KCR Visit to Nanded News : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బీఆర్‌ఎస్ పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు కసరత్తులు మొదలు పెట్టారు. ఇందులో భాగంగా ఇటీవల ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభకు జాతీయ నేతలు హాజరై మోదీ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. ఈ సభ విజయవంతం కావడంతో బీఆర్‌ఎస్ శ్రేణుల్లో జోష్ వచ్చింది. ఇదే ఊపుతో ఇతర రాష్ట్రాల్లోనూ సభలు నిర్వహించాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు.
ఇందులో భాగంగా మహారాష్ట్రలోని నాందేడ్‌లో బీఆర్‌ఎస్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 5వ తేదీన ఈ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. జాతీయ రాజకీయాలపై మరింతగా తన ముద్ర వేసేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. రాష్ట్రం వెలుపల కూడా బహిరంగ సభలు నిర్వహించడం ద్వారా పార్టీలో ఉత్సాహం పెంచాలని కేసీఆర్ యోచిస్తున్నారు.
నాందేడ్ సభకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లను బీఆర్‌ఎస్ నేతలు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్రకు చెందిన పలువురు నేతలు ప్రగతి భవన్‌కు వచ్చి సభ గురించి, ఏర్పాట్ల గురించి చర్చించారు. నాందేడ్ సభను విజయవంతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు మహారాష్ట్రలో తొలుత ఈనెల 29వ తేదీనే బహిరంగ సభ నిర్వహించాలనుకున్నప్పటికీ అక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి ఉండటం, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని చెబుతున్నారు.
నాందేడ్‌లో ఫిబ్రవరి 5న జరగనున్న బీఆర్‌ఎస్ బహిరంగ సభ ఏర్పాట్లను, సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను ప్రభుత్వ విప్ బాల్క సుమన్, జీవన్ రెడ్డి, బీబీ పాటిల్, జోగు రామన్న, హన్మంత్ షిండే తదితరులు పర్యవేక్షిస్తున్నారు. కేసీఆర్ తొలుత గురుద్వారను దర్శించుకుంటారని, ప్రత్యేక పూజలు చేస్తారని నేతలు తెలిపారు. హింగోలి రోడ్డు ఎదురుగా ఉన్న గురుద్వార సత్కంద్ బోర్డు మైదానంలో బీఆర్‌ఎస్‌లో చేరికల సమావేశం ఉంటుందని చెబుతున్నారు. తర్వాత కేసీఆర్ మీడియాతో ఏం మాట్లాడతారనేది ఆసక్తికరంగా మారింది.
also read news:
Breaking news : లోకేష్ పాదయాత్ర లో తారక రత్న కు కార్డియాక్ అరెస్ట్.. కొనసాగుతున్న అత్యవసర చికిత్స
Lokesh Padayatra: నేటి నుంచే యువగళం పాదయాత్ర.. సుదీర్ఘ ప్రయాణానికి నారా లోకేష్ తొలి అడుగు
India vs New Zealand : టీ20 పోరు నేటి నుంచే.. పృథ్వీ షాకు తుది జట్టులో స్థానం లభించేనా?