King Charles III : బ్రిటన్ రాజు ఛార్లెస్-3 (75) కి క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ అయ్యిందని బకింగ్‌హామ్ ప్యాలెస్ తాజాగా వెల్లడించింది. ఈ వార్త బ్రిటన్ ప్రజలను ఆందోళనకు గురి చేసింది. రాజు ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారని ప్యాలెస్ తెలిపింది, అయితే ఆయన వ్యాధి ఏ రకమైనదో వెల్లడించలేదు.
వ్యాధి నిర్ధారణ
“ఇటీవల రాజుకు ప్రోస్ట్రేట్ గ్రంధికి సంబంధించిన పరీక్షలు చేస్తుండగా వేరే సమస్య బయటపడింది. అదనపు పరీక్షల తరువాత క్యాన్సర్ ఉన్న విషయం నిర్ధారణ అయ్యింది” అని బకింగ్‌హామ్ ప్యాలెస్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, ఇది ప్రోస్ట్రేట్ క్యాన్సర్ కాదని స్పష్టం చేసింది.
ప్రధాని సునాక్ స్పందన
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ రాజు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో స్పందించారు. “రాజు త్వరలో పూర్తి ఆరోగ్యం చేకూరి ప్రజాజీవితంలో భాగమవుతారని ఆశిస్తున్నాను” అని అన్నారు.
గత నెలలో ఆసుపత్రిలో
గత నెలలో, రాజు ప్రోస్ట్రేట్ సమస్యతో మూడు రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్నారు. మరోవైపు, రాజు కోడలు, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కేట్ కూడా ఇటీవల ఉదర భాగంలో సర్జరీ చేయించుకున్నారు. రెండు వారాల పాటు ఆసుపత్రిలో ఉన్న ఆమె ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నారని ప్యాలెస్ వర్గాలు తెలిపాయి.
రాజు ఛార్లెస్ సింహాసనం
బ్రిటన్ రాణి ఎలిజబెత్ II మరణం తరువాత 2022లో ఆమె కుమారుడు ఛార్లెస్ సింహాసనాన్ని అధిష్ఠించారు. రాజు క్యాన్సర్ నిర్ధారణ బ్రిటన్ రాజరిక కుటుంబం మరియు ప్రజలను ఆందోళనకు గురి చేసింది. రాజు త్వరగా కోలుకోవాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.