IPL 2023 : ఐపీఎల్‌లో చెలరేగిన ఓ వివాదం తాజాగా సద్దుమణిగింది. టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ చీఫ్ సౌరవ్ గంగూలీ (sourav ganguly), ప్రస్తుత టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ (virat kohli) ల మధ్య నెలకొన్న వివాదానికి తెర పడింది. ఐపీఎల్ 2023 సీజన్‌లో ఏప్రిల్ 15న ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ కాస్త అతిగా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ నెగ్గింది. మ్యాచ్ అనంతరం క్రీడాకారులంతా కరచాలనం చేసుకున్నారు.
ఈ సందర్బంగా విరాట్ కోహ్లీ.. సౌరవ్ గంగూలీకి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి సుముఖత చూపలేదు. అప్పుడు సోషల్ మీడియాలో ఇది హల్ చల్ చేసింది. తాజాగా శనివారం మరోసారి రెండు జట్ల మధ్య పోరు జరిగింది. ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్యజరిగిన ఈ మ్యాచ్‌లో డీసీ చాలా అవలీలగా ఆర్సీబీపై విజయం సాధించింది. ఈ క్రమంలో ఆర్సీబీ బౌలర్ మహ్మద్ సిరాజ్, ఢిల్లీ బ్యాటర్ సాల్ట్ మధ్య స్వల్పంగా మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఈ ఘటన నేపథ్యంలో కోహ్లీ, గంభీర్ గొడవను అందరూ గుర్తు చేసుకున్నారు.
అయితే, అంపైర్లు ఇద్దరు ఆటగాళ్లకు సర్దిచెప్పి పంపించేశారు. అంతటితో ఈ గొడవకు ఫుల్‌స్టాప్ పడింది. అయితే, మ్యాచ్ ముగిసిన తర్వాత మాత్రం కాస్త ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. గొడవ పడిన ఆర్సీబీ బౌలర్ మహ్మద్ సిరాజ్, ఢిల్లీ బ్యాటర్ సాల్ట్ ఇద్దరూ పరస్పరం హగ్ చేసుకొని కాంప్రమైజ్ అయ్యారు. ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కోహ్లీని చూసుకొని సిరాజ్ కూడా రెచ్చిపోతున్నాడని, అసలు గొడవకు కారణం సిరాజేనంటూ చాలా మంది కామెంట్లు పెట్టారు.
గత మ్యాచ్‌లోనూ కోహ్లీ, నవీనుల్ హక్ మధ్య గొడవకు సిరాజ్ కారణమని కామెంట్లు పెట్టారు. అంతకు ముందు మ్యాచ్‌లో కూడా ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడిన సందర్భంగా సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ ఒకరినొకరు ఆగ్రహంగా చూసుకోవడం.. కరచాలనం చేసుకొనేందుకు విముఖత చూపడం జరిగింది. అయితే, ఈసారి మాత్రం గంగూలీ వద్దకు వెళ్లిన విరాట్ అతడితో కరచాలనం చేసి కాసేపు మాట్లాడాడు. దీంతో సోషల్ మీడియాలో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈసారి లక్నోతో మ్యాచ్ జరిగితే గౌతమ్ గంభీర్ – విరాట్ ఇలానే కలిసిపోవాలని అభిమానులు కోరుతున్నారు.
also read :
Cyclone Mocha: తెలంగాణకు మోచా తుపాన్ ఎఫెక్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు