా వరణంలో చక్కటి ఆహ్లాదకరమైన మార్పు కనిపిస్తుంది. తరాలీ సమాజులు కూడా ఈ మాసంలోనే ఆచరించబడతాయి. అదనంగా సంపాదించుకోడానికి ఇదొక సువర్ణావకాశం. ‘ఫిత్రా ఆదేశాలు, కూడా ఈ మాసంలోనే అవతరించాయి. వీటి వల్ల సమాజంలోని పేదసాదలకు ఊరట లభిస్తుంది. దాదాపుగా అత్యధిక సంఖ్యాకులు జకాత్ కూడా ఈ మాసంలోనే చెల్లిస్తారు. ఇది కూడా పేదవారి ఆర్థిక అవసరాలు తీర్చడంలో గణనీయంగా తోడ్పడుతుంది. ఇంతేకాదు ఈ మాసంలో అనుసంధానమై ఉన్న విషయాలు అనేకం ఉన్నాయి. దైవం ఈ పవిత్ర మాసాన్ని బహుళ ప్రయోజనకారిగా తీర్చిదిద్దాడు. మానవుల ఇహపర ప్రయోజనాలకు, సాఫల్యానికి ఉపకరించే అనేక అవకాశాలున్నా సద్వినియోగం చేసుకోడానికి శక్తివంచనలేని కృషి చేయాలి. అలుపెరుగని ప్రయత్నం ఆరంభించాలి.

‘రోజా’ వ్రతమంటే ఏంటి ?

నిజానికి రోజా వ్రతమన్నది కేవలం మహమ్మద్ ప్రవక్త రంజాన్ నెల ఉపవాసాలనే ‘రోజా’ వ్రతమని అంటారు. వారి అనుసర సముదాయానికి మాత్రమే పరిమితమైన ఆరాధన కాదు. ఇది సార్వకాలిక, సార్వజనీన ఆరాధన. దీనికి చాలా ఘనమైన ప్రాచీన, సామాజిక నేపథ్యముంది. అనాదిగా ఇది అన్ని కాలాల్లో,అన్ని సమాజాల్లో చలామణిలో ఉన్నట్లు దైవగ్రంధం ఖుర్-ఆన్ ద్వారా మనకు తెలుస్తోంది. పవిత్ర ఖురాన్ లో దైవం ఇలా అంటున్నాడు.

“విశ్వాసులారా ! పూర్వ ప్రవక్తల అనుయాయులకు ఏ విధంగా రోజాలు (ఉపవాసాలు) విధించబడ్డాయో, అదేవిధంగా ఇప్పుడు మీరు కూడా ఉపవాసాలు విధిగా పాటించాలని నిర్ణయించబడింది. దీనివల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది” (2-183) అంటే ఉపవాస వ్రతం కేవలం నేటి ముస్లిం సముదాయానికి మాత్రమే ప్రత్యేకమైనవి కావని, పూర్వకాలం నుండి, ప్రవక్తలందరి అనుయాయులపై ఇవి విధిగా ఉండేవని ఈ వాక్యం ద్వారా మనకు తెలుస్తోంది. ఈనాడు కూడా ప్రపంచంలోని అన్ని దేశాల్లో, అన్ని జాతులు, అన్ని మతాల వారిలో ఈ ఉపవాస వ్రత సాంప్రదాయం కొనసాగుతోంది. కాకపోతే ఒక నిర్దుష్టమైన, మార్గదర్శకమైన సాంప్రదాయ విధానం లేకపోవచ్చు. మొత్తానికైతే ఆ భావన ఉంది. ఏదో ఒక రూపంలో ఆచరణా ఉంది.

అందుకని మనిషి తన స్థాయిని గుర్తించాలి. మానవ సమాజ బలహీనత వల్ల జరిగిన తప్పును తెలుసుకోవాలి. పశ్చాత్తాపంతో దైవం వైపునకు మరలి సత్కార్యాల్లో లీనమైపోవాలి. దైవభీతితో హృదయం కంపించిపోవాలి. ఈ విధంగా దైవానికి దగ్గర కావడానికి, సత్కార్యాల్లో ఇతోధికంగా పాలు పంచుకోడానికి పవిత్ర రంజాన్కు మించిన అవకాశం మరొకటి లేదు. ఈ మాసంలో సత్కార్యాల పుణ్యం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుంది. ఒక ఐచ్చిక కర్మ (నఫిల్) ఆచరిస్తే, ప్రవక్త సాంప్రదాయాన్ని అనుసరించి చేసిన కర్మతో సమానంగా (సున్నత్కు సమానంగా) పుణ్యం లభిస్తుంది.

మనసా, వాచా, కర్మణా ఉపవాసాలు పాటించే వారిని సత్కార్యాల ప్రతిరూపం అనవచ్చు. ఇలా త్రికరణశుద్ధితో వ్రతం పాటించే వారి అంతర్గంతోపాటు, బాహ్య శరీరంలో కూడా పవిత్రాత్మ నిత్యం జాగృతమై ఉంటుంది. అనుక్షణం వారు అప్రమత్తంగా ఉంటూ అన్ని రకాల దోషాలనుండి పవిత్రంగా, పరిశుద్ధంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. అయినప్పటికీ మానవ సమాజ బలహీనత వల్ల ఏదో ఒక పొరపాటు దొర్లిపోతూనే ఉంటుంది. ఇలాంటి చిన్నా చితకా పొరపాట్ల నుండి ఉపవాసాన్ని దోషరహితంగా, లోపరహితంగా తీర్చిదిద్దడానికి మహమ్మద్ ప్రవక్త (సం) ఒక దానాన్ని ఉపదేశించారు. ఈ ప్రత్యేక దానాన్ని చెల్లించనంత వరకూ రంజాన్ ఉపవాసాలు భూమ్యాకాశాల మధ్య షరి అత్ పరిభాషలో ‘సద్ ఫిత్’ అంటారు. ఫిత్రాదానం వేళ్ళాడుతూ ఉంటాయి. దైవసన్నిధికి చేరవు. అందుకని ఉపవాసాలు దేవుని స్వీకార భాగానికి నోచుకోవాలంటే ఫిత్రాదానం పట్ల నిర్లక్ష్యం వహించకూడదు.

దైవం అందరికీ రంజాన్ శుభాలను సమృద్ధిగా పొందే భాగ్యం ప్రసాదించాలని కోరుకుందాం.

also read :

Naga Chaitanya: శాకుంతలం ఫ్లాప్‌కి నాగ చైత‌న్య కార‌ణమా.. ఈ మాట అన్న‌ది ఎవ‌రో తెలుసా?

moral stories in telugu :  నిన్ను నీవు నిందించుకోకు..

TruthGPT : ఛాట్‌ జీపీటీకి పోటీగా ఎలన్‌మస్క్‌ కొత్త అస్త్రం.. ట్రూత్‌ జీపీటీ పేరిట ఏఐ!

 

 

Exit mobile version