Telugu Flash News

Kanna Lakshminarayana: ఏపీ బీజేపీలో కలకలం.. కన్నా రాజీనామా, సోముపై విమర్శలు

kanna lakshminarayana quits bjp

kanna lakshminarayana quits bjp

బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ(Kanna Lakshminarayana) ఆ పార్టీకి రాజీనామా చేశారు. కొంత కాలంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తిగా ఉంటున్న ఆయన.. ఇప్పుడు నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. ఈ ఘటనతో ఆంధ్రప్రదేశ్‌ బీజేపీలో కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఏపీ బీజేపీలో హాట్‌ టాపిక్‌గా మారిన కన్నా రాజీనామా వ్యవహారంపై అటు టీడీపీ, జనసేనలోనూ ఆసక్తిగా మారింది.

తాను బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీకి రాజీనామా చేసినట్లు కార్యకర్తలకు తెలిపారు. కన్నా నివాసంలో కార్యకర్తల సమక్షంలో పార్టీ మారే అంశంపై నిర్ణయం జరిగినట్లు తెలుస్తోంది. టీడీపీలో చేరతారా? లేక జనసేనలోకి వెళ్తారా? అనే అంశంపై ప్రస్తుతానికి సస్పెన్స్‌ నెలకొంది. అయితే, ఈ నెల 23న టీడీపీలో చేరుతారంటూ ప్రచారం జరుగుతోంది. గతంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు అండగా ఉంటానంటూ కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పని చేసిన కన్నా.. బీజేపీ నుంచి వెళ్లిపోవడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. జాతీయ నాయకత్వం బాగానే ఉన్నప్పటికీ.. రాష్ట్ర నాయకత్వంపై అలకబూనిన కన్నా.. రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. మరీ ముఖ్యంగా ప్రస్తుత ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యవహార శైలి నచ్చకపోవడం వల్లనే పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు కన్నా స్పష్టం చేశారు. 2014లో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై ఇష్టంతో బీజేపీలో చేరానని, పార్టీ ఎదుగుదలకు కృషి చేసినందువల్లనే తనకు రాష్ట్ర అధ్యక్ష పదవి లభించిందని కన్నా చెప్పుకొచ్చారు.

2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు కేవలం 9 నెలల ముందు తనకు అధ్యక్ష పదవి ఇచ్చారన్నారు. అయినప్పటికీ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో తిరిగి పార్టీ పరిస్థితిని చక్కదిద్దేందుకు యత్నించానని చెప్పారు. అన్ని నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను నిలబెట్టానని కన్నా తెలిపారు. తర్వాత కరోనా కారణంగా అన్ని రాజకీయ కార్యక్రమాలు మందగించాయన్నారు. తాను ఎంత కష్టపడినా తనను పదవి నుంచి పక్కనబెట్టారని, సోము వీర్రాజుకు అవకాశం కల్పించారని కన్నా వాపోయారు.

also read :

Prithvi Shaw : సెల్ఫీలు ఇవ్వలేదనే కోపంతో క్రికెటర్‌ పృథ్వీ షాపై దాడి..

Taraka Ratna : తారకరత్న హెల్త్‌ అప్‌డేట్‌ రిలీజ్‌.. ప్రస్తుతం ఎలా ఉందంటే..

 

Exit mobile version