Telugu Flash News

Japan PM: జపాన్‌ రాజకీయాల్లో కలవరం.. ప్రధానిపై బాంబు దాడి..

Japan PM News : జపాన్‌లో బాంబు దాడులు కలకలం రేపాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడ బాంబులతో దాడులు చేయడం ఇప్పటికే ప్రజలు చూశారు. తాజాగా జపాన్‌ ప్రధాని లక్ష్యంగా దుండగులు బాంబు దాడికి పాల్పడ్డారు. దీంతో ఈ ఘటనపై ప్రపంచ వ్యాప్తంగా దేశాల అధినేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదృష్టవశాత్తు జపాన్‌ ప్రధాని ఈ ఘటనలో ప్రాణాలతో సురక్షితంగా బయటపడటం ఊరట కలిగించింది. ఎన్నికల ప్రచారంలో అనూహ్య పరిణామం చోటు చేసుకోవడంతో దేశ ప్రజలు దిగ్భ్రాంతి చెందారు. రాజకీయ నేతలంతా ఉలికిపాటుకు గురయ్యారు.

జపాన్‌లో స్థానిక ఎన్నికల ప్రచారంలో భాగంగా దేశ ప్రధానమంత్రి ఫుమియొ కిషిద పర్యటిస్తున్నారు. ఆయన్ను లక్ష్యంగా చేసుకొని గుర్తు తెలియని దుండగుడు బాంబు దాడి చేశాడు. వెస్ట్‌ జపాన్‌లోని సైకజకి ఓడరేవు సమీపంలో శనివారం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అయితే, ఇదే తరహాలో తొమ్మిది నెలల కిందటే ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన దాడిలో మాజీ ప్రధాని షింజో అబె ప్రాణాలు కోల్పోయిన ఘటనను ప్రజలు గుర్తు చేసపుకుంటున్నారు. ఆ ఘటన మరువకముందే ఇలా మరోసారి ప్రధానిపై బాంబు దాడికి పాల్పడటం జపాన్‌ రాజకీయాల్లో కలవరం రేపుతోంది.

తాజాగా కిషిదను లక్ష్యంగా చేసుకొని బాంబు విసిరినట్లు అనుమానిస్తున్న దుండగుడిని ప్రధాని భద్రతా బలగాలు గుర్తించాయి.

వెనువెంటనే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి మరో బాంబును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా భాగా పొగలు కమ్మేశాయి. అయితే, ఈ ఘటనలో భద్రతా సిబ్బంది వెంటనే స్పందించడంతో ప్రధాని సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం ప్రచార కార్యక్రమాన్ని ప్రధాని కొనసాగించడం గమనార్హం.

ఆ దేశ స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన అభ్యర్థి తరఫున ప్రచారం చేయడం కోసం ప్రధాని కిషిద వెళ్లారు. ప్రధానమంత్రి సమీపంలో ఏదో వస్తువు పడగానే భద్రతాబలగాలు అప్రమత్తమయ్యాయి. ప్రధానిని కాస్త దూరంగా తీసుకెళ్లాయి. అనంతరం తెల్ల ముసుగు ధరించిన దుండగుడిని చుట్టుముట్టి అతని చేతుల్లో ఉన్న పొడవైన గొట్టం లాంటి వస్తువును స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఇంతలోనే ప్రధాని నిల్చున్న చోట పెద్ద శబ్దంతో పేలుడు జరిగింది. ఇక ఘటన నేపథ్యంలో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. మరోవైపు బాంబు దాడి ఘటన నుంచి జపాన్‌ ప్రధాని కిషిద సురక్షితంగా బయటపడటంతో తనకెంతో ఊరటనిచ్చిందని భారత ప్రధాని మోదీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

also read :

Kejriwal: దేశం కోసం నా ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధం.. బీజేపీ నేతలకు అహంకారం పెరిగిందన్న కేజ్రీవాల్‌ 

Rakesh-Sujatha : ఏంటి.. అప్పుడే రాకింగ్ రాకేష్‌, సుజాతల మ‌ధ్య గొడ‌వ‌లా..!

Exit mobile version