KCR | విద్యుత్తు కొనుగోళ్లు, థర్మల్ ప్లాంట్ల నిర్మాణంపై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో విచారణ సంఘం ఏర్పాటును సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌కు నంబర్ కేటాయించాలని హైకోర్టు నిర్ణయించింది.
ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం హైకోర్టు రిజస్ట్రీకి ఆదేశాలు జారీచేసింది. విద్యుత్తు వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 14న జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో విచారణ సంఘాన్ని నియమించింది. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్-తెలంగాణ మధ్య విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల్లో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం ఆరోపించింది. కమిషన్ ఏర్పాటు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
విద్యుత్తుశాఖ ముఖ్య కార్యదర్శిని, జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి విచారణ సంఘాన్ని, వ్యక్తిగత హోదాలో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిని ఇందులో ప్రతివాదులుగా పేరొన్నారు. అయితే, జస్టిస్ నరసింహారెడ్డిని ప్రతివాదిగా చేర్చడంపై హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం తెలిపారు. నంబర్ కేటాయించేందుకు నిరాకరించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ పిటిషన్ గురువారం హైకోర్టు ధర్మాసనం ముందు కు వచ్చింది. దాదాపు 45 నిమిషాలపాటు వాదప్రతివాదనలు జరిగాయి.
కేసీఆర్ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది అదిత్య సోంధి బలంగా వాదనలు వినిపించారు. ఆయనతో ఏకీభవించిన ధర్మాసనం.. హైకోర్టు రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలను తోసిపుచ్చింది. పిటిషన్‌కు నం బర్ను కేటాయించాలని ఆదేశించింది. జస్టిస్ నరసింహారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ పిటిషనర్ అభియోగాలు మోపిన నేపథ్యంలో, పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపడతామని వెల్లడించింది.
అయితే, విద్యుత్తు విచారణ సంఘం కాలపరిమితి ఈ నెలాఖరుతో ముగుస్తున్నదని, కమిషన్ తన విచారణ నివేదికను ఈ నెల 30వ తేదీ వరకు ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉన్నదని సోంధి పేర్కొన్నారు. గడువు పమీపిస్తున్న కారణంగా విచారణపై స్టే విధించాలని ఆయన కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. పిటిషన్‌కు నెంబర్ కేటాయింపుపై రిజిస్ట్రీ లేవనెత్తిన అంశం వరకే నేటి(గురువారం) విచారణ పరిమితమైందని అందువల్ల కమిషన్‌పై స్టే జారీ చేయలేమని స్పష్టం చేసింది. కేసీఆర్ పిటిషన్‌లోని అంశాలపై శుక్రవారం విచారణ చేపడతామని వెల్లడించింది.
కేసీఆర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆదిత్య సోంధి వాదనలు వినిపించారు. విచారణ ఎలా ఉండాలో కమిషన్ ఏర్పాటు నోటిఫికేషన్లోనే దిశానిర్దేశం చేసినట్టుగా ఉన్నదని, ఇది చట్ట వ్యతిరేకమని తెలిపారు. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కూడా ఏకపక్షంగా వ్యవహరించారని చెప్పారు. పిటిషనర్ విచారణకు హాజరుకావాలని ఏప్రిల్ 14న విచారణ సంఘం నోటీసులు జారీ చేసిందని, అయితే లోక్‌సభ ఎన్నికల ప్రచార హడావుడిలో ఉన్నందున తనకు జూన్ 15వ తేదీ వరకు గడువు ఇవ్వాలంటూ కేసీఆర్ కమిషనర్‌కు లేఖ రాశారని వివరించారు.
అయితే అంతలోనే జస్టిస్ నరసింహారెడ్డి ఈ నెల 11వ తేదీన విలేకరుల సమావేశం నిర్వహించారని చెప్పారు. ఈ సందర్భంగా ధర్మాసనం కల్పించుకొని ‘జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారా?’ అని ప్రశ్నించారు. దీనికి సోంధి అవునని సమాధానం ఇచ్చారు. ‘విలేకరుల సమావేశం నిర్వహించడమే కాదు, అప్పటివరకు జరిపిన విచారణ గురించి కూడా ఆయన బాహాటంగా వెల్లడించారు. పైగా విద్యుత్ కొనుగోలు ధర ఎకువగా నిర్ణయించారంటూ విచారణ పూర్తికాకముందే ఒక నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే విచారణలో 25 మందిని గుర్తించామని, మాజీ సీఎం కేసీఆర్, మరొక అధికారిని విచారణకు రావాలని నోటీసులు ఇస్తే గడువు కోరారని కూడా జస్టిస్ నరసింహారెడ్డి చెప్పారు.
పూర్తి స్థాయిలో విచారణ ముగించకుండానే, పిటిషనర్ వాదనలు వినకుండానే ఏకపక్షంగా తన వైఖరిని బహిర్గతం చేయడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధం’ అని సోంధి గుర్తు చేశారు. జస్టిస్ నరసింహారెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించడాన్ని తప్పుపడుతూ కేసీఆర్ లేఖ రాశారని సోంధి పేర్కొన్నారు. పరిధిని దాటిన కారణంగా విచారణ నుంచి తప్పుకోవాలని కోరారన్నారు. దీనిపై జస్టిస్ నరసింహారెడ్డి నుంచి స్పందన రాలేదన్నారు. తప్పు జరిగిపోయిందంటూ నోటీసు దశలోనే కమిషన్ నిర్ణయానికి వచ్చేయడాన్ని, ఈ విషయాన్ని విలేకరుల సమావేశంలో వెల్లడించడాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు. కమిషన్ ఈ నెల 30న ప్రభుత్వానికి నివేదికను అందజేయనున్నదని తెలిపారు. ఆలోగా హైకోర్టు స్పందించాలని కోరారు.
‘పీలా పోతినాయుడు ఏలేరు కుంభకోణం’పై ఏర్పాటైన జస్టిస్ బీకే సోమశేఖర కమిషన్‌ను సవాల్ చేసిన కేసులో హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి స్వయంగా వెలువరించిన తీర్పు ఈ కేసుకు బాగా వర్తిస్తుందని ఆదిత్య సోంధి తెలిపారు. విచారణ కమిషన్ బాధ్యతలు నిర్వహించే వ్యక్తికి కాండక్ట్ ఉండాలని ఆ తీర్పులో పేరొన్నారని గుర్తుచేశారు.
అయితే ప్రస్తుత ఘటనలో విచారణ సంఘం తన బాధ్యతలను పక్షపాతంగా, ఏకపక్షంగా నిర్వర్తిస్తున్నదని, విలేకరుల సమావేశంలో వెల్లడించిన విషయాలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీస్ యాక్ట్ ప్రకారం ఏర్పడే విచారణ సంఘాలకు నిర్దిష్ట బాధ్యతలు మాత్రమే ఉంటాయని రామకృష్ణ దాల్మియా కేసులో కోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపారు.
విచారణ సంఘం కోసం ప్రభుత్వం వేసిన నోటిఫికేషనే లోపభూయిష్టంగా ఉన్నదని సోం ది తెలిపారు. విద్యుత్తు కొనుగోళ్లు, విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాట్లల్లో అక్రమాలు జరిగాయంటూ కమిషన్‌కు దిశానిర్దేశం చేయడం తప్పు అని స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కమిషన్ తన పరిధిని దాటి విచారణ పూర్తి కాకుండా, అసంపూర్తి సమాచారం ఆధారంగా మీడియాకు వివరాలు వెల్లడించడం దాల్మియా కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పునకు వ్యతిరేకం అని సోంధి వాదించారు.
కమిషన్ ఏం చేయబోయేదీ ముందే విలేకరులకు చెప్ప డం చట్ట వ్యతిరేకమని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కమిషన్‌కు న్యాయపరమైన అధికారాలు ఉండవని, కమిషన్ తన ఎదుట ఉన్న అంశంపై విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక మాత్రమే ఇవ్వాలని స్పష్టం చేశా రు. ఈ నిబంధనను జస్టిస్ నరసింహారెడ్డి ఉల్లంఘించారని పేర్కొన్నారు.
యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్ ఏర్పాటుకు వినియోగించే సాంకేతికత వల్ల ప్రభుత్వానికి రూ.వెయ్యి కోట్ల వరకు నష్టం వస్తుందని, ఇప్పటికే రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు నష్టం వచ్చిందని కూడా జస్టిస్ నరసింహారెడ్డి తేల్చేశారని పేర్కొన్నారు. దీని ద్వారా కమిషన్ తుది నివేదిక ఏవిధంగా ఉండబోతున్నదో కూడా స్పష్టం అవుతున్నదని సోంధి చెప్పారు. కమిషన్ ఏకపక్షంగా వ్యహరిస్తున్నదని చెప్పడానికి ఇవే నిదర్శమని వాదించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే జస్టిస్ నరసింహారెడ్డిని వ్యక్తిగతంగా ప్రతివాదిగా చేయాల్సివచ్చిందని సోంధి వివరించారు.
సోంధి వాదనలు కొనసాగుతున్న దశలో ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి కల్పించుకున్నారు. పిటిషన్‌కు రిజిస్ట్రీ నంబర్ కేటాయించేందుకు నిరాకరించిన అంశంపై వాదనలు వినిపించకుండా విద్యుత్తు వ్యవహారాలపై వాదనలు వినిపించడాన్ని వ్యతిరేకరించారు. దీనిపై సీనియర్ న్యాయవాది ఆదిత్య సోంధి కల్పించుకొని.. కేసు వివరాలు చెప్తేనే జస్టిస్ నరసింహారెడ్డిని ఎందుకు ప్రతివాదిగా చేయాల్సివచ్చిందో తెలుస్తుందని, అందుకే వివరాలన్నీ చెప్పాలని కోరారు. దీనిపై స్పందించిన ధర్మాసనం కేసు వివరాలు చెప్పకపోతే పిటిషన్‌కు నంబర్ కేటాయించాలో లేదో ఎలా నిర్ణయించగలమని ప్రశ్నించింది.
గత ప్రభుత్వంలో విద్యుత్తు వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయని చెప్పడం, దీనికి అనుగుణంగా కమిషన్ పిటిషనర్‌కు 8-బీ ప్రకారం నోటీసు ఇవ్వడం చెల్లదని సోంధీ వాదించారు. మాజీ సీఎం కోట్ల విజయభాసర్‌రెడ్డి వర్సెస్ ఏపీ ప్రభుత్వం మధ్య జరిగిన కేసులో హైకోర్టు ఈ మేరకు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ఆమోదించిందని గుర్తుచేశారు. నామినేషన్ ప్రాతిపదికపై నిర్ణయం తీసుకున్నారని, ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టం చేకూరిందని చెప్పే అధికారం కమిషన్‌కు లేదని తెలిపారు.
గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నింటినీ ఎస్ఈఆర్సీ (రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ అథారిటీ) ఆమోదించిందని చెప్పారు. న్యాయప్రాధికార సంస్థ అ యిన ఈఆర్సీ నిర్ణయాలపై విచారణ సంఘాన్ని ఏర్పాటు చేయడానికి వీలు లేదన్నారు. ఎస్ఈఆర్సీ నిర్ణయం చట్టవిరుద్ధంగా ఉందని భావిస్తే, ఆప్టెప్‌లు సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఉన్నదన్నారు. ఇవేమీ చేయకుండా గత ప్రభుత్వం తప్పు చేసిందని నిర్ధారణకు వచ్చేసినట్లుగా కమిషన్ ఏర్పాటుకు నోటిఫికేషన్ ఇవ్వడం, ఆ తర్వాత విచారణ సంఘం వ్యవహరించిన తీరును తీవ్రంగా పరిగణించాలని ధర్మాసనాన్ని సోంధీ కోరారు.
రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే విచారణ సంఘాన్ని ఏర్పాటు చేశారని సోంధి వాదించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వా త విద్యుత్తు సమస్యలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో నామినేషన్ విధానంలో ఛత్తీస్‌గఢ్ – తెలంగాణ మధ్య ఒప్పందాలు జరిగాయని తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందాలు లే దా వివాదాలపై విచారణ సంఘం వేసేందుకు వీలు లేదని పేర్కొన్నారు.
రాజ్యాంగ ధర్మాసనాలే ఆ వివాదాలపై విచారణ చేసి ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. పర్యావరణ అనుమతులు పొందిన తర్వాతే భదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్తు ప్లాంట్లపై అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. విద్యుత్తు రెగ్యులేటరీ కమిషన్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) అనుమతులు ఇచ్చాయని, కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చిందని పేర్కొన్నారు. కాబట్టి కేవలం రాజకీయ కక్షతోనే ఏదో తప్పు జరిగిందని చూపేందుకు ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటు చేసిందన్నారు.
ప్రతిష్ఠాత్మకమైన బీహెచ్ఈఎల్ ద్వారా పనులు చేయించుకునేందుకు నామినేషన్ విధానాన్ని ఎంచుకున్నట్టు చెప్పారు. సబ్ క్రిటికల్ టెక్నాలజీ, సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వ్యవహారంపై కూడా కమిషన్ తన వైఖరిని వెల్లడించడం చెల్లదని వాదించారు. ఏది మంచో, ఏది ఉత్తమ మో బహిరంగంగా చెప్పే అధికారం కమిషన్‌కు లేనేలేదని స్పష్టం చేశారు. కమిషన్‌కు న్యాయపరమైన అధికారాలు లేవని చెప్పారు. కమిషన్ కేవలం ప్రభుత్వానికి సిఫార్సులతో కూడిన నివేదిక మాత్రమే ఇవ్వాలని సోంధీ పేర్కొన్నారు.
గతంలో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం, మాజీ సీఎం కే విజయభాసర్‌రెడ్డి మధ్య జరిగిన కేసులో హైకోర్టు వెలువరించిన తీర్పునకు విరుద్ధంగా జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ తీరు ఉన్నదని సోంధి వాదించారు. కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీస్ యాక్ట్ సెక్షన్ 8(3) విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సైతం సమర్థించిందని తెలిపారు. ధర్మాసనం వెలువరించిన ఆ తీర్పులో కమిషన్‌కు న్యాయపరమైన అధికారాలు లేవని చెప్పిందని గుర్తుచేశారు.
విచారణ సంఘం విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక మాత్రమే ఇవ్వాలని, ఎవరికైనా శిక్షలు విధించడం, జరిమానాలు విధించడం వంటి ఉత్తర్వుల జారీ అధికారం కమిషన్‌కు ఉండవని సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా చెప్పిందని పేర్కొన్నారు. ఉదాహరణకు మానవ హకుల కమిషన్ సిబ్బందికి జీతాలు చెల్లించాలన్న ఉత్తర్వులను రాజ్యాంగ ధర్మాసనాలు రద్దు చేశాయని గుర్తు చేశారు. కమిషన్ న్యాయ నిర్ణయాలు వెల్లడించేందుకు చట్టంలో వెసులుబాటు లేదని వివరించారు.